వంగూరు రాములు

నూతన రెవెన్యూ చట్టం – తెలంగాణ భూమి హక్కులు – పట్టాదారు పాసుపుస్తకాలు 2020, గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దుకు సెప్టెంబర్‌ 9న రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. 11న శాసనసభ, 14న శాసనమండలి, 15న గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో కొత్తచట్టం అమలులోకి వస్తున్నది. ఈ చట్టం చారిత్రాత్మకమైనదని, విప్లవాత్మకమైనదని, అవినీతి అంతమవుతుందని, మొత్తం రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయి కనుక గ్రామాలలో ప్రజలందరూ పండుగలు చేసుకోండి అని ఏలినవారి ఆజ్ఞ. సమగ్ర భూసర్వే చేయకుండా, పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు పరిష్కారం చూపకుండా, పాసు పుస్తకాల సవరణ వల్ల రెవెన్యూ వ్యవస్థలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? 1971 పట్టాదారు పాసుపుస్తకాల చట్టంలో ఒక సెక్షన్‌ను సవరణ చేసి, భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకం 2020 చట్టంలో మార్పులు చేస్తేనే రెవెన్యూలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? సాగుదారు కాలం (కౌలుదారు) నూతన చట్టంలో రద్దు చేయడం వలన అతివృష్టి, అనావృష్టి సంభవించి పంటల నష్టం జరిగినప్పుడు కౌలుదారునికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకుండా పోతుంది. కౌలుదారులు, రైతు సంఘాలు పోరాడి సాధించుకున్న 1951, 2011 కౌలుదారీ చట్టాలు ఈ కొత్తచట్టంతో నిరుపయోగంగా మారుతాయి.

తెలంగాణ ప్రభుత్వం సాగుదారు కాలం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్రంలో ఉన్న 20 లక్షలమంది కౌలుదారులకు పథకాలు అందకుండా పోతాయి. భూముల కొనుగోలు, అమ్మకాలు, పంపకాలు జరిగినపుడు ధరణి వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని తహశీల్దారు ఇచ్చిన సమయానికి కుటుంబ సభ్యులంతా వెళ్తే ఒకేరోజు రిజిస్ట్రేషన్‌ మ్యూటేషన్‌ పాసు పుస్తకం అందజేస్తారట! ఫీల్డ్‌లో రెవెన్యూ అధికారి ఆ భూమిని పరిశీలించకుండా ఈ పని న్యాయంగా జరుగుతుందా? భూ వివాదాల పరిష్కారం కోసం ఇప్పుడున్న తహశీల్దార్‌, ఆర్‌డీఓ, జాయింట్‌ కలెక్టర్ల కోర్టులను రద్దుచేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను 1,000 కేసులకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి 4నెలల్లో పరిష్కారం చేస్తామనీ, ఆ తరువాత కొత్తగా కేసులు వస్తే సివిల్‌ కోర్టుకు వెళ్ళాలని అంటున్నారు. భూవివాదాలు వస్తే సన్న, చిన్నకారు రైతులు సివిల్‌ కోర్టుల చుట్టూ తిరగడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుందా? భూ ప్రక్షాళన సందర్భంగా ధరణి వెబ్‌సైట్‌లో ఒకరి రిజిస్ట్రేషన్‌ నెంబరు మరొకరి పేరుతో, ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదవడం వంటి అనేక లోపాలు జరగడం, సైబర్‌ నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురవడం, ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లతో కూడా అనేక సమస్యలు రావడం జరిగింది. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో ఆ లోపాలు జరగవనే గ్యారంటీ ఉందా? కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్స్‌ పంచాయతీలకు అప్పగించి, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు లేకుండా తహశీల్దారు ఒక్కరే రెవెన్యూ విధులు అన్నీ నిర్వహించడం సాధ్యమా..?

కొన్ని శతాబ్ధాల చరిత్ర కలిగిన రెవెన్యూశాఖలో గత పాలకులు కూడా అనేక మార్పులు చేర్పులు చేపట్టారు. అవి ఆశించిన ఫలితాలు సాధించాయా? 1978లో మాలీ పటేల్‌ వ్యవస్థ రద్దు చేశారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను 1984లో ఎన్‌టి. రామారావు రద్దుచేసి విలేజ్‌ అసిస్టెంట్‌ (వీఏ), గ్రామ సేవకుల వ్యవస్థను కొనసాగిస్తూ మండలాల వ్యవస్థను తెచ్చాడు. 1992లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి గ్రామ పరిపాలనా అధికారి (పార్ట్‌టైమ్‌ ఉద్యోగం గౌరవవేతనం) పేరుతో మార్పు చేశారు. 2002లో చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంకు విషమ షరతులకు తలొగ్గి రెవెన్యూశాఖను పంచాయతీ శాఖలో విలీనం చేస్తూ జీఓ369ని, గ్రామ సేవకులను (వీఆర్‌ఏ)లను పంచాయతీలకు పంపుటకు జీఓ 774 తీసుకువచ్చాడు. ఈ జీఓలకు వ్యతిరేకంగా రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికసంఘాల జేఏసీ ఏర్పడి ఐక్య పోరాటం చేయడం ఫలితంగా నాటి టీడీపీ ప్రభుత్వం ఆ జీఓలను ఉపసంహరించింది. రెవెన్యూ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే చర్యలు తీసుకొని నాటి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినది. 2007లో గ్రామ సేవకులు 29రోజులు సమ్మె చేయడం ఫలితంగా వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సంఘాలతో చర్చలు జరిపి గ్రామ సేవకులలో (వీఆర్‌ఏ) 5 సంవత్సరాల సర్వీసు ఉండి 10వ తరగతి పాస్‌ అయిన వారికి జీఓ 39 విడుదల చేసి, అర్హత కల్గిన వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా ప్రమోషన్స్‌ ఇచ్చారు. సర్వీసు రూల్స్‌ 105 ఇచ్చి గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. పాలకులు ఎవరు మారినా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా ప్రజలతో నిత్య సంబంధాలు కలిగివున్న రెవెన్యూ వ్యవస్థ నాటినుంచి నేటివరకు కొనసాగుతున్నది. ఇంతటి చరిత్ర కలిగిన రెవెన్యూ శాఖను ఉద్యోగులంతా అవినీతిపరులని, ఉద్యోగుల అధికారాలు తగ్గించి, వీఆర్‌ఓల వ్యవస్థను రద్దుచేసి 5600 మందిని నిర్థాక్షిణ్యంగా తొలగించి ఇతర శాఖలకు పంపడం న్యాయమేనా?

వీఆర్‌ఏలకు పే-స్కేల్‌ ఇచ్చి, కొందరిని రెవెన్యూశాఖలో కొనసాగిస్తాం, అర్హతలను బట్టి గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీ, నీటి పారుదలశాఖకు పంపుతామని, వయోభారంతో ఉన్న వీఆర్‌ఏలు కోరితే వారి వారసులకు అవకాశం కల్పిస్తామని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం హామీనిచ్చారు. చదువులేని వారికి, 60ఏండ్లు పైబడిన వీఆర్‌ఏలకు కూడా పే-స్కేల్‌ అమలు చేస్తారా? చదువుకున్న వారికే వర్తింపచేస్తారా, తాతల స్థానంలో తండ్రులకు అర్హత లేకపోతే మనవళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారా? గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీ, నీటి పారుదల శాఖల్లో ఏమిపని చేయాలి? తెలంగాణలో ఉన్న వాటా బంధి సమస్య తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతుంది. ఈ సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందా? వీఆర్‌ఏలకు ఇలాంటి సందేహాలు ఏన్నో ఉన్నాయి.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఏర్పడిన నాటినుంచి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ (సీసీఎల్‌ఏ)ను పూర్తిస్థాయిలో నియమించలేదు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూశాఖకు మంత్రిని కేటాయించలేదు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పెంచిన ప్రభుత్వం తగిన సిబ్బందిని నియమించలేదు. డిపార్ట్‌మెంట్‌లో వేలాది పోస్టులను భర్తీ చేయకుండా సంవత్సరాలుగా ఖాళీగా ఉంచారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్‌ ఇవ్వకుండా, పీఆర్‌సీ, ఐఆర్‌ ఇవ్వలేదు. రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. గత ఆరేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులకు అవినీతి అంటగట్టి వీఆర్‌ఓ వ్యవస్థను రద్దుచేసి, పే-స్కేల్‌ ఇచ్చి వీఆర్‌ఏల వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రెవెన్యూ ఉద్యోగుల ఉనికికే ఈ ప్రభుత్వం ప్రమాదం తెచ్చింది.

ఈ చర్యతో అవినీతి పోతుందా? అవినీతి రెవెన్యూ శాఖలోనే ఉందా? అందులో వీఆర్‌ఓలు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారా! అవినీతిని పెంచి పోషిస్తున్నది ప్రభుత్వం కాదా! ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచి ఓట్లు వేయించుకొని, ఎన్నికల తర్వాత కూడా డబ్బులు పోసి ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేస్తున్నది ఎవరు? మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పథకాలలో కమీషన్స్‌ తీసుకుంటున్నది ఎవరు? కోకాపేట, మియాపూర్‌ భూమాఫియా, ఇసుక మాఫియా, నయీమ్‌ మాఫియా, డ్రగ్స్‌ మాఫియాల వెనుక ఎవరున్నారు? రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన అవినీతిని ప్రక్షాళన చేయకుండా ఉద్యోగుల్లో ఉన్న అవినీతిని నిర్మూలించడం సాధ్యమా? అవినీతి ఉన్న అన్ని వ్యవస్థలను రద్దు చేస్తారా? తహశీల్దారు, ఆర్‌డీఓ, అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు అనేక ఘటనలు పత్రికల్లో చూస్తు న్నాం. అవినీతి జరిగిందని తహశీల్దారు, ఆర్‌డీఓ, కలెక్టర్ల వ్యవస్థలను కూడా రద్దు చేస్తారా! ఒక్కరో, ఇద్దరో అవినీతికి పాల్పడితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి కానీ! ”ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగలబెట్టిన” చందంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహారింటం తగునా? ప్రజలు అలోచించాలి.

Courtesy Nava Telangana