•  నిరాశ పరిచిన బడ్జెట్‌
 • మెప్పించని బడ్జెట్‌.. వేతన జీవులకు ఇచ్చినట్టే ఇచ్చి వాత
 • ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల అమ్మకం.. రైతులకు 4 స్కీమ్‌లు
 • డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ ఎత్తివేత
 • ఇన్వెస్టర్లపై తప్పని బాదుడు
 • నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
 • జాతీయ నియామక ఏజెన్సీ ఏర్పాటు
 • అన్ని జిల్లాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ ఆస్పత్రులు
 • అనుబంధంగా పీపీపీలో మెడికల్‌ కాలేజీలు
 • బ్యాంకు డిపాజిట్లపై బీమా 5 లక్షలకు పెంపు
 • కొత్త ఇంజనీర్లకు మునిసిపాలిటీల్లో ఇంటెర్న్‌షిప్‌
 • జాతీయ స్థాయిలో పోలీసు, ఫోరెన్సిక్‌ వర్సిటీలు
 • విద్యా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
 • నాలుగేళ్లలో వందకుపైగా కొత్త ఎయిర్‌పోర్టులు
 • కొత్తగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు
 • కరెంటు ఎక్కడ కొనుక్కోవాలో ఇక మీ ఇష్టం
 • భారత్‌ నెట్‌ పరిధిలోకి లక్ష గ్రామ పంచాయతీలు
 • రూ.5 కోట్ల వరకూ ఎంఎ్‌సఎంఈలకు నో ఆడిట్‌
 • మీ విరాళాల వివరాలు నేరుగా రిటర్నుల్లోకి
 • ప్రైవేటు పెన్షనర్ల ‘కనీస పింఛను’ పెంపు లేనట్టే
 • ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ ట్రస్టు ఏర్పాటు
 • పంట ఉత్పత్తుల రవాణాకు రైళ్లు, విమానాలు
 • ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో గ్రామానికో గోదాము
 • 20 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపుసెట్లు

సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగం చేయలేక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నీరసపడిపోయారు. 2 గంటల 41 నిమిషాల పాటు రికార్డు స్థాయి ప్రసంగం చేసిన ఆమె చివర్లో అలసిపోయారు. మూడుసార్లు మంచినీళ్లు తాగారు. సిబ్బంది మంచినీళ్లు తెచ్చేలోగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇచ్చిన చాక్లెట్‌ను తిన్నారు. మరో మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కూడా నిర్మల వద్దకు వచ్చి చాక్లెట్‌ ఇచ్చారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా కూడా ఆమెతో మాట్లాడడం కనిపించింది. బడ్జెట్‌ ప్రసంగపాఠం ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగా ఆమెకు ఓపిక సన్నగిల్లింది. ఇక ప్రసంగించలేక అక్కడితో ముగించారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతం…
ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచుతుంది. కొత్త దశాబ్దంలో ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తుంది. ప్రజల ఆదాయం, పెట్టుబడులతో పాటు డిమాండ్‌, వినియోగాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ, రుణ పరపతిని శక్తిమంతం చేస్తుంది. కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన అన్న మా ప్రభుత్వ విధానానికి ఈ బడ్జెట్‌ మరింత ఊతమిస్తుంది. పన్నుల ప్రక్రియను కూడా ఇది సులభతరం చేసింది. ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచేందుకే ప్రాధాన్యమిచ్చింది. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు ఈ బడ్జెట్‌ దోహదపడుతుంది.

 ప్రధాని నరేంద్రమోదీ

అంతా ఆశించినట్లు ఆదాయ పన్ను రేట్లు తగ్గించారు! కానీ, తగ్గింపు కావాలా!? రాయితీలు కావాలా!? అంటూ మెలిక పెట్టారు! కంపెనీలకు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ ఎత్తేశారు! ఇన్వెస్టర్ల నుంచి పన్ను పీకడానికి ఎత్తులు వేశారు! ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగుల ‘కనీస పింఛను’ పెంపు ఆకాంక్షను పట్టించుకోలేదు! రైతులకు 16 అంశాలతో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. కానీ, వారికి నేరుగా ఒనగూరే లబ్ధి ఏమిటో వివరించలేదు! జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నా.. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించనున్నారో వెల్లడించలేదు. మహిళా పథకాల గురించి గొప్పగా చెప్పారు. కానీ, మహిళలకు ఈసారి బడ్జెట్‌లో ఏం ప్రకటించారో స్పష్టం చేయలేదు.వెరసి, వివిధ వర్గాల ఆశలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నీళ్లు చల్లారు! బడ్జెట్‌ ఏదైనా వేతన జీవులపైనే పన్ను భారమని మరోసారి రుజువు చేశారు! అదే సమయంలో.. మాంద్యంతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ‘నగదు కళ’ తెప్పించడానికి బడ్జెట్లో ప్రయత్నించారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ‘పొదుపు సంప్రదాయాని’కి స్వస్తి చెప్పి.. వేతన జీవులతో ఖర్చు పెట్టించడానికి కంకణం కట్టుకున్నారు! ప్రజల ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచడమే ధ్యేయంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.

అంకెల్లో బడ్జెట్‌ రూ. కోట్లలో
మొత్తం బడ్జెట్‌ 30,42,230
పన్ను ఆదాయం 16,35,909
పన్నేతర ఆదాయం 3,85,017
మూలధన వసూళ్లు 10,21,304
రెవెన్యూ లోటు 6,09,219
ద్రవ్య లోటు 7,96,337

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం మధ్యాహ్నం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన రికార్డును తానే తిరగరాస్తూ సుదీర్ఘంగా 2.41 గంటలపాటు ప్రసంగించారు. చివరకు, ఓపిక సన్నగిల్లడంతో ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే ముగించారు. ఏకంగా 160 నిమిషాలపాటు ప్రసంగించినా.. ఏ వర్గాన్నీ ఆర్థిక మంత్రి సంతృప్తిపరచలేకపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు ఏమీ బడ్జెట్లో లేవు. ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయి. ప్రభుత్వం కేటాయించిన రూ.60 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని ఆరోగ్య సంరక్షణ నిపుణులు అంటున్నారు. స్టాక్‌ మార్కెట్‌ ఏకంగా ఒక దశలో 1000 పాయింట్లకుపైగా పడిపోయిందంటే బడ్జెట్‌ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. రాబోయే ఐదేళ్లలో వంద లక్షల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రకటించినా.. ఆ రంగానికి చెందిన ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ వంటి కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి.. ఈ బడ్జెట్‌పై ఆటోమొబైల్‌ రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కానీ, ఆ రంగానికి ఎలాంటి ప్రత్యక్ష ప్రయోజనాలను ప్రక టించలేదు. సేవా రంగానికి సంబంధించి ఎగుమతులను వేగవంతం చేయడంపై దృష్టి సారించలేదు. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)ని పట్టించుకోలేదు. దేశానికి పెను సవాలుగా మారిన ద్రవ్య లోటును గత ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఇంకా తగ్గించాల్సి ఉండగా.. పెంచి చూపించడం దేశ ఆర్థిక పరిస్థితికి దర్పణం పడుతోంది. ఇంకా చెప్పాలంటే.. లోక్‌సభలో ఆమె ప్రసంగం చదువుతుంటే.. చాలా సందర్భాల్లో బీజేపీ సభ్యులు కూడా నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయారు. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ నేతలు తప్ప బడ్జెట్‌ను ప్రశంసించేవారే కరువయ్యారు. కాగా, కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటూ ఇప్పటికే ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు మరో చేదు కబురు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలో 1 శాతం కోత పడింది.

ఇప్పటి వరకూ ఉన్న 42 శాతం రాష్ట్రాల వాటాను 41 శాతానికి 15వ ఆర్థిక సంఘం తగ్గించింది. ఈ మేరకు సర్కారుకు మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇటు బడ్జెట్‌ నిరాశ పరచడం.. అటు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించడంపై ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కాగా, 2006-16 మధ్య కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని, ఇది మనందరికీ గర్వకారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో చెప్పారు. విచిత్రంగా, ఆ దశాబ్దంలో ఎనిమిదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, కేవలం రెండేళ్లు మాత్రమే బీజేపీ అధికారంలో ఉండడం గమనార్హం.

Courtesy Andhrajyothi