• హత్యాచారానికి కుట్ర అతనిదే.. ఎదిరించిన నిర్భయపై దాడి
  • అప్పటి పోలీస్‌ చీఫ్‌ వెల్లడి.. పశుత్వమే పరిమార్చింది
  • అంత క్రూరమైన రేప్‌ ఎన్నడూ చూడలేదు
  • నిర్భయను గుర్తు చేసుకున్న డాక్టర్‌

 న్యూఢిల్లీ : నిర్భయను అతిపాశవికంగా రేప్‌ చేసి చంపేయడం వల్లే దోషుల చుట్టూ ఉచ్చు ఇంతగా బిగుసుకుందని డాక్టర్లు, పోలీసులు ఆనాటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘2012 డిసెంబరు 16 రాత్రి ఒంటినిండా గాయాలతో, రక్తంతో నిర్భయను సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి చూడగానే మాకు అర్థమైపోయింది. ఓ రకంగా ఆమె అక్కడికి తెచ్చేటప్పటికే చనిపోయినంత స్థితిలో ఉంది. ఆమెకు చికిత్స చేస్తున్నంత సేపూ మేమూ బాధతో విలవిల్లాడిపోయాం. ఆమె పేగుల్లోకి రెంచ్‌ పెట్టి పొడిచేశారు. పొత్తి కడుపును ఛిద్రం చేశారు. తెచ్చిన రోజే మాకు అర్థమైంది, ఆమె బ్రతకదని’’ అని ఆమెను ట్రీట్‌ చేసిన డాక్టర్‌ సునీల్‌ జైన్‌ చెప్పారు. ‘‘పేగు మార్పిడి జరిపితే తప్ప ఆమె బతకదు. అయితే ఇప్పటికీ ఇంటెస్టీనియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రపంచంలో అధ్యయన దశలోనే ఉంది. ప్రయోగాలు జరుగుతున్నాయి. అయినా సింగపూర్‌లోని ఆసుపత్రికి తరలించాం. లాభం లేకపోయింది’’ అని ఆయన చెప్పారు. ‘‘నేను దోషుల్లో ఒకడితో మాట్లాడాను. ఎందుకంత హింసించి, క్రూరంగా వ్యవహరించారని అడిగాను. ఆమె ప్రతిఘటించింది. అందుకే పొడిచేశాం’’ అన్నాడు. సఫ్దర్‌జంగ్‌, సింగపూర్‌ ఆసుపత్రుల డాక్టర్లు ఇచ్చిన నివేదికే ప్రాసిక్యూషన్‌కు ప్రధానాధారమైంది. అంతటి క్రౌర్యమే దోషుల కొంప ముంచింది.

ఓ హెన్రీ కథతో సారూప్యం!
‘దోషులను ప్రజల నుంచి కాపాడడం మాకు పెద్ద సవాల్‌గా మారింది. పోలీస్‌ స్టేషన్‌ బయట పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజానీకం  ఉండేవారు. వారి చేతికి చిక్కితే దోషుల్ని చంపేస్తారు. అందుకే మేం దొడ్దిదారిన, మురికివాడలు, చిన్నచిన్న గల్లీలు దాటుకుంటూ దోషుల్ని తీసికెళ్లే వాళ్లం’’ అని అనిల్‌ శర్మ అనే అదికారి చెప్పారు. అప్పుడు నేను వసంత్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్లో సీఐని. మొదట ఆ కేసు ఆ ఠాణాలోనే నమోదైంది. నిర్భయ నాకు తెలుసు. ఆమె ఇంటికి తరుచూ వెళ్లేవాడిని. మా ఇరువురి కుటుంబాలకు మంచి స్నేహం. ఓ హెన్రీ రాసిన ‘ది లాస్ట్‌ లీఫ్‌’ కథకు, నీ కథకు సారూప్యముందని నేను నిర్భయకు చెప్పాను. ఆమె ఆసుపత్రిలో ఉన్నపుడు కూడా నేనూ ఉండేవాణ్ణి. సింగపూర్‌ కూడా వెళ్లాను.  క్రిస్‌మస్‌ ఎలా జరుపుకోవాలో కూడా మేం ప్లాన్‌ చేసుకున్నాం… దురదృష్టవశాత్తూ ఆమె డిసెంబరు 29న చనిపోయింది’’ అని అనిల్‌ శర్మ బాధతో ఆమెను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ దోషుల ఉరితీతతో ఆమె ఆత్మకు శాంతి’’ అని సిట్‌కు చీఫ్‌గా వ్యవహరించిన అప్పటి డీపీసీ (దక్షిణ మండలం) ప్రమోద్‌ కుశావహ అన్నారు.

ఆకలిగొన్న తోడేళ్లు!
ఆనాటి పాశవిక దాడికి సూత్రధారి, అందులో ప్రధాన పాత్రధారి డ్రైవర్‌ రామ్‌సింగేనని అప్పటి ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ తెలిపారు. ‘బస్టా్‌పలో ఆగి ఉన్న నిర్భయను ఎక్కించుకున్నాక ఆమెను రేప్‌ చేయాలన్న కుట్ర అతడిదే. సహచరులకు అతనే ప్రోద్బలమిచ్చాడు.  రేపిస్టుల్లో ఒకడైన మైనారిటీ తీరని కుర్రాడు అందరికంటే క్రూరంగా వ్యవహరించాడన్నది మీడియాలో వచ్చింది. కానీ రామ్‌సింగే మోస్ట్‌ బ్రూటల్‌. నిర్భయ ప్రతిఘటించినపుడు ఆమెను రాడ్లతో కొట్టాలని చెప్పినదీ అతగాడే’ అని నీరజ్‌ కుమార్‌ వివరించారు. ‘ఖాకీ ఫైల్స్‌’ అని రాసిన ఓ పుస్తకంలో కూడా నీరజ్‌ సవివరంగా దీన్ని చెప్పారు. ‘ఆకలి మీదున్న తోడేళ్లలా వారంతా ఆమె మీద పడ్డారు. ప్రతిఘటించినందుకు రాడ్లతో  చిత్రహింసలు పెట్టారు’ అని పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi