కంగారెత్తించిన కొత్త గవర్నర్‌!

  • 11న వస్తానని ఎనిమిదినే వచ్చిన తమిళిసై..
  • నరసింహన్‌తో మంత్రుల ప్రమాణానికి కేసీఆర్‌ ఏర్పాట్లు
  • కొత్త గవర్నర్‌నూ ఒప్పించిన సీఎం
  • కేంద్రం అనూహ్య జోక్యంతో ముందే వెళ్లిన నరసింహన్‌
నరసింహన్‌ చేతుల మీదుగా జరగాల్సిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనుకోకుండా ఆగిపోయిందా? మూడు రోజుల తర్వాత వచ్చేందుకు అంగీకరించిన కొత్త గవర్నర్‌ ఢిల్లీ ఆదేశంతో ముందుగానే రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె చేతుల మీదుగానే ప్రమాణ స్వీకారం చేయించారా? అంటే అవుననే చెబుతున్నాయి పరిణామాలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1న కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందర రాజన్‌ను నియమించింది. ఆగస్టు 31 రాత్రే సీఎం కేసీఆర్‌కు కొత్త గవర్నర్‌ వస్తున్నారన్న సమాచారం అందింది. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అప్పటికి నెల రోజుల ముందే కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ముహూర్తాల కోసం పండితులను కూడా పురమాయించారు.
సెప్టెంబరు 8న దశమి రోజు దివ్యమైన ముహూర్తం ఉండటంతో అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో గవర్నర్‌ మార్పు నిర్ణయం వెలువడింది. సెప్టెంబరు ఎనిమిదిన నరసింహన్‌తో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పదో తేదీన ప్రగతిభవన్‌లో ఘనంగా విందు ఇచ్చి వీడ్కోలు తెలపాలని సీఎం అనుకున్నారు. నరసింహన్‌ కూడా 11న శుభదినం కావడంతో ఆ రోజున రాజ్‌భవన్‌ను వీడాలని అనుకున్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన విలేకరులతో ఇష్టాగోష్టిలో కూడా నరసింహన్‌ తాను మరో వారం ఉంటున్నట్లు చెప్పారు. ఈలోగా కొత్త గవర్నర్‌ తమిళిసై సెప్టెంబరు 8న బాధ్యతలు స్వీకరిస్తానని సమాచారం అందించారు. ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాలన్నది కొత్త గవర్నర్‌కు ఉన్న ప్రత్యేక హక్కు. ఆమె తేదీలను బట్టి దిగిపోతున్న గవర్నర్‌ వెళ్లిపోవాలి. దాంతో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని నరసింహన్‌ 11 వరకు ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం అందించారు.
అప్పటిదాకా ఆగేందుకు ఆమె అంగీకరించారు. హఠాత్తుగా ఏమయిందో ఏమో కానీ 8నే తాను రాష్ట్రానికి వస్తున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందించారు. దాంతో 7వ తేదీనే నరసింహన్‌ రాజ్‌భవన్‌ను అనివార్యంగా వీడాల్సి వచ్చింది. ఏడునే గవర్నర్‌కు విందు ఏర్పాటు చేశారు. నిజానికి సప్తమి రోజు కూడా ప్రమాణ స్వీకారానికి మంచిరోజేనని పండితులు సూచించడంతో ఐదో తేదీనే ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని సీఎం భావించినట్లు చెబుతున్నారు. అయితే, కొత్త గవర్నర్‌ వస్తుండగా, దిగిపోతున్న గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించడం సరికాదని కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది.
విస్తరణ వద్దు
ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రివర్గ విస్తరణ వద్దని తమిళిసై స్పష్టం చేసినట్లు సమాచారం. బాధ్యతలు స్వీకరించిన రోజే ఎందుకు… కొన్ని రోజులు ఆగవచ్చు కదా అని ఆమె పట్టుబట్టడంతో… చేసేదేమీ లేక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో తమిళిసై సరేనన్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా మాజీ సివిల్‌ సర్వెంట్‌ అయిన గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాఫీగా గడిచిపోయింది. తాజాగా గవర్నర్‌ బాధ్యతలు స్వీకరించిన తమిళిసై పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్త కావడం, మొండిమనిషిగా ఆమెకు పేరుండటంతో సీఎం-గవర్నర్‌ సంబంధాలు అంత సాఫీగా ఉండవని మొదటి నుంచే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆమె తన మొండి తనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తొలిరోజే చూపించారు. ఆమె 8నే ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం వెనుక తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను అడ్డుకోవడానికి, తాత్కాలికంగా వాయిదా వేయించడానికి ఆయన అన్ని విధాలా చివరిదాకా ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

(Courtacy Andhrajyothi)

Leave a Reply