Image result for ఎక్సైజ్‌కు ‘న్యూ’ కిక్‌!"నెల రాబడి 2012 కోట్లు.. 4% పెరుగుదల
2018 డిసెంబరు రాబడి 1970 కోట్లు
అర్ధరాత్రి దాటినా షాపులు, బార్లు బార్లా
3148 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు
కిక్కిరిసిన మెట్రో.. అర్ధరాత్రి 2 వరకూ రైళ్లు
40 వేల మంది అదనంగా ప్రయాణం

న్యూ ఇయర్‌ కోసం మందు బాబుల మస్త్‌ మస్త్‌ మజాఎక్సైజ్‌ శాఖకు మహా కిక్కుఇచ్చింది. పొద్దుట్నుంచి అర్ధరాత్రి 12గంటల దాకా వైన్‌షాపులు కిటకిటలాడితే.. బార్లు, క్లబ్బులైతే అదనంగా మరో గంటపాటు వెల్‌కమ్‌చెప్పాయి! సమయ పరంగా ఈ సడలింపుతో మద్యం ప్రియులు మరింత ఖుషీ చేసుకుంటే ఎక్సైజ్‌ శాఖకు కాసుల వర్షం కురిసింది. మద్యం షాపులు, బార్లే కాదు.. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లూ కిక్కిరిశాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌బెడద నుంచి తప్పించుకునేందుకు మద్యం ప్రియుల్లో చాలామంది మెట్రో రైల్లో ఇళ్లకెళ్లారు. అర్ధరాత్రి 2గంటల దాకా ఆ రైళ్లు నడిచాయి. బార్ల నుంచి ఇళ్లకు సొంతవాహనాల్లో వెళితే ఏంటట? అని సాహసం చేసినవాళ్లలోనూ వేలమంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయారు. ఇక తెల్లారింది మొదలు ఆలయాల వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ భక్తులు పోటెత్తడంతో ప్రధాన ఆలయాల్లో సందడి నెలకొంది!!

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జనవరి: ‘కొత్తకు ఎపుడూ స్వాగతం.. పాతకూ వందనం’ అంటూ మద్యం ప్రియులు మందేసి చిందేయడం ఎక్సైజ్‌ శాఖకు పండగైంది. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబరు 30, 31 తేదీల్లోనే రూ.450కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా డిసెంబరు నెలలో రూ.2012 కోట్ల రాబడి వచ్చింది. ఇది గత ఏడాది డిసెంబరు నెలతో పోలిస్తే రూ.42 కోట్లు ఎక్కువ. 2018 డిసెంబరులో రూ.1970 కోట్ల రాబడి వచ్చింది. అంటే 2018 డిసెంబరుతో పోలిస్తే 2019 డిసెంబరులో ఎక్సైజ్‌ ఆదాయం 4 శాతం పెరిగింది. మద్యం రేట్లు పెరగడం కొత్త ఏడాది సంబురాలపై ప్రభావం చూపింది. బీరును మినహాయించి లిక్కర్‌ విక్రయాలనే పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే 5 శాతం తగ్గినట్లు ఎక్సైజ్‌ వర్గాలు వివరించాయి. 2018 డిసెంబరులో 39 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడుపోగా.. ఈ డిసెంబరులో 35 లక్షల కేసులే అమ్ముడుపోయాయి. మద్యం రేట్లు పెరగడమే దీనికి కారణమని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అయితే, చీప్‌ లిక్కర్‌, మీడియం, సెమీ ప్రీమియం బ్రాండ్లే కాస్తా ఎక్కువగా అమ్ముడయ్యాయని చెబుతున్నాయి. కాగా 30, 31 తేదీల్లో మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు వంటి రిటెయిలర్ల ద్వారా రూ.600 కోట్లకు పైగా మద్యం, బీరు విక్రయాలు సాగినట్లు అంచనా. రాష్ట్రంలో మొత్తం 2216 మద్యం షాపులు, 1000 వరకు బార్లు, క్లబ్బులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో మద్యం షాపు రోజుకు రూ.3-4 లక్షల వరకు, జిల్లాల్లోని వైన్‌ షాపులు రూ.1.50- 2 లక్షల వరకు, బార్లు రూ.5 లక్షల వరకు విక్రయాలు సాగిస్తుంటాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబరు 30, 31 తేదీల్లో వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులు సగటున రూ.10 లక్షల వరకు విక్రయాలు సాగించినట్లు అంచనా.

3148 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి మంగళవారం అర్ధరాత్రి రోడ్ల మీదకు వచ్చినవారిలో ఆ ‘సంబురం’ ఆవిరైంది! రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 3,148 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 951, సైబరాబాద్‌లో 868, రాచకొండ పరిధిలో 281కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడాఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించారని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు.
కిక్కిరిసిన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు
అర్ధరాత్రి వరకు పార్టీలు, కేకుల కటింగ్‌లతో సందడి చేసిన ప్రజలు.. కొత్త ఏడాదిలో సూర్యోదయం కాగానే ప్రార్థనాస్థలాల బాట పట్టారు. హైదరాబాద్‌లోని బిర్లామందిర్‌, చిల్కూరు బాలాజీ, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ, తాడ్‌బంద్‌ హనుమాన్‌, మహాంకాళి అమ్మ వారు, పలు ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పర్యాటక ప్రాంతాల్లోనే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్‌టీఆర్‌ గార్డెన్‌, లుంబినీపార్క్‌, సంజీవయ్య పార్కు, జూపార్క్‌, చార్మినార్‌, మక్కా మసీద్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోట తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కనిపించింది. ఖైరతాబాద్‌ చౌరస్తా సెల్ఫీ స్పాట్‌గామారింది.
మెట్రో ధూం ధాం..
న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2గంటల వరకు మెట్రో రైళ్లు నడిచాయి. రికార్డు స్థాయిలో 4.6లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు. రోజువారీ ప్రయాణికుల కన్నా 40వేల మంది ఎక్కువగా ప్రయాణించారని వెల్లడించారు. రికార్డు స్థాయిలో అమీర్‌పేట స్టేషన్‌కు 28,696 మంది రాగా.. 25548 మంది ఈ స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారు. మెట్రో రైళ్లలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణికలు మసలుకొన్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు.