ఇరు కుటుంబాల ఘర్షణతో కలతచెంది అఘాయిత్యం

భువనగిరి టౌన్‌ : ఆ ప్రేమ వివాహం పట్టుమని పది రోజులు కూడా నిలువలేదు. తల్లిదండ్రులను ఒప్పించలేక.. ఇంటి నుంచి పరారై గుడిలో పెళ్లి చేసుకున్న నవ దంపతులు రెండు రోజుల్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వరుసకు బావమరదళ్లు అయిన మెదక్‌ జిల్లా ముత్తంగికి చెందిన స్వామి(24), మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడానికి చెందిన ఉమ(19) ప్రేమించుకున్నారు. అయితే స్వామికి మరో అమ్మాయితో ఈ నెల 27న నిశ్చితార్ధం జరపాలని అతడి తల్లిదండ్రులు నిర్ణయించారు.

దీంతో స్వామి ఈ నెల 15న బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఉమను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఘట్కేసర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన నవ దంపతులు సోమవారం సాయంత్రం భువనగిరి పట్టణ శివారులోని ఓ హోటల్‌ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్వామి మృతిచెందగా.. ఉమ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది.

Courtesy Andhrajyothi