వార్తా పత్రికలకు దేశ వ్యతిరేకముద్ర వేయడం, ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వకుండా నిలుపు చేయడం, ఎడిటర్లను అరెస్టు చేయడం, ఇంటరాగేషన్లు-ఇవన్నీ కాశ్మీర్‌ లోని పత్రికలను దెబ్బతీసి అవి క్రమంగా లొంగిపోయేటట్టు చేశాయి.
1984లో జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌గాంధీ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన కారును, ఒక పోలీసు జీపు అడ్డగించింది. ఆ పోలీసు అధికారి రాజీవ్‌ గాంధీకి అందించిన సందేశం ఇలా వుంది. ‘ఇంటి దగ్గర యాక్సిడెంటు జరిగింది. వెంటనే ఢిల్లీకి తిరిగి రండి’. ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులే కాల్చి చంపారు. ఒక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఆమె ఇంటి ఆవరణ లోని తోటలోకి రాగానే వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. తనను కలకత్తాకు తీసుకుపోయే హెలికాప్టర్‌ కోసం ఎదురు చూస్తూ రాజీవ్‌ గాంధీ తన వద్ద ఉన్న ట్రాన్సిస్టర్‌ను స్విచ్‌ ఆన్‌ చేసి తాజా వార్త కోసం న్యూస్‌ చానెల్‌ను ట్యూన్‌ చేశారు. అయితే అతను ట్యూన్‌ చేసింది ఆలిండియా రేడియోకి కాదు; బి.బి.సి చానెల్‌కి. ఆ చానెల్‌ ఇచ్చిన సమాచారం దుఃఖపూరిత సమాచారం. కాని తాజా సమాచారాన్ని తెలిపింది. సరళీకరణకు ముందు కాలంలో సమాచార ప్రసార వ్యవస్థ అంతా ప్రభుత్వ పెత్తనం కింద ఉండేది. ప్రభుత్వానికి ప్రచార బాకాగా ఉండేది. అటువంటి సమయంలో కూడా దేశానికి కాబోయే ప్రధాని ఆధారపడింది ఆంటీ మీదే (బి.బి.సి) తప్ప అమ్మ (ఆలిండియా రేడియో) మీద కాదు. 35 సంవత్సరాల తర్వాత, 400కి పైగా ప్రైవేటు టీవీ చానెళ్లు, 1000కి పైగా పత్రికలు, 3000కి పైగా రేడియో స్టేషన్లు నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది ‘స్వేచ్ఛా మార్కెట్‌ విధానం’ అని, ‘పోటీ’ ఉంటుందని, అది పారదర్శకతను, నాణ్యతను పెంచుతుందని ‘సరళీకరణ’ సమర్థకులు అప్పుడు ఊదరగొట్టారు. కాని ఇన్ని స్వతంత్ర(?) ప్రసార మాధ్యమాలు మన దేశంలోనే ఉన్నా, కాశ్మీర్‌ లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం లోని బండారాన్ని బైట పెట్టింది మాత్రం విదేశీ మీడియా సంస్థలే.
ఆగస్టు 5 తర్వాత కాశ్మీర్‌లో నిరసనకారులపై పోలీసు కాల్పులు జరిగిన వీడియోలను ప్రసారం చేసినవి ‘బి.బి.సి’, ‘ఆల్‌జజీరా’, ‘రాయిటర్స్‌’. అరెస్టయిన వారి సంఖ్యను ప్రచురించినది ‘అసోసియేటెడ్‌ ఫ్రీప్రెస్‌’, ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’, ‘టైమ్‌’, ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’. నిర్బంధించిన వారిలో మైనారిటీ తీరని పిల్లలు కూడా ఉన్నారన్న వార్తను ప్రచురించింది వాషింగ్టన్‌ పోస్ట్‌. కాశ్మీర్‌లో జైళ్లు కిక్కిరిసి పోయి వేరే చోట్లకు నిర్బంధితులను తరలిస్తున్నారనే వార్తను ‘అసోసియేట్‌డ్‌ ఫ్రీప్రెస్‌’ ప్రచురించింది. పెల్లెట్‌ గన్స్‌ కాల్పులకు సంభవించిన మొదటి మరణం అన్న వార్తను ‘హపింగ్‌టన్‌ పోస్టు సౌరా’, ప్రతిఘటనా కేంద్రంగా కాశ్మీర్‌ ఉందన్న వార్తను ‘రాయిటర్స్‌’, తుపాకీ గుండు దెబ్బకు సంభవించిన మొదటి మరణం గురించి ‘ఫ్రాన్స్‌ 24’, కొట్టడాల గురించి, చిత్రహింసల గురించి ‘బి.బి.సి, ది ఇండిపెండెంట్‌’, మహిళలపై వేధింపులు, లైంగిక అత్యాచారాల గురించి ‘డేయిష్‌ వెల్‌’ (జర్మనీ), బలవంతం చేసి ప్రజల చేత ‘వందేమాతరం’ అనిపిస్తున్న మిలటరీ గురించి ‘ఫారిన్‌ పాలసీ’ అనే పత్రిక, మందుల కొరత గురించి మీడియాతో మాట్లాడిన డాక్టరును నిర్బంధించిన వైనంపై బి.బి.సి, శ్మశానాలుగా మారుతున్న ఆస్పత్రులు అన్న కథనాన్ని ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’, ముంచుకొస్తున్న మెడికల్‌ ఎమర్జెన్సీ గురించి ‘లాన్సెట్‌’ పత్రిక సంపాదకీయం ప్రచురించాయి.

రాజ్యాంగపరమైన(?) చర్యకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తుంటే ప్రపంచం లోని పలు మీడియా సంస్థలు కాశ్మీర్‌లో ప్రజల మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవిధంగా కాలరాయబడుతున్నాయో బహిర్గతం చేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య తేడా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. విదేశీ మీడియా, భారతీయ మీడియా, ఒకే ప్రాంతం గురించిన వార్తలు ప్రసారం చేస్తున్నాయా లేక వేరు వేరు ప్రాంతాల గురించా? అని ఒక వెబ్‌సైట్‌ ప్రశ్నించింది. కాశ్మీర్‌లో వార్తల కవరేజి డ్యూటీలో ఉన్న ఒక భారతీయ జర్నలిస్టు భారతీయ మీడియా పాత్రను అసహ్యించుకుంటున్న వారి చీదరింపులను ఎదుర్కొనాల్సి వచ్చిందని, వారికి పలుమార్లు తన తరపున, భారతీయ మీడియా తరపున క్షమాపణలు కోరానని తెలిపారు. 21వ శతాబ్దంలో ఒక మాసం పాటు కాశ్మీరీ పాత్రికేయులు మాత్రం 20వ శతాబ్దం లోనే గడిపారు. ఇంకా గడుపుతున్నారు. స్వేచ్ఛగా తమ ఫోన్లను గాని, ఇంటర్నెట్‌ను గాని ఉపయోగించడానికి వీలు లేదు. కథనాలను రాయడానికి గాని, ప్రసారం చేయడానికి గాని కుదరలేదు. వార్తా పత్రికలను ప్రచురించడానికి గాని, పంపిణీ చేయడానికి గాని సాధ్యపడలేదు. పాత్రికేయులకు కర్ఫ్యూ పాస్‌లు ఇవ్వడానికి నిరాకరించారు. పలు సెక్యూరిటీ పాయింట్లలో చెకింగ్‌ల పేరుతో నిలవరించి వేధించారు. వారి వద్ద ఉన్న ఫొటోలను, వీడియో క్లిప్పింగ్‌లను డిలీట్‌ చేయవలసి వచ్చింది. మొబైల్‌ స్క్రీన్‌ షాట్ల ప్రింటౌట్లు, పెన్‌ డ్రైవ్‌లు శ్రీనగర్‌ నుండి బైటకు వచ్చే విమాన ప్రయాణీకులకు ఇచ్చి వాటిని ఎలాగైనా బైటకు తీసుకెళ్లమని ప్రాధేయ పడాల్సి వచ్చింది. కాశ్మీర్‌ లోయలో 174 దినపత్రికలకు గాను పట్టుమని పది కూడా ప్రచురించబడడం లేదు. వారి ఈ-పేపర్లు స్తంభించిపోయి వున్నాయి. వాటిలోకి తాజా వార్తలు ఎక్కడం లేదు. ఇంకోవైపు విదేశీ మీడియా జర్నలిస్టులకు కూడా కాశ్మీర్‌ లోయలోకి పోయేందుకు అనుమతులు లేవు. అమెరికన్‌, అరబ్‌, బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ మీడియా సంస్థలన్నీ స్థానికంగా ఉన్న జర్నలిస్టులపై ఆధారపడే తమ కవరేజీ ఇస్తున్నాయి. ఆ పనినే భారతీయ మీడియా ప్రధాన స్రవంతి ఎందుకు చేయలేక పోతోంది? ఏదో విధంగా వెలుగులోకి వస్తున్న కథనాలను సైతం తొక్కి పట్టడమే తమ బాధ్యతగా ఇండియన్‌ మీడియా ఎందుకు భావిస్తోంది? కాశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతోందన్నట్టు వారెందుకు చిత్రీకరించవలసి వస్తోంది? మెజారిటీ ప్రజల భావాలను ప్రతిబింబించడం ప్రధానం అని చెప్పుకునే మీడియా కాశ్మీర్‌లో మెజారిటీగా ఉన్న ముస్లింల భావాలను ఎందుకు తక్కిన దేశం ముందు ఉంచలేక పోతోంది? ప్రభుత్వం విడుదల చేసే నివేదికలలో ఒక్కదాని నంటే ఒక్కదానినైనా ఎందుకు ప్రశ్నించడం లేదు?

మొత్తం మీడియా అంతా ఇలానే వ్యవహరిస్తోందని కాదు. కాని ఎక్కడైనా కొంతమంది ధైర్యవంతులు ఉండి వాస్తవాలను చెప్తూ ఉండవచ్చు. కాని అది సముద్రంలో కాకిరెట్ట మాదిరిగానే ఉంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ‘కొన్ని సందర్భాలలో వార్తలను ప్రచురించకపోవడమే మంచిది’ అన్న వైఖరిని తీసుకున్నట్లుంది. అక్కడక్కడా కొన్ని ఇంగ్లీషు పత్రికలు, డిజిటల్‌ మీడియా మాత్రం కొంత భిన్నంగా వున్నాయి. మొత్తం మీద ఎక్కువ పత్రికలు, ముఖ్యంగా భారతీయ భాషా పత్రికలు ఎటువంటి మినహాయింపులూ లేకుండా ప్రభుత్వం విడుదల చేసే ఇస్లాం విద్వేష ప్రచారమంతటినీ యథాతథంగా విశ్వసనీయంగా ప్రజలకు చేరవేస్తున్నాయి. ‘భారతీయ మీడియాలో ఏ ప్రచారం జరుగుతోందో దానికి పూర్తి విరుద్ధంగా ఇక్కడి వాస్తవ పరిస్థితి వుంది’ అని ఓ కాశ్మీరీ జర్నలిస్టు అన్నారు. టీవీ న్యూస్‌ ఎడిటర్లు, గ్రౌండ్‌ రిపోర్టింగ్‌ చేసే వారి నుండి సౌండ్‌ బైట్స్‌, వారు ముందస్తుగానే రాసుకున్న స్టూడియో స్క్రిప్టులకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు. ఆ సౌండ్‌ బైట్స్‌ ఆ మాదిరిగానే వస్తున్నాయి. కాని వీక్షకులకి ఈ రిపోర్టర్ల వెనక నిలబడ్డ మిలటరీ దళాలు కనిపించవు కదా! పైకి కనబడని, ఈ అప్రకటిత సెన్సార్‌షిప్‌ వెనక ఉన్నదేంటి? ‘ఈ శృతి మించిన జాతీయవాద యుగంలో భారతీయ జర్నలిజం జాతి నిర్మాణానికి(?) నడుం బిగించి తన విధిని నిర్వర్తిస్తోంది’ అని ఒక మీడియా విశ్లేషకుడు అన్నారు. జాతీయోద్యమ కాలంలో వార్తా పత్రికలు నిర్వహించిన పాత్ర ఎటువంటిదో, తాము ఇప్పుడు అటువంటి పాత్రనే పోషిస్తున్నామన్న భ్రమలో చాలా టీవీ చానెళ్లు ఉన్నాయి. అందుకే తక్కిన దేశాల మీడియాకు కాశ్మీర్‌లో ప్రజల ఆగ్రహం, వారిపై దాడులు, అల్లకల్లోల పరిస్థితి, హింస, ఇబ్బందులు, హక్కుల నిరాకరణ వంటివి కనపడుతూ వుంటే మన ‘స్వదేశీ’ మీడియాకు మాత్రం అక్కడ ప్రశాంతత, భద్రత, ఆహ్లాదం, జనామోదం కనిపిస్తున్నాయి. చేదు నిజాలకు, ప్రభుత్వ ప్రచారానికి మధ్య, ప్రజాస్వామ్యానికి, ‘దేశ భక్తి'(?) మధ్య పోటీలో దేని గిరాకీ ఎక్కువ ఉందో, ఏది ఎక్కువ లాభసాటి వ్యవహారమో మీడియా యజమానులకు, ఎడిటర్లకు, యాంకర్లకు, ఇతర బెకబెక గాళ్లకు బాగా తెలుసు.
నిజానికి భారతీయ మీడియా దిగజారుడు ప్రక్రియ చాలా కాలం క్రితమే మొదలైంది. ఇప్పుడు కాశ్మీర్‌ వ్యవహారంతో అది అథఃపాతాళానికి చేరింది. ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే ‘బాధితుల తరపున గొంతు విప్పడం’గా వుండేది. కాని జె.ఎన్‌.యు ఉదంతం, గో గూండాల దాడులు, లవ్‌ జిహాద్‌లు, శబరిమల, త్రిపుల్‌ తలాక్‌, రోహిత్‌ వేముల ఆత్మహత్య, పెద్ద నోట్ల రద్దు, పుల్వామా ఉదంతం, సర్జికల్‌ దాడులు-ఇవన్నీ మన ‘ప్రజాస్వామ్య పరిరక్షకులకు’ వెన్నెముక లేని జీవులుగా ఎలా వ్యవహరించాలో నేర్పాయి. కాశ్మీర్‌ పరిణామాల విషయంలో మీడియా అనుసరిస్తున్న వైఖరి దాని కొనసాగింపు మాత్రమే. ‘2014లో నరేంద్ర మోడీ అధికారం చేబట్టిన నాటి నుండీ మీడియాను బెదిరించడం, తోక కత్తిరించడం, ప్రలోభ పెట్టడం వంటివి జరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత మీడియా భట్రాజుగిరీని చూడాలి’ అని ‘ది ఎకనామిస్ట్‌’ పత్రిక వ్యాఖ్యానించింది.
2016లో బిజెపి కాశ్మీర్‌ లోని పిడిపి తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ కాశ్మీర్‌ వ్యవహారం వెనక వ్యూహం అమలు మొదలైంది. వార్తా పత్రికలకు ‘దేశ వ్యతిరేక’ ముద్ర వేయడం, ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వకుండా నిలుపు చేయడం, ఎడిటర్లను అరెస్టు చేయడం, ఇంటరాగేషన్లు-ఇవన్నీ కాశ్మీర్‌ లోని పత్రికలను దెబ్బతీసి అవి క్రమంగా లొంగిపోయేటట్టు చేశాయి. ఆదాయాలు తగ్గిపోవడం, జీతాల కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం-వీటిని తట్టుకోలేక చాలా మంది తలలొగ్గారు. జర్నలిస్టుల మధ్య స్థానికులు, జాతీయ స్థాయి వారు అని, పండిట్లు, ముస్లింలు అని, స్వదేశీ, విదేశీ అని చీలికలు వచ్చాయి. దాంతో వాస్తవాల పట్ల సమధర్మం పాటించే వాతావరణం లేకుండా పోయింది.
ఒక వైపు బ్రెగ్జిట్‌, ఇంకో వైపు హాంకాంగ్‌ వంటి సీరియస్‌ పరిణామాలు జరుగుతున్నప్పటికీ వాటన్నింటి కన్నా అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది కాశ్మీర్‌ పరిణామాలపైనే. ఒక పక్క ప్రభుత్వం సమాచార ప్రసారం జరగకుండా నిరోధిస్తుంటే దానికి జవాబుగా బి.బి.సి తన హిందీ, ఉర్దూ ప్రసారాల నిడివిని బాగా పెంచింది. ‘ఇంటర్నెట్‌ను నిలిపేసినా, విద్యుత్‌ కోత విధించినా సరే, మా వార్తా ప్రసారాల స్వతంత్రతను అడ్డుకోలేరు’ అన్న టాగ్‌ లైన్‌తో ఈ ప్రసారాలు వచ్చాయి. ఇంకోపక్క మన భారతీయ మీడియా మాత్రం ‘మోడీతోనే కాశ్మీర్‌’ అన్న హ్యాష్‌టాగ్‌ను తగిలించుకుంది. నిజానికి కాశ్మీర్‌కు తక్కిన దేశానికి ఇంటర్నెట్‌ గ్రిడ్‌ సంబంధాలు తెగిపోయి వున్నాయి. ‘మూర్ఖుల దాడి’ వాస్తవ రూపం ధరించింది. ‘తెగువతో రూపొందుతున్న కొత్త ప్రపంచం’లోని ‘నవ కాశ్మీరం’తో ప్రభుత్వ మీడియా ద్వారా ఒకే విధమైన సమాచారం బైటకు పోయే ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వమే ఇలా చేస్తోందన్న భావం మాత్రం బైట నుంచి చూసే వారికి కలగదు. అందుకే అక్కడి ఘోరాలకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ నిరసనలు అంతగా వినబడడం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూనే ప్రజల గొంతు నొక్కడం, తక్కిన వారికి వాస్తవాలు తెలియకుండా తాము చెప్పిందే నిజమని భ్రమింప జేయడం-ఈ నమూనా పాలక వర్గాలకి పనికొచ్చే రకం. బహుశా తక్కిన సందర్భాలలో దీనినే మరింత పెంపొందించి మరింత చాకచక్యంగా అమలు చేసేందుకు వారు ప్రయత్నించవచ్చు కూడా.
1954లో గేబ్రియల్‌ గార్షియా మార్క్వెజ్‌ ‘పాత్రికేయ వృత్తి మానవజాతికి ప్రకృతి సిద్ధంగా అవసరమైన ప్రక్రియ’ అని అభివర్ణించారు. కాని ఈ స్వతంత్ర భారత రిపబ్లిక్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుండి ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ వరకు (ఈయన మాజీ న్యాయమూర్తి కూడా) సమాచార ప్రసార శాఖా మంత్రి నుండి పారిశ్రామిక సంస్థల వరకు, అందరూ ‘పత్రికలు తమ పరిమితులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి’ అని మాత్రమే వల్లించడం సిగ్గుచేటు. కాశ్మీర్‌ పరిణామాలు-బిజెపి కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలగడంతో మొదలుపెట్టి ఆ రాష్ట్రాన్నే ముక్కలు చేసి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం వరకు జరిగినవి. ఒక జర్నలిస్టు హత్యతో మొదలయ్యాయని గుర్తుంచుకోవాలి. ‘ఉదయిస్తున్న కాశ్మీర్‌’ అనే పత్రికను (రైజింగ్‌ కాశ్మీర్‌) ప్రారంభించిన ఎడిటర్‌ ఘజల్‌ బుఖారీని బలిగొనడంతో పత్రికల నోళ్లు మూయించే ప్రక్రియ మొదలైంది. కాని మీడియా కళ్లు మూసుకుని వ్యవహరించినంత మాత్రాన కాశ్మీర్‌లో కుంకుమ పూల మొక్కలు సవ్వడి చేయకుండా ఉంటాయా?

కృష్ణప్రసాద్‌, ‘ది హిందూసౌజన్యంతో
( వ్యాసకర్త ఔట్‌లుక్‌ పత్రిక మాజీ ఎడిటర్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ సభ్యులు )

Courtesy Prajashakthi…