పట్టణాల్లో పెరిగిన నవజాత శిశుమరణాలు
ప్రపంచ సగటుకన్నా ఇండియాలో ఎక్కువ
– ‘ప్రజారోగ్యంప్రయివేటు రంగానికి వదిలేశారు : ఆరోగ్యరంగ నిపుణులు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆరోగ్యరంగంలో సేవల నాణ్యతను తెలిపే అంశాల్లో ఒకటి ‘నవజాత శిశుమరణాల రేటు’. ఇది ఏ దేశంలో తక్కువగా ఉంటే, ఆ దేశంలో ప్రభుత్వ ఆరోగ్య సేవలు నాణ్యంగా ఉన్నట్టు లెక్క. ప్రతివెయ్యిమంది శిశుజనాలకు జరిగే శిశుమరణాల సంఖ్యను ‘నవజాత శిశుమరణాల రేటు'(ఐఎంఆర్‌) తెలుపుతుంది. పలు నివేదికలు విడుదలచేసిన సమాచారం ప్రకారం, మనదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఐఎంఆర్‌ ఎక్కువగా నమోదవుతోందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇండియాస్పెండ్‌’ నివేదిక-2017 ప్రకారం, ‘నవజాత శిశుమరణాల రేటులో ప్రపంచ సగటు 29.4గా ఉంటే, ఇండియాలో 33గా నమోదైంది. దక్షిణాసియాలోని అనేక దేశాలకన్నా, ఆఫ్రికా దేశాల కన్నా ఇండియాలో ఐఎంఆర్‌ ఎక్కువగా ఉందని నివేదిక తేల్చింది. పాకిస్తాన్‌, మయన్మార్‌లతో పోల్చుకుంటే, వాటికంటే స్వల్పమెరుగుదల మాత్రమే ఉంది. ఇండియాలో గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నవజాత శిశు మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. కేంద్రం విడుదల చేసిన ‘సాంపిల్‌ రిజిస్ట్రేసన్‌ సిస్టమ్‌'(ఎస్‌ఆర్‌ఎస్‌)-2017 సమాచారంలోనూ ఇది కనబడిందని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు కర్నాటక రాష్ట్రాన్నే తీసుకుంటే, 2015-2017మధ్య రాష్ట్రంలో ఐఎంఆర్‌ స్వల్పంగా తగ్గింది. గ్రామాల్లో కొంత తగ్గినా, పట్టణాల్లో పెరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో పూర్వ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు.
ఐదు రాష్ట్రాల్లో…
పట్టణీకరణ ఎక్కువగా నమోదుచేసుకున్న ఐదు రాష్ట్రాల్లో ‘నవజాత శిశుమరణాల రేటు’ ఆందోళన కలిగిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లలో గ్రామాల్లో ఐఎంఆర్‌ తగ్గలేదు. కానీ పట్టణాల్లో పెరిగింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఆశావర్కర్లు రావటం, ఇతర సిబ్బంది, మౌలిక వసతుల కల్పన జరిగింది. ఇది గ్రామాల్లో ఐఎంఆర్‌ను ఆపగలిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే గతకొన్నేండ్లుగా పట్టణ ఆరోగ్యం పూర్తిగా ప్రయివేటు శక్తుల్లోకి వెళ్లటం పేదల్ని ప్రభావితం చేసిందనీ, తద్వారా ఇక్కడ నవజాత శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయనీ నిపుణులు తెలిపారు. ‘నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌’కు కేంద్ర, రాష్ట్రాలు పెద్దగా నిధులు కేటాయించటం లేదని వారు చెబుతున్నారు.

(Courtacy Nava Telangana)