హైదరాబాద్‌ సిటీ : తన మేనకోడలు అయిన  ఐదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి (పోక్సో) 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 2018 జూలై 29న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  స్థానిక ఓ బస్తీలో నివాసముండే వ్యక్తి తన అల్లుడి దుశ్చర్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒక రోజు అర్థరాత్రి సమయంలో ఇంటి యజమాని నిద్ర లేచి బాత్రూమ్‌కు వెళ్తుండగా తన అల్లుడు పక్క గదిలో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించారు. రెండు సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.  ఓ సెక్షన్‌ కింద పదేళ్ల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా, మరో సెక్షన్‌ కింద 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించడంతో మొత్తం 20ఏళ్లు జైలు జీవితం గడపాల్సిందే. చురుగ్గా దర్యాప్తు జరిపిన పోలీసు సిబ్బందిని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అభినందించారు.

Courtesy Andhrajyothi