• డిష్‌ రిపేర్‌కు వచ్చి కేబుల్‌ వర్కర్‌ అఘాయిత్యం..
  • కరీంనగర్‌లో ఘటన.. నిందితుడిపై కేసు నమోదు
  • నెల్లూరులో మైనర్‌పై అత్యాచారం
  • పంజాబ్‌లో 8ఏళ్ల బాలికపై
  • పదో తరగతి బాలుడి రేప్‌

(న్యూస్‌ నెట్‌వర్క్‌): దేశవ్యాప్తంగా సోమవారం పలు అత్యాచార కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో తొమ్మిది నెలల నిండు గర్భిణిపై ఓ కేబుల్‌ టీవీ వర్కర్‌ అత్యాచారం జరిపాడు. ఈ నెల 9న మధ్యాహ్నం డిష్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన కనపర్తి రామకృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ విషయం బయటికి పొక్కకుండా పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి డబ్బు ముట్టజెప్పేందుకు బేరం కుదిరినట్లు సమాచారం. నెల్లూరులో.. పెళ్లై ఏడాది కూతురున్న ఏకుల అజయ్‌ అనే యువకుడు ఓ బాలికను మాయమాటలతో వంచించాడు. ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికకు గర్భస్రావం కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఏపీలోని కుప్పంలో పదేళ్ల బాలికపై మైనర్‌ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పంజాబ్‌లోని బియాస్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బడిలో పదో తరగతి బాలుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీలో కాన్పూర్‌ దేహాత్‌ జిల్లాలో మైనర్‌పై యోగేంద్ర అనే యువకుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెకు విషం తాగించి.. అతడు కూడా పురుగుల మందు తాగాడు. పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఒడిసాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. వీరిలో ఓ దివ్యాంగురాలు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న బాలికపై సుందరం అనే 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

విద్యార్థినులకు ఉపాధ్యాయుల వేధింపులు : విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు టీచర్లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా రొంపికుంట జడ్పీ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులతో ఇద్దరు ఉపాధ్యాయులు కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై తోటి విద్యార్థినులు ఈ నెల 8న 1098 నంబర్‌కు ఫోన్‌ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రేమించకపోతే గొంతు కోస్తా.. : కొత్తగూడెం క్రైం, డిసెంబరు 16: తన ప్రేమను అంగీకరించకపోతే గొంతు కోస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ రౌడీ షీటర్‌ మైనర్‌ బాలికను బెదిరించాడు. ఈ నెల 13న సాయంత్రం బాలిక కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆమెను అటకాయించి, గొంతుపై కత్తి పెట్టి తనను ప్రేమించని పక్షంలో గొంతు కోస్తానని బెదిరించాడు.

Courtesy Andhrajyothi