జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ(59) మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్‌ రాయబారిగా పనిచేస్తున్నారు. కాగా నెల్సన్‌ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ.

అయితే వీరు 1992లో విడాకులు తీసుకోగా విన్నీ మడికిజెలా 2018 ఏప్రిల్‌ నెలలో మృతి చెందారు. 1998లో తన పుట్టిన రోజు సందర్భంగా మండేలా మూడో భార్య గ్రాచా మాచెల్స్‌ను వివాహం చేసుకున్నారు. నెల్సన్‌ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా మండేలా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జోహన్నెస్‌బర్గ్‌లో‌ మరణించారు.

Courtesy Sakshi