• నలుగురికీ ఏక కాలంలో శిక్ష
  • ఉదయం 7 గంటలకు అమలు
  • డెత్‌ వారంట్లు జారీ చేసిన పటియాలా హౌస్‌ కోర్టు
  • వెక్కి వెక్కి ఏడ్చిన దోషులు
  • సిద్ధం చేస్తున్న జైలు అధికార్లు
  • బిహార్‌లోని బక్సర్‌ జైల్లో సిద్ధంగా ఉరితాళ్లు

న్యూఢిల్లీఏడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ‘నిర్భయ’కు న్యాయం జరిగింది! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తిహార్‌ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్‌ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దోషులు ముఖేశ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌(31)లకు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్‌ వారెంట్లు జారీ చేశారు. దోషులు దాఖలు చేసుకున్న అన్ని రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, క్యూరేటివ్‌ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఇటు కోర్టుల్లో కానీ అటు రాష్ట్రపతి వద్ద కానీ ప్రస్తుతానికి పెండింగులో ఏమీ లేవని ప్రాసిక్యూషన్‌ కోర్టుకు స్పష్టం చేసింది.

నలుగురికీ డెత్‌ వారంట్లు జారీ చేయాలని కోరింది. అయితే, తాము సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్లను దాఖలు చేయాలని భావిస్తున్నామని ఇద్దరు దోషుల తరఫు న్యాయవాదులు తెలిపారు. దాంతో, డెత్‌ వారంట్లు జారీ చేసిన తర్వాత.. వాటిని అమలు చేయడానికి మధ్యలో కూడా కావాలనుకుంటే దోషులు క్యూరేటివ్‌ పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చని, అందువల్ల, దోషులకు డెత్‌ వారంట్లు జారీ చేయాలని ప్రాసిక్యూషన్‌ కోర్టుకు విన్నవించింది. తన స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 23 సంవత్సరాల పారామెడికల్‌ విద్యార్థి నిర్భయను 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి పాశవికంగా అత్యాచారం చేశారు. సింగపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 29వ తేదీన ఆమె మరణించింది. నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ తీహార్‌ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు జువెనైల్‌ కావడంతో మూడేళ్లపాటు బాలల సంస్కరణ గృహంలో ఉంచి విడుదల చేశారు. మిగిలిన నలుగురు నిందితులకు ట్రయల్‌ కోర్టు, ఢిల్లీ హైకోర్టు విధించిన మరణ శిక్షను 2017 మే 5న సుప్రీం కోర్టు ఖరారు చేసింది. దోషుల రివ్యూ పిటిషన్లను గత ఏడాది జూలై 9వ తేదీన కొట్టివేసింది.

వెక్కి వెక్కి ఏడ్చిన దోషులు
తమను ఉరి తీసే తేదీని ప్రకటించిన వెంటనే దోషులు నలుగురూ వెక్కి వెక్కి ఏడ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దోషులకు డెత్‌ వారంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ప్రాసిక్యూషన్‌ (ఢిల్లీ ప్రభుత్వం) పాటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ మంగళవారం కొనసాగింది. నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. జడ్జి కోర్టు గదిలోకి వచ్చిన కొన్ని క్షణాల్లోనే మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లిపోవాలని నిర్దేశించారు. నలుగురు దోషులతోనూ మాట్లాడారు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగారు. తర్వాత విచారణను మధ్యాహ్నం 3.30 గంటలకు కోర్టు వాయిదా వేసిన కోర్టు.. నలుగురు దోషులకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేస్తూ ఆదేశాలిచ్చిది. ‘‘కోర్టు ఆదేశాలు అందాయి. వాటి ప్రకారం నలుగురి ఉరితీతకు ప్రణాళిక సిద్ధం చేస్తాం’’ అని జైలు వర్గాలు తెలిపాయి. నలుగురినీ ఏకకాలంలో ఉరి తీస్తామని తెలిపాయి.

బక్సర్‌ ఉరితాళ్లు..
నిర్భయ హంతకుల మరణ శిక్ష అమలుకు కావాల్సిన ఉరితాళ్లను బిహార్‌లోని బక్సర్‌ జైలులో తయారు చేశారు. వాటిని చేతితోనే పేనారని, ఒక్కో తాడు తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని బక్సర్‌ జైలు సూపరింటెండెంట్‌ విజయ్‌ అరోరా తెలిపారు.

Courtesy Andhrajyothi