అన్నదాతల ఆత్మహత్యలతో రైతు కుటుంబాలు రోడ్ల పాలు
లోటు పూడ్చుకునే క్రమంలో మరింత అగాథంలోకి..: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ అధ్యయనం 

అన్నదాతలే కడపుకోతకు గురవుతున్నారు. పంట చేతికి రాక.. వచ్చినా మద్దతు ధర అందక.. మనస్తాపానికి గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, భవిష్యత్‌పై ఆశలు సన్నగిల్లడంతో ప్రాణాలను అర్ధాంతరంగా ముగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు చితికిపోతున్నాయి. ఆ లోటును పూడ్చుకునేందుకు.. జీవనాన్ని సాగించేందుకు మరింత అప్పుల పాలవుతున్నాయి. తినే తిండిలోనూ కోతపెట్టుకుంటున్నాయి. అంతేకాదు, తక్కువ మొత్తాలకు వారు పని చేస్తున్నట్టు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలతో ‘వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు’ పేరిట నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌), హైదరాబాద్‌ అధ్యయనం చేపట్టింది. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణలలో రైతుల కుటుంబాల స్థితిగతులను పరిశీలించింది.
అప్పు కిందకు పని కుదిరారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు మృతి చెందిన కుటుంబ సభ్యుడి లోటును పూడ్చుకునేందుకు పలుమార్గాలను అనుసరించాయి. 27శాతం కుటుంబాలు ఇతరుల నుంచి అప్పులు చేశాయనీ, 21 శాతం కుటుంబాలు ఫార్మల్‌ లోన్లు తీసుకున్నాయని అధ్యయనంలో తేలింది. పాలు, గుడ్లలాంటి ఆహారాన్ని కూడా ఆ కుటుంబాలు తగ్గించుకున్నాయని తెలిపింది. అంతేకాదు, ఎనిమిది శాతం కుటుంబాలు ఆస్తులను అమ్ముకున్నాయనీ, తీసుకున్న అప్పుకిందకు పనికి కుదిరినవారు 5.4శాతం మంది అని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అప్పుల కిందకు పనిలో కుదురుతున్నవారు అధికంగా ఉన్నారనీ, ఒకప్పటి ఆచారం అక్కడ మళ్లీ వేళ్లూనుకుంటున్నదని తేల్చింది. నాలుగైదు సంచుల బియ్యానికి లేదా గోధుమలకు బాధిత కుటుంబ సభ్యులు అందులోనూ అధికంగా పిల్లలు జీతముంటున్నారని వివరించింది. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఓ వైపు మోడీ సర్కారు చెబుతున్నది. కాగా, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఆర్జన అత్యంత స్వల్పంగా ఉండటం గమనార్హం. 2016-17లో బాధిత రైతు కుటుంబాలు నెలకు రూ. 3,523 రూపాయలు సంపాదిస్తున్నాయని వివరించింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో 92శాతం కేంద్రం ప్రవేశపెట్టిన పంట ఇన్సూరెన్స్‌ పథకంలో ఎన్‌రోల్‌ కాకపోవడం గమనార్హం. ఈ సర్వే కాలానికి ముందు మూడేండ్లలో రైతు కుటుంబాలు.. అతివృష్టి, అనావృష్టి, పురుగుల వల్ల పంటలను నష్టపోగా.. చాలావరకు మూడు నుంచి నాలుగు లక్షల రుణాలను కలిగి ఉన్నాయి.
మృతి చెందిన రైతుల్లో చాలా మంది యువకులే. పనిచేసే వయసు(20-50 ఏండ్ల)లో ఉన్నవారు కావడం గమనార్హం. 59శాతం మంది నిరక్షరాస్యులు. ఈ ఆత్మహత్యలు అధికంగా పంట చేతికొచ్చే కాలంలోనే చోటుచేసుకున్నాయి. 47శాతం కుటుంబాలు రుణాలు తిరిగి చెల్లించాలన్న వేధింపులకు గురైనవే కావడం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఎక్కువగా అత్యల్ప భూమి(1.5 నుంచి 3.7 ఎకరాలు)ని కలిగి ఉన్నాయి. తెలంగాణ, కర్నాటకలో సగటున 1.5 ఎకరాల భూమి కలిగిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే ఈ కుటుంబాలు నేరుగా బ్యాంకు రుణాలు, ఇన్సూరెన్స్‌లు పొందలేకపోతున్నాయి.

 

(Courtacy Nava Telangana)