మాడభూషి శ్రీదర్‌

లాక్‌డౌన్‌ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ ప్రాణాలర్పిస్తున్న కార్మికులు వారు. ఇక్కడ రాజ కీయం కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. పార్టీని కాదు, పాలకుల్ని అడగాలి. చట్టాల్ని కాదు, చట్టుబండలైన మానవత్వాన్ని అడగాలి. ప్రాణాంతకమైన నేరంచేస్తే, రుజువుచేసి ప్రాణం తీయడమే శిక్ష అని భావించినప్పుడు తప్ప మరే రకం గానూ ప్రాణం తీయవద్దని ఆర్టికల్‌ 21 జనం ప్రాణాలకు భరోసా ఇచ్చింది. అడుగడుగునా అరికాళ్ల రక్తపు మడుగులతో తడిసిపోతూ రాజ్యాంగమా ఉన్నావా అని అడుగుతున్నది. ఇది మన నాగరికత వేసిన కొత్త ముందడుగు అనుకొని మురిసిపోదామా లేక నిలదీసి అడుగుదామా? వలస కార్మికులను ఏడిపించే కొత్త ఏడు చేపల కథ.

మొదటి చేప: అందరికన్నా ముందు, కరోనాకు విరుగుడు వ్యూహం లాక్‌ డౌన్‌ అని ప్రకటించిన వలస కూలీల జీవ రాశి ఉందనే విషయం గుర్తులేదు, అదే ఎండని మొదటి చేప. పత్రికలు టీవీలు గాడాంధకార కాంతి చిత్రాలు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌ పురుషోత్తములు నిట్టూరుస్తున్నారు. పిల్‌లను చెత్తబుట్టలో వేస్తు న్నారు. కొత్తవి పడుతున్నాయి.

రెండో చేప: జనవరి 30న కరోనా తొలి బలితీసుకున్నది. ఓవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా మార్చి 13న మనం ఇదేమంత ఎమర్జెన్సీ కాదన్నాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాం. వలసకూలీలకు బతుకు భయమేసింది. నాలుగు గంటల నోటీసుతో భారత జాతీయ జనతా అష్టదిగ్బంధనం మార్చి 24న ప్రకటించారు. కోట్లాది వలస కూలీలు భవిష్యత్తు ఆలోచనకు నాలుగ్గంటలు, ప్రమాదమేమీ లేదనే హామీకి, దేశవ్యాప్తలాక్‌ డౌన్‌ కు మధ్య కేవలం రోజులు.

మూడో చేప: వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిండి, డబ్బు లేదు. యాజమాన్యాలు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. అప్పటికే పని చోటుకు చాలాదూరమైపోయారు. రెండింతలు రేషన్‌ ఇస్తామన్నారు మార్చి 26న. వారిలో చాలా మందికి రేషన్‌ కార్డే లేదు. ప్రజాపంపిణీలో లేని 8 కోట్ల పేదలకు తిండి పదార్థాలు ఇస్తామని లాక్‌ డౌన్‌ 50వ రోజున ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడున్నారో తెలియని 8 కోట్లమందికి తిండిగింజలు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.

నాలుగో చేప: శ్రామిక రైళ్లన్నీ వలస కూలీలకే. అందమైన పేరు. కాళ్లరిగేట్టు నెత్తురోడేట్టు తిరుగుతున్న కూలీలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఏప్రిల్‌ 29 న ప్రకటించింది ప్రభుత్వం. కూలీలు బయలుదేరిన రాష్ట్రం, చేరవలసిన రాష్ట్రం సమష్టిగా కోరితేనే రైళ్లిస్తామన్నారు. ఎవరు సమన్వయం చేస్తారు? కొన్ని రాష్ట్రాల వారికి కూలీలను బయటకు పంపే ఉద్దేశం లేదు. రాజకీయంగా నువ్వంటే నువ్వని తిట్టుకోవడానికి కొత్త సాకు దొరికింది. 58 రోజుల తరువాత వారి ప్రయాణాల సమన్వయానికి ‘జాతీయ వలసకూలీ సమాచార వ్యవస్థ’ను కేంద్రం ప్రకటించింది.

అయిదో చేప: వలసకూలీలు హాయిగా సొంతూరికి రైల్లో పోవచ్చు. కాని కరోనాలేదని తేలిన తరువాతే. ఎవరిస్తారీ సర్టిఫికెట్‌? ఎంతిస్తే ఇస్తారు? ఆన్‌లైన్‌ ఫారం నింపాలట.ఆన్‌లైన్లో దరఖాస్తు చేసిన తరువాత దానికేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలి? ఇదంతా లాభం లేదని మళ్లీ నడక ప్రారంభించారు.

ఆరోచేప: మోదీ ప్రభుత్వం 85 శాతం రైల్వే చార్జీలు భరిస్తాం అని చెప్పింది. ఎంత ఉదారత? రైల్వే పూర్తి చార్జీలు గోళ్లూడగొట్టి మరీ వసూలు చేసింది. ఎంత ఆర్థిక క్రమశిక్షణ? 2011 జనాభా లెక్కల ప్రకారం వలస కూలీలు 5 కోట్ల 60 లక్షలు. అసలు సంఖ్య ఆరున్నరకోట్లు. వీరంతా వెనక్కి రావడానికి రూ. 4,200 కోట్లు కావాలట. ఎవరిస్తారు– ఏ లాభమూ లేకుండా?

ఏడో చేప: రైల్వే శాఖ 15 లక్షల మంది వలస కూలీలను తరలించామని సగర్వంగా చెప్పుకున్నది. మిగతా ఆరుకోట్ల 35 లక్షల సంగతేమిటి? వారే రోడ్ల మీద నడుస్తున్నది. పిల్లలను భుజాల మీద మోసుకుని, ముసలాయనను చక్రాల సూట్‌కేస్‌మీద, గర్భవతైన భార్యను చక్రాల చెక్కమీద, ఎందుకు వందల మైళ్లు లాక్కుపోతున్నారు?

ఈ మధ్యలో కేంద్రప్రభువులు రాష్ట్రాలకు మళ్లీ ఉత్తర్వులు–‘రోడ్ల మీద కూలీలను నడవనీయకండి’ అని. ఉత్తరప్రదేశ్‌ కూలీలు రాష్ట్రం హద్దులు దాటడానికి వీల్లేదని ఉత్తర్వులు వేసింది. ఒక జిల్లాలో స్థానికులు కూడా వారికి సాయం చేయరాదని ఆదేశించింది. వలస కూలీలు ఓటర్లు కారా? లేక వారికి హక్కులు లేవా? వాళ్లను ఎవరు నడవమన్నారు? వాళ్లు అలా నడిచి వెళితే మేమేం చేయగలం అని అంటారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మనం మనుషులమేనా?

Courtesy Sakshi