– ఎన్‌. వేణుగోపాల్‌

కరోనా వైరస్‌ – కోవిడ్‌ సంక్షోభాన్ని అవకాశంగా వాడుకోవాలని (టర్నింగ్‌ క్రైసిస్‌ ఇంటు అపార్చునిటీ) ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సలహాను అక్షరాలా పాటించడంలో పాలకులందరూ తలమునకలుగా ఉన్నారు. కోవిడ్‌ వల్ల ప్రజా సమీకరణ, ప్రతిఘటన అసాధ్యంగా మారిపోయిన ఈ తరుణంలోనే అటువంటి నిరసన వ్యక్తం కావడానికి అవకాశం ఉన్న ప్రజావ్యతిరేక విధానాలనూ, చట్టాలనూ, చర్యలనూ హడావిడిగా ప్రవేశపెట్టడానికీ, అమలు చేయడానికీ ఏలినవారు ఉవ్విళ్లూరుతున్నారు. చట్టసభలు నిజంగా ప్రజా ప్రతినిధుల సభలుగా జరగని స్థితిలో, అసలక్కడ ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవారు వేళ్ల మీద లెక్కించదగినంత మంది అయినా ఉన్నారా అని అనుమానించే స్థితిలో చట్టబద్ధంగానే ప్రజా వ్యతిరేక చట్టాలు అమలులోకి వస్తున్నాయి. విభిన్న వర్గాల మధ్య కనీస పాలనాపరమైన తటస్థత చూపవలసిన చట్టసభల్లో కేవలం తమ వర్గానికి, తమ ఆశ్రిత వర్గానికి మేలు చేకూర్చే చట్టాలూ, విధానాలూ సజావుగా సాగిపోతున్నాయి.

కోవిడ్‌ మహావిపత్తు తర్వాత జరుగుతున్న మొదటి తెలంగాణ శాసనసభ సమావేశాలలో మూడు రోజుల్లో ఎడాపెడా పన్నెండు బిల్లులు ప్రవేశపెట్టారు. అవన్నీ రెండు రోజుల్లో, కొన్ని గంటల చర్చ తర్వాతనో, అసలు చర్చే లేకుండానో చట్టాలుగా మారిపోయాయి. ఈ చట్టాలన్నీ తెలంగాణ రాజకీయార్థిక వ్యవస్థ మీద, ప్రజాజీవనం మీద తీవ్రమైన ప్రభావం చూపేవే. వాటిలో కొన్ని చట్టాలకు ప్రజల మీద పెద్దఎత్తున ప్రతికూల ప్రభావం ఉండవచ్చు, మరి కొన్నిటికి అంత ప్రభావం ఉండకపోవచ్చు. కాని వీటిలో ఏ ఒక్క చట్టమూ తెలంగాణ సాధారణ ప్రజానీకానికి – భూమిలేని నిరుపేద శ్రామికులకు, చిన్న రైతులకు, చిన్న వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు, మధ్యతరగతికి, ఉద్యోగులకు, విద్యార్థులకు సానుకూల ప్రయోజనాలు చేకూర్చేది కాదు. ప్రయివేట్‌ విద్యా, ఆరోగ్య వ్యాపారులకు, భూస్వాములకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, దేశదేశాల సంపన్నులకు, ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడే చట్టాలివి.

ఈ ఒక్కొక్క చట్టంలో వాస్తవంగా ఏమి ఉన్నదో, అది ప్రజాజీవనం మీద ఎటువంటి దుష్ప్రభావం చూపుతుందో, వీటిని ఎందువల్ల వ్యతిరేకించవలసి ఉన్నదో చాల వివరంగా చర్చించుకోవలసి ఉంది. చరిత్ర, వర్తమాన సామాజిక స్థితి, గణాంకాల ఆధారంతో ఈ చట్టాలను చట్టపరమైన, సాంకేతికమైన, సామాజికమైన పరీక్షకు గురి చేయవలసి ఉన్నది. ఒక శీర్షికా వ్యాసంలో అంత వివరమైన చర్చకు అవకాశం లేదు గాని, ఇక్కడ మచ్చుకు ది తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌ ఆక్ట్‌ (తెలంగాణ భూహక్కుల, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం) అనే చట్టాన్ని, దానికి అనుబంధ పాత్ర వహించే తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల రద్దు చట్టం, తెలంగాణ పంచాయత్‌ రాజ్‌ (సవరణ) చట్టం, తెలంగాణ మునిసిపల్‌ చట్టాల (సవరణ) చట్టం అనే మూడు చట్టాలను మాత్రం పరిశీలించవచ్చు. ఈ బిల్లుల చర్చ సందర్భంగా రాష్ట్ర శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా ఈ పరిశీలనలో భాగం చేయవచ్చు.

వీటిలో ప్రధాన చట్టం గెజిట్‌లో అచ్చయిన ప్రకారం పది పేజీల చిన్న చట్టం. సాధారణంగా ప్రతి చట్టానికీ ఉన్నట్టే దీనికి కూడ రెండు పేజీల ”లక్ష్యాల, కారణాల ప్రకటన” ఉంది. ఈ లక్ష్యాలూ, కారణాలూ ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ఎవరైనా చదివి తీరవలందే. పదకొండు లక్ష్యాల కోసం ఈ చట్టం తీసుకొస్తున్నామంటూ కారణాలు చెప్పిన ఐదు పేరాల ప్రకటన మొదటి నాలుగు పేరాలు నిజాం సంస్థానంలో భూసంబంధాల గురించి, హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో చేరిన తర్వాత ప్రవేశపెట్టిన జాగీర్ల, ఇనాంల రద్దు చట్టాల గురించీ వివరించాయి. అంటే పందొమ్మిదో శతాబ్ది నుంచి 1950ల దాకా గత చరిత్ర గురించి చెప్పాయి. ఆ చరిత్ర వివరణ కూడా సక్రమంగా జరిగిందా లేదా పక్కన పెట్టినా, ఆ తర్వాత డెబ్బై సంవత్సరాలలో ఆ విషయాలలో ఏమీ జరగలేదన్నట్టుగా ఐదో పేరా హఠాత్తుగా వర్తమానంలోకి దూకింది. ప్రస్తుతం భూయజమానులు భూమి లావాదేవీలు జరుపుతున్నప్పుడు, రుణాల కోసం వెళ్లినప్పుడు పట్టాదార్‌ పాస్‌ బుక్‌ను, పట్టాను భౌతికరూపంలో చూపవలసి వస్తున్నదని, ప్రభుత్వం భూసమాచారాన్నంతా ధరణి పోర్టల్‌లో కంప్యూటరీ కరించినందువల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం దష్టికి వచ్చిందని, అందువల్ల, పదకొండు లక్ష్యాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించింది.

తాటిచెట్టు ఎక్కడం వరకూ వివరణ ఫర్వాలేదు అనుకున్నా, ఆ పని దూడగడ్డి కోసం అని బుకాయించడమే సమస్య. నిజానికి ఆ వివరణలోనే చెప్పినట్టు, చారిత్రక కారణాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏడు దశాబ్దాలలో జరిగిన అనేక చట్టపరమైన, పాలనాపరమైన చర్యలవల్ల ఒక పద్ధతి ఏర్పడి ఉంది. ఆ పద్ధతి వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. కాని ఒక రోగం గురించి చెప్పి మరొక మందు వేయడానికి ప్రయత్నం చేస్తుండడమే అసలు సమస్య.
సరే, ప్రకటిత లక్ష్యాలు పదకొండు: 1. హక్కుల పత్రాలను ఎలక్ట్రానిక్‌ రూపంలో భద్రపరచడం. 2. విడివిడిగా ఉన్న పట్టానూ, పాస్‌బుక్‌నూ ఏకం చేసి ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్చడం. 3. రుణసంస్థల దగ్గర భౌతిక పాస్‌బుక్‌ చూపవలసిన ఒత్తిడిని భూయజమానులకు తగ్గించడం. 4. రుణ సంస్థలు భౌతిక పత్రాలు అడగనక్కరలేని స్థితి కల్పించడం. 5. ఆస్తి బదిలీ జరగగానే హక్కు కూడ బదిలీ అయ్యేలా చూడడం. 6. వ్యాపార సౌలభ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌), పారదర్శకత, జవాబుదారీతనం సాధించడం. 7. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములను పరిరక్షించడం. 8. రెవెన్యూశాఖ పారదర్శకతను పెంచడం. 9. రెవెన్యూశాఖ వ్యవహారసరళిని మెరుగు పరచడం, అవినీతికి ముగింపు పలకడం. 10. సుపరిపాలనలో భాగంగా రెవెన్యూశాఖ జవాబుదారీతనాన్ని, స్పందనాశీలతను పెంచడం. 11. విశాల ప్రజా ప్రయోజనం కోసం సమస్యారహిత రెవెన్యూ పాలనను అందించడం. (లోపల దాచుకున్న నిజం అప్పుడప్పుడు తన్నుకుని వస్తుందని, దాన్ని ఫ్రాయిడియన్‌ స్లిప్‌ అంటారని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. అలాగే కావచ్చు, ఈ పదకొండో లక్ష్యంలో గెజెట్‌లో విశాల ప్రజా ప్రయోజనం కోసం (”ఇన్‌ ది లార్జర్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌”) అని రాద్దామనుకున్నట్టున్నారు, లార్జర్‌ అనే మాట లేయర్‌ అని అచ్చుతప్పు పడింది! లేయర్‌ అంటే పొర. అవును, ఒక పొర ప్రజా ప్రయోజనం కోసం అనే నిజం ఎంత దాచినా బైటికి వచ్చింది!)
నిజానికి చెప్పిన కారణాలు సరైనవేననుకున్నా కొత్త చట్టం తేనక్కరలేదు. కారణాలకూ లక్ష్యాలకూ ఏమీ సంబంధం లేదు. పాలనాపరమైన చిన్న చర్యలతో ఆ కారణాలకు పరిష్కారాన్ని కనిపెట్టవచ్చు, ఆ లక్ష్యాలను సాధించవచ్చు. లక్ష్యాలలో శుష్క ఆదర్శాలను, ఆచరణలోకి రాని జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి అంతం వంటి మాటలను పక్కన పెడితే, ఆ పదకొండు లక్ష్యాలను వాస్తవంగా మూడు లక్ష్యాలుగా కుదించవచ్చు. అవి ఒకటి, తెలంగాణలో భూమి సంబంధమైన వ్యవహారాలన్నిటినీ భౌతిక రూపం నుంచి ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్చి, ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు చెపుతున్న క్యాష్‌లెస్‌, డిజిటల్‌ ఎకానమీలోకి తెలంగాణ గ్రామీణ, భూఆర్థిక వ్యవస్థను సంలీనం చేయడం. రెండు, పట్టాదార్‌ పాస్‌బుక్‌ పేరిట వాస్తవ సాగుదార్లను, కౌలుదార్లను ఎక్కడా పత్రాల్లో లేకుండా చేసి, భూస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం. మూడు, ఆస్తి బదిలీని సులభతరం చేసి, వ్యాపార సౌలభ్యం తయారు చేసి, తెలంగాణ భూమిని దేశదేశాల సంపన్నులకు బంగారు పళ్లెరంలో అందించడం.

ఈ మూడు లక్ష్యాలూ కూడా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ చారిత్రక వారసత్వానికి, తెలంగాణ భవిష్యత్తుకు హానికరమైనవి. భూమి గురించి సామాజిక వనరు, అత్యధికుల జీవనోపాధి, కొద్ది మంది ఆస్తి అనే మూడు స్థాయిలలో ఆలోచించవలసి ఉంది. భూమే ఇవాళ్టికీ మొత్తం సమాజానికి అత్యంత ప్రధానమైన ఉత్పాదక వనరు. అది జనాభాలో మూడింట రెండు వంతుల మందికి జీవనాధారం. దాన్ని ఆస్తిగా, హౌదాగా, ఎక్కువ ప్రతిఫలం ఇచ్చే పెట్టుబడిగా చూసేవారు కూడ కొందరున్నారు. వీరిలో ఎవరి ప్రయోజనాల కోసం భూసంబంధ విధానాలను రూపొందించాలనే చర్చ వచ్చినప్పుడు సంక్షేమ, ప్రజా రాజ్యం తప్పనిసరిగా సామాజిక అవసరాలకూ, అత్యధికుల ప్రయోజనాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కాని ప్రస్తుత తెలంగాణాధీశుల చట్టాలు కేవలం అత్యల్ప సంఖ్యాకుల స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతున్నది.

భూ రికార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో భద్రపరచడం సమాచార భద్రత కోసం అవసరమైతే కావచ్చు గానీ, ఇంకా ముప్పైశాతం నిరక్షరాస్యత ఉన్న సమాజంలో, ఎలక్ట్రానిక్‌ నిరక్షరాస్యత అంతకు రెట్టింపో, ఎక్కువో ఉన్న సమాజంలో ఆ సమాచారాన్ని భౌతిక రూపంలో పూర్తిగా తొలగించి, ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మారుస్తామనడం ఆ సమాచారాన్ని తారుమారు చేసే, స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే శక్తులకే ఎక్కువ మేలు చేస్తుంది. దీనితో విపరీతమైన పెట్టుబడి, భౌతిక పెట్టుబడి కూడ కాదు, లాభాపేక్ష గల, ఏ క్షణమంటే ఆ క్షణం ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే అక్కడికి పరుగెత్తే కాలునిలవని పెట్టుబడి తెలంగాణ భూమి మార్కెట్‌లోకి ఎలక్ట్రానిక్‌ రూపంలో ప్రవేశిస్తుంది. ప్రత్యక్షంగానో, దళారీల ద్వారానో విశాల భూక్షేత్రాలకు యజమాని అవుతుంది. చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులను కొల్లగొట్టి, స్టాక్‌ మార్కెట్‌ జూదంలోలాగ కొనడానికి, అమ్మడానికి దారి తీసి, భూ కేంద్రీకరణను పెంచుతుంది. ఇప్పటికే తెలంగాణ గ్రామీణ జనాభాలో 43.7శాతం భూమి లేని నిరుపేదలుగా ఉన్నారని తెలంగాణ సోషల్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ 2017 ప్రకటించి ఉంది. ఆ భూమిలేని నిరుపేదలకు భూమి, ఉద్యోగం, ఉపాధి కల్పించడం ఎలా అని ఆలోచించవలసిన ప్రభుత్వం ఈ కొత్త విధానం ద్వారా మరింత జనాభాను భూమిలేని నిరుపేదల వర్గంలోకి తోయడానికి రంగం సిద్ధం చేస్తున్నది.

లక్షల, వేల, వందల ఎకరాల భూస్వాములు ఉండిన గతంలో మాత్రమే కాదు ఇవాళ్టికీ తెలంగాణ వ్యవసాయ రంగంలో కౌలుదార్ల సంఖ్య గణనీయంగా ఉన్నది. వ్యవసాయంతో సంబంధంలేని, ఎన్నడూ వ్యవసాయం చేయని, గతంలో వ్యవసాయంతో సంబంధం ఉన్నప్పటికీ, ప్రస్తుతం పట్టణాలలో ఇతర ఆదాయ మార్గాలలో ఉన్నవారు తమ భూములను కౌలుకు ఇవ్వడం ఒక అంశం. గత రెండు మూడు దశాబ్దాలుగా ఇతరేతర మార్గాలలో, ప్రధానంగా అవినీతితో ఆర్జించిన కోట్లాది రూపాయల ధనాన్ని రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు భూమి మీద పెట్టుబడిగా పెట్టి, గ్రామీణ ప్రాంతాలలో వందలాది ఎకరాలు కొంటున్నారు. భూములు లేవు, స్వాములు లేరు అనడం ప్రాస ప్రకారం బాగుంటుంది గానీ, నయా భూస్వాములు ఉన్నారనేది ఒక వాస్తవం. ఒక స్వచ్ఛంద సంస్థ సేంద్రియ వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడానికి పూనుకున్నప్పుడు, హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి వెయ్యి ఎకరాలు ఉన్నవారు కూడ వచ్చారని, రెండు మూడు వందల ఎకరాలు, వంద ఎకరాలకు పైన ఉన్నవారు ఎందరో నమోదై ఉంది. అది చట్టవ్యతిరేకమైనా వాస్తవంలో ఉన్నది. ఇటువంటి గైర్‌ హాజరీ భూస్వాములకు చెందిన కొన్ని లక్షల ఎకరాల భూములు కౌలుదార్లే సాగు చేస్తున్నారు. కౌలుదార్ల రక్షణ కోసం 1950 నాటి నుంచి వచ్చిన అనేక చట్టాలను, విధానాలను తుంగలో తొక్కి భూస్వాములను రక్షించడానికి ప్రస్తుత చట్టం కంకణం కట్టుకున్నది.

ప్రకటిత లక్ష్యాలలో మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పనిసరిగా అమలు జరగబోయేది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – వ్యాపార సౌలభ్యం కల్పించడం. మా ప్రజల జీవనాధారమైన భూమిని, అంటే మా ప్రజలను కారు చౌకగా, అత్యంత సులభంగా, వారికి కూడ తెలియకుండా, భూమి మీదికి కూడ పోకుండా, కంప్యూటర్‌ మీదనే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ వ్యాపారం అత్యంత సులభంగా సాగిస్తాం, రండహౌ, రారండహౌ అని ఎర్రతివాచీ ఆహ్వానాలు పలకడానికి మారుపేరు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఈ చట్టం దాన్ని నేరుగానే చెప్పింది.

Courtesy Nava Telangana