హైదరాబాద్: నిమ్స్‌ ఆస్పత్రిలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్‌ ఇవ్వలేదని, అన్ని అర్హతలున్నప్పటికీ అర్హులు కాదని, ఇతరులకు ఇస్తున్నారని మనస్తాపం చెందిన స్టాఫ్‌ నర్సు నిర్మల(33) గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసింది. మెడికల్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌ వద్ద బ్లేడుతో చేతులు, మెడ కోసుకుంది. ప్రస్తుతం ఆమె ఆర్‌ఐసీయూ వార్డులో చికిత్స పొందుతోంది. మెడ, చేతులకు సుమారు 24 కుట్లు పడ్డాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు అధికారులు ఇటీవల శ్రీకారం చుట్టారు.
గత వారం పదిమంది నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తనకు ప్రమోషన్‌ వస్తుందని ఆశించిన నిర్మల ఆ జాబితాలో పేరు లేదని తెలియడంతో ఉద్వేగానికిలోనై మెడికల్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌కు మరికొంతమంది నర్స్‌లతో కలిసి వెళ్లింది. భోజనం చేస్తున్నానని.. కొద్దిసేపు వేచి ఉండమని సూపరింటెండెంట్‌ చెప్పాడు. ఇంతలో నర్సు బ్లేడ్‌తో చేతులు, మెడ కోసుకుంది.

పక్కనే ఉన్న నర్సింగ్‌ సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించి అనంతరం ఆర్‌ఐసీయూలో చేర్పించారు. ఆమె భర్త మార్యా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిమ్స్‌లో వివిధ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక, ప్రమోషన్స్‌లో తన ప్రమేయం ఉండదని మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం. సత్యనారాయణ తెలిపారు. ఎంపిక విధానానికి ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఉందన్నారు.

Courtesy Navatelangana…