బుద్వేల్‌లో 70 ఎకరాలు సిద్ధం
వెళ్లేందుకు హైకోర్టు సుముఖం
సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌?
త్వరలో బార్‌ కౌన్సిల్‌లో చర్చ
వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు
తెలంగాణ హైకోర్టును బుద్వేల్‌కు తరలించనున్నారా? ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. తాజాగా హైకోర్టును కూడా నూతన భవనంలోకి తరలించనుందా? బుద్వేల్‌లో సువిశాల స్థలం కేటాయించిందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న హైకోర్టు తరలింపు అంశం తెరపైకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుద్వేల్‌కు తరలించడానికి సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయస్థానం నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ అందినట్లు తెలుస్తోంది. ఆ లేఖను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జోషిని ఆదేశించినట్లు సమాచారం. రాజధానికి చారిత్రక చిహ్నంగా, మూసీ ఒడ్డున ఉన్న హైకోర్టు వందేళ్ల ఉత్సవాన్ని కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. దాదాపు 9 ఎకరాల్లో హైకోర్టు విస్తరించి ఉంది. అయితే భవనాలు బాగా పాతవి కావడంతో పాటు నగర విస్తరణతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా పెరిగాయి.

ప్రస్తుత హైకోర్టు భవనంలో రెండు సార్లు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి న్యాయస్థానాన్ని తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు కోసం ప్రభుత్వం బుద్వేల్‌లో గతంలోనే 100 ఎకరాలను ఇస్తామంది. అందులో ప్రస్తుతం 70 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. దీన్ని హైకోర్టుకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అక్కడే న్యాయమూర్తుల గృహ సముదాయానికి కూడా స్థలం కేటాయించడానికి సంసిద్ధత తెలిపింది. బార్‌ అసోసియేషన్‌కు కూడా భూమి ఇవ్వడానికి సానుకూలంగా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు దగ్గరగా ఉండడం, విశాలమైన భవనాలు రానుండడంతో కొందరు సీనియర్‌ న్యాయవాదులు కూడా హైకోర్టు తరలింపుపై సుముఖత తెలిపినట్లు సమాచారం. ఈ విషయమై త్వరలోనే బార్‌ కౌన్సిల్‌లో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

న్యాయస్థానాన్ని తరలించొద్దు..
చాలామంది న్యాయవాదులు హైకోర్టు తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు పరిరక్షణ సమితిగా ఏర్పాటవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం భోజన విరామ సమయంలో న్యాయవాదులు హైకోర్టు ముందు నినాదాలు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు భవనాన్ని బుద్వేలుకు తరలించవద్దని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తరలించాలని చూస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టును ప్రస్తుత భవనంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డికి; హైకోర్టు న్యాయవాదుల సంఘం చైర్మన్‌ సూర్యకిరణ్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.

జడ్జీల సంఖ్యను 42కు పెంచాలి: రాంచందర్‌రావు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసుల సత్వర పరిష్కారానికి జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని, ఈ మేరకు ఖాళీలను తక్షణం భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో ఏపీ హైకోర్టును అమరావతికి తరలించగా.. తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారని పేర్కొన్నారు.

(Courtacy Andhrajyothi)