ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న ప్రజల చేతుల్లో ఇప్పుడు మనకి అంబేద్కర్ చిత్రపటాలు కనబడుతున్నాయి. ఆయన ఆలోచనలు నిరసనకారుల ప్రసంగాలలో కూడా ప్రతిఫలిస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌర జాబితా,పౌరసత్వ సవరణ చట్టాలకి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. సామాజిక,ఆర్థిక,కుల,మతపరమైన అంతరాలన్నీ మరిచి జనాలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేసారు.

వారంతా మత ఆధారితంగా పౌరులకి పౌరసత్వం ఇవ్వాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తున్నారు‌. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని కాలరాయడమే ఔతుందని వారి భావన. అంతే కాకుండా డాక్యుమెంట్లు ప్రూఫ్ గా చూపించాలని దబాయించడం వల్ల మతంతో సంబంధం లేకుండా ఏ డాక్యుమెంట్లూ పొందలేని పేదవారంతా కూడా ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ నిరసనల తర్వాత మళ్లీ అంత భారీస్థాయి ప్రజా ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. కొత్త శతాబ్దంలో పుట్టిన విద్యార్థులంతా ఉదారవాద విధానాల నుంచి స్ఫూర్తి పొందిన భారతీయులుగా ఈ నిరసనలను ఎంతో బాధ్యతతో,శాంతియుతంగా చేపట్టడం కూడా ఈ నిరసనల్లో మనం ప్రధానంగా గమనించొచ్చు.

నిరసనకారులు ఉపయోగించిన సింబల్స్ లో భారత రాజ్యాంగ పిత అంబేద్కర్ దే అగ్రస్థానం. ఇప్పటివరకూ దళిత,వెనుకబడిన వర్గాల వారి పోరాటాలలో ప్రధాన భూమిక పోషించిన అంబేద్కర్ ఆలోచనలు ఇప్పుడు ఈ దేశవ్యాప్త నిరసనల్లో వీధుల్లో కనబడుతున్న ప్రతీ నిరసనకారుడి చేతిలోనూ ఆయన చిత్రపటాలుగా పరిణామం చెందడం మనం గమనించొచ్చు. ఇది చాలా కీలకమైన మార్పు.మన దేశ భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. పోలీసుల క్రూరత్వానికి సైతం బెదరకుండా ఉవ్వెత్తున ఎగసిన ఈ ప్రజా ఉద్యమాలు భారతదేశంలో రాజకీయ,సామాజిక పరమైన చైతన్యాన్ని తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

చరిత్రలో ప్రతీ నిరసనోద్యమాలలో జరిగినట్టుగానే ఇక్కడా NRC-CAA కి సంబంధించి రెండు ఇమేజెస్ మాత్రం ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒకటేమో బెంగళూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ గాంధీ బదులు అంబేద్కర్ చిత్రపటం చేతిలో పట్టుకున్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహది కాగా మరొకటి జామియా మసీద్ దగ్గర జరిగిన నిరసనల్లో చేతిలో రాజ్యాంగ ప్రతులను పట్టుకున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ది.

చేతుల్లో అంబేద్కర్ చిత్రపటాలతో పాటూ,జై భీమ్ నినాదాలు కూడా వీధుల్లో మార్మోగుతున్నాయి. ఈ నిరసనల్లో అందరికంటే చురుగ్గా ఈ శతాబ్దంలో జన్మించిన విద్యార్థులే ఉండడం గమనార్హం. వీరంతా రాజ్యాంగ విరుద్ధమైన బిల్లుని నిరసిస్తూ తమ హక్కుల సాధనకై పోరాడుతున్నారు. వీరందరిలోనూ అంబేద్కర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది,ఆయనని స్ఫూర్తిగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నినాదాల్లో,బ్యానర్లలో ఎక్కడ చూసినా అంబేద్కరే వినిపిస్తున్నారు,కనిపిస్తున్నారు.

ఈ మార్పుకు చాలా కారణాలున్నాయని చెప్పొచ్చు. స్వతంత్ర భారతంలో  దళిత బహుజనోద్యమాలు బలం పుంజుకోవడం వల్ల అంబేద్కర్ ని దేశవ్యాప్తంగా నిరసనలకి ప్రతీకగా అంగీకరించడం జరిగింది. ఈ ఉద్యమాల కారణంగానే ప్రజల్లో అంబేద్కర్ ఆలోచనలు చొచ్చుకుపోయాయి.

1970ల్లో వచ్చిన దళిత్ పాంథర్స్ మూమెంట్,1980 s లో దళిత బహుజన అస్తిత్వానికి పెద్ద పీట వేసే రాజకీయ పార్టీల ఆవిర్భావం,మండల్ కమిషన్ రికమండేషన్లు లాంటివన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలని,ఆలోచనలని ప్రజల మధ్యలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. అంబేద్కర్ ప్రభావం ఇంతలా పెరగడంలో ఆయన మన రాజ్యాంగం కూర్పుకి కృషి చేసిన కూడా ఉంది. ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటున్నారు.

1946 లో ఇండియా-పాకిస్తాన్ విభజన సమయంలో అంబేద్కర్ మాట్లాడుతూ “హిందూ రాజ్యం అనే ఆలోచన నిజంగా పరిణమిస్తే అది ఈ దేశానికి పెనుముప్పు గా మారుతుంది. హిందువులేం చెప్పినా కూడా హిందూయిజం మాత్రం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన సమానత్వం,స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం లాంటి భావనలని ఎప్పటికీ అంగీకరించబోదు” అని చేసిన ప్రసంగం ఇప్పటి పరిస్థితులకీ మనం అన్వయించొచ్చు.

హిందూ మతానికి వ్యతిరేకంగా,సామాజిక నైతికతని తలదన్ని ఆ స్థానంలో రాజ్యాంగ నైతికతని తీసుకొచ్చేలా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నేడు ఈ దేశప్రజలందరికీ స్ఫూర్తి కావాలి. అంబేద్కర్ చెప్పినట్టుగానే హిందూత్వ మెజారిటీ శక్తుల వల్ల తమకి ముంచుకొస్తున్న ఆపదని ప్రజలంతా పసిగట్టారు.

హిందూత్వ శక్తులకి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తి చేతిలోనూ అంబేద్కర్ ఇప్పుడో  ఆయుధంగా మారాడు. హిందూ రాజ్యానికి,ఫాసిజానికి వ్యతిరేకమైన అంబేద్కర్ ఆలోచనలూ,ఆశయాలూ నిరసనకారుల దృష్టిలో ఆయన్ని ఓ ఐకాన్ గా మార్చాయి. ఉత్తరప్రదేశ్ CAA-NRC నిరసనకారుల నుంచి అమరావతిలో అగ్రకుల పేదరైతుల వరకూ అంబేద్కర్ ఆలోచనలు,ఆశయాల నుంచి స్ఫూర్తి పొందినవారేనని అర్థమౌతోంది.

అంబేద్కర్,జై భీమ్ నినాదాలకి లభించిన ఈ జనామోదంతో భారతదేశ ప్రజలకి చట్టాల పట్ల,రాజ్యాంగ విధానాల పట్ల మంచి అవగాహన ఉన్నట్టుగా అర్థమౌతోంది‌. ప్రభుత్వ బలగాల నుంచి కూడా అంబేద్కర్ చిత్రపటాలతో నిల్చున్న నిరసనకారులకి అంత ప్రతిఘటన ఎదురుకావడం లేదు. వెనుకబడిన వర్గాలూ,అణచివేయబడ్డ వారి హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ ప్రాముఖ్యత ఇప్పుడు తమ హక్కుల పోరాటంలో నిమగ్నమైన పౌరులకి తెలిసొచ్చింది.

విభజన రాజకీయాలని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ ఆశయాలూ,ఆలోచనలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో ప్రతీ పౌరుడూ ఆలోచనాశీలిగా మారి తన సాటి పౌరుల పట్ల మైత్రీ భావనతో మెలుగుతూ ఇండియాని ప్రభుద్ భారత్ గా మార్చే ప్రక్రియలో పాల్గొనడం సాధ్యమౌతుంది.

రచయిత రెహ్మామోల్ పీ.ఆర్. జే ఎన్ యూ యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ స్టడీస్లో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ భారతి కాలేజీలో  పొలిటికల్ సైన్స్ బోధిస్తారు.