-ఇది ప్రపంచ జనాభాలో 1శాతం కంటే ఎక్కువ
-గతేడాది వారి సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలు
– యూన్‌హెచ్‌సీఆర్‌ తాజా నివేదిక

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 79.5 మిలియన్ల మంది(7.95 కోట్లు) తామున్న ప్రాంతాలు ,దేశాల నుంచి వేరొక చోటుకు బలవంతంగా తరలి వెళ్లారు. ఇది ప్రపంచ జనాభాలో ఒక్కశాతం కంటే అధికం కావడం గమనార్హం. ఈ విషయాన్ని యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) తన తాజా నివేదికలో పేర్కొన్నది. గతేడాది వీరి సంఖ్య(శరణార్థులు, వలసదారులు, నిరాశ్రయులు) 90 లక్షలకు పెరిగిందని నివేదిక పేర్కొన్నది.

సామ్రాజ్యవాద దురాక్రమణ కారణంగా…
సాంప్రదాయిక, సామ్రాజ్యవాద దురాక్రమణ ద్వారా ఇటువంటి దేశాల రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలను నాశనం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్లడానికిి ప్రధాన కారణమని నివేదిక పేర్కొన్నది. ఈ దేశాలలో చాలావరకు జరిగిన యుద్ధాలు.. శరణార్థులు తిరిగి వచ్చే అవకాశాలను కూడా నాశనం చేశాయి. వ్యవసాయ వ్యవస్థలను నాశనం చేయడం మరియు ప్రకృతి వైపరీత్యాల తీవ్రత, వాతావరణ మార్పు వంటివి ప్రజలు తరలివెళ్లడానికి ఇతర ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, సోమాలియా మరియు కొన్ని ఇతర ఆఫ్రికన్‌ దేశాలలో సుదీర్ఘ యుద్ధాల కారణంగా 77 శాతానికి పైగా శరణార్థులు ఇప్పటికీ శిబిరాల్లో నివసిస్తున్నారు.

శరణార్థులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఆందోళన కలిగించే ధోరణిగా ఈ నివేదిక గుర్తించింది. ”1990 దశకంలో, ప్రతి ఏడాదీ సగటున 1.5 మిలియన్ల మంది( 15 లక్షల మంది) శరణార్థులు స్వదేశానికి తిరిగి రాగలిగారు. గత దశాబ్దంలో ఆ సంఖ్య 3,85,000 కు పడిపోయింది. ” అని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొన్నది. ప్రపంచంలోని మొత్తం శరణార్థులలో 85 శాతం మందికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి . ఈ విషయంలో జర్మనీ కాకుండా మొదటి ఐదు ఆతిథ్య దేశాల జాబితాలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలు లేవు. ఈ జాబితాలో టర్కీ, కొలంబియా, పాకిస్తాన్‌, ఉగాండా, జర్మనీ మరియు బంగ్లాదేశ్‌ లు ఉన్నాయి.

Courtesy Nava Telangana