లాక్‌డౌన్‌ సమయంలో పోలీసు చర్యలతో 15 మరణాలు
నివేదికలు అందించాలంటూ ఆయా రాష్ట్రాలకు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో పోలీసుల చర్యల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధించిన పూర్తి వివరణతో కూడిన నివేదికలను తమకు అందజేయాలని 8 రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ) నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య వివిధ రాష్ట్రాల్లో పోలీసుల మితిమీరిన చర్యల కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారని పరిశోధకుడు రాజా బగ్గా ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మీడియా కథనాలను ఉటంకిస్తూ.. బహిరంగ వీధుల్లో పోలీసులు తీవ్రంగా కొట్టడం చేత 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు పోలీసు కస్టడీలో మరణించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, దీనిని సంబంధిత శాఖలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి వుండవచ్చు..

బయటి వ్యక్తుల నుంచి ఎలాంటి జోక్యమూ లేకుండా విచారణ జరిపించడానికి స్వసంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. చనిపోయిన వారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌, ముగ్గురు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాగే, తమిళనాడు, పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో వలస కార్మికులు, రోజువారి కూలీలు, ఓ డ్రైవర్‌, కూరగాయల విక్రేతలు ఉన్నాట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిలో ముగ్గరు ముస్లింలు, ఇద్దరు దళితులు, ఒక గిరిజనులు ఉన్నారని తెలిపారు.

Courtesy Nava Telangana