న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. 336,851 మంది కోవిడ్‌ కోరల్లో చిక్కుకున్నారు. ఇంతవరకు 9,620 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరోవైపు అమెరికా కరోనా వ్యాప్తికి కేంద్రంగా నిలిచిన న్యూయార్క్‌ రాష్ట్రంలో మృత్యుకేళి కొనసాగుతోంది. ఇప్పటివరకు న్యూయార్క్‌లో 4,159 కోవిడ్‌ మరణాలు సంభవించాయి. లక్షా 22 వేల మందిపైగా కరోనా బారిన పడ్డారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే దాదాపు 64 వేల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో పరిస్థితి మరింత భయాంకర రూపం దాల్చవచ్చని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమోవో ఆందోళన వ్యక్తంచేశారు. వైద్య సిబ్బందికి అత్యవసర రక్షణ పరికరాలైన మాస్కులు, గౌన్లు, వెంటిలేటర్లు, పీపీఈలు లేవని.. దాంతో వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు.

కోవిడ్‌ సోకి ఏప్రిల్‌ 2, 3వ తేదీల మధ్య 24 గంటల్లో 562 మంది చనిపోగా.. ఈ వైరస్‌ వల్ల ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 630 మంది మృత్యువాత పడ్డారు. కాగా, న్యూయార్క్‌ నగరంలో గంట గంటకు పెరుగుతున్న కరోనా బాధితులకు వైద్యం అందించం కష్టంగా మారుతోంది. అత్యవసర వైద్య పరికరాలు బుధవారం వరకు మాత్రమే వస్తాయని నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో ప్రకటించారు. స్పోర్ట్స్‌ క్లబ్బులు, జిమ్‌లు మూసివేయాలని ఆదేశించారు.

కరోనా వెలుగులోకి వచ్చాక చైనాలోని వూహాన్‌లో నుంచి 4.30 లక్షల మంది నేరుగా విమానాల్లో అమెరికా చేరినట్లు సమాచారం. విమానాల రాకపోకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు ప్రకటించక ముందు 1,300 విమానాల్లో అమెరికాలోని 17 నగరాలకు వీరంతా వచ్చారు. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 40 వేల మంది అమెరికాకు రావడం గమనార్హం. చైనా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వారి నుంచి అమెరికన్లకు వైరస్‌ సోకి ఉండొచ్చ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.