• అనారోగ్యంతో విజయవాడలో తుదిశ్వాస
  • తెలుగునాట పుస్తక ప్రదర్శనలకు ఆద్యుడు
  • లబ్దప్రతిష్ఠులైన దిగ్గజాలతో అనుబంధం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిషర్స్‌ అండ్‌ బుక్‌సెల్లర్స్‌ అసోసియేషన్‌ను స్థాపించి, ప్రచురణల రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి, ప్రచురణ కర్తలకు అండగా నిలిచిన ప్రచురణ కర్త నవోదయ రామ్మోహనరావు. పుస్తకానికి ఒక ముఖచిత్రం ఉండాలని తెలియజెప్పి, బాపు సహకారంతో చేసి చూపించిన సృజనకారుడు.

విజయవాడ: ప్రచురణల రంగాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టి, కవులు, కళాకారులతో తన ‘నవోదయ’ను సాహిత్య కేంద్రంగా నడిపిన నవోదయ పబ్లిషర్స్‌ అధినేత అట్లూరి రామ్మోహనరావు (85) ఇక లేరు. కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విజయవాడ మొగల్రాజపురంలోని తన నివాసంలో కన్నుమూశారు. నవత అధినేత బోసు సోదరి ఝాన్సీ, రామ్మోహనరావు సతీమణి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు సుధాకర్‌ ఐదేళ్ల క్రితం మృతిచెందారు. కుమార్తె శోభ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 1934వ సంవత్సరంలో కృష్ణాజిల్లా ఉంగుటూరులో కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన నవోదయ రామ్మోహనరావు ఆ భావజాలంతో ప్రభావితులయ్యారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు సభలకు వెళుతూ, అభ్యుదయ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ పెరిగారు. విశాలాంధ్రలో కొంత కాలం ఉద్యోగిగా ఉన్న రామ్మోహనరావు చేతికి 1960లో వచ్చిన నవోదయ తెలుగు సాహిత్య అభిమానులకు సుమారు ఆరు దశాబ్దాల పాటు సేవలందించింది.

విజయవాడ కారల్‌ మార్క్స్‌ రోడ్డుకు ‘నవోదయ’ను ఒక ఐకాన్‌గా నిలిపారు. నాటి నుంచి 2016 మే నెలలో మూతపడే వరకు ఈ సంస్థను కళాకారులకు, సాహితీవేత్తలకు ఒక కేంద్రంగా నిలిపారు. బాపు, రమణల సహకారంతో, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శ్రీశ్రీ, రావిశాస్త్రి, ముళ్లపూడి, నండూరి రామ్మోహనరావు, గొల్లపూడి మారుతీరావు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, నార్ల వెంకటేశ్వరరావు వంటి ఉద్దండుల సాహిత్యన్ని ప్రచురించారు. గోపీచంద్‌, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆరుద్ర, నార్ల, నండూరి, శంకరమంచి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీరమణ, చెరబండరాజు, వాసిరెడ్డి సీతాదేవి, ఆర్‌.ఎ్‌స.సుదర్శనం తదితరులతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. తెలుగు ప్రచురణ కర్తలకు ఆయన ఒక సాహిత్య శిఖరం అనడంలో అతిశయోక్తి లేదు. విజయవాడలో పుస్తక ప్రదర్శనలకు ఆద్యుడు. ఇందుకోసం దేశమంతా తిరిగి విస్తృతంగా అధ్యయనం చేసిన కొద్దిమందిలో ఒకరు. 1989లో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వారితో సంప్రదింపులు జరిపి, విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయించారు. అనంతర కాలంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీని ఏర్పాటు చేసి, 1991 నుంచి నిరంతరాయంగా పుస్తక మహోత్సవాలను నిర్వహించేలా ఆయన కృషి చేశారు.

ఈ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆరవ పుస్తక మహోత్సవం వరకు ఆయన బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగారు. బాపుతో అత్యంత సాన్నిహిత్యం సాగించిన నవోదయ రామ్మోహనరావు బాపు పుట్టిన రోజున కన్నుమూయడం విశేషం. ఐదు సంవత్సరాల క్రితం కుమారుడు మృతిచెందిన తరువాత పబ్లిషింగ్‌ సంస్ధను రామ్మోహనరావు మూసివేశారు. నాణ్యమైన ప్రింటింగ్‌కు నవోదయ పబ్లిషింగ్‌ సంస్ధను మారు పేరుగా రామ్మోహనరావు తీర్చిదిద్దారు. ఆయన సేవలకు మెచ్చి డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ఆయనను విశేష్‌ పురస్కార్‌తో సత్కరించింది.

ఉద్యోగి నుంచి యజమాని వరకు..
నవోదయ రామ్మోహనరావు ప్రస్థానం

మొదట్లో ఆయన రూ.50 జీతానికి విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేశారు. తర్వాత ‘నవోదయ’లో చేరి.. కాలక్రమంలో యజమాని అయ్యారు. ‘నవోదయ’ రామ్మోహనరావుగా ఖ్యాతి గడించారు. ఆయన 1934లో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు అక్కలు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో పెద్దక్క శేషారత్నం ఆమెను కన్నతల్లిలా పెంచారు. ఆమె భర్త పొట్లూరి సుబ్బారావు కమ్యూనిస్టు. ఆమె చిన్నక్క లోలాక్షి 1946లో కొండపల్లి రాఘవరెడ్డిని కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. తొలి నుంచీ రామ్మోహనరావుకు కమ్యూనిస్టు పార్టీపై మక్కువ. ఉంగుటూరులో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన.. గుడివాడ హైస్కూలులో చేరారు. కమ్యూనిస్టులపై నిర్బంధం కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తిరిగొచ్చాక కైకలూరులో బావ ఇంట్లో ఉండి పదో తరగతి పూర్తిచేశారు.

పై చదువులు చదివే స్తోమత లేకపోవడంతో నెలకు రూ.50 జీతానికి ఆయన విశాలాంధ్ర ప్రచురణాలయంలో చేరారు. కమ్యూనిస్టు పార్టీకి ఇంకా దగ్గరయ్యారు. ఆ సందర్భంగానే ప్రముఖ కమ్యూనిస్టు నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. 1955లో పర్వతనేని ఝాన్సీలక్ష్మితో ఆయన వివాహమైంది. దండల పెళ్లి చేసుకున్నారు. ఖర్చు కేవలం రూ.125. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక హోల్‌ టైమర్లను భరించలేమని పార్టీ నాయకత్వం తేల్చిచెప్పడంతో బతుకుదెరువు కోసం రామ్మోహనరావు సహా వేరే ఉద్యోగాలు వెతుక్కోవలసి వచ్చింది. అదే సమయంలో ఆయన చినబావ 1957లో గుడివాడలో ‘నవోదయ పబ్లిషర్స్‌’ స్థాపించారు. మరుసటి ఏడాది దాని కార్యాలయాన్ని విజయవాడకు మార్చారు. 1960లో నవోదయను ఆయన బావ ఆయనకు అప్పగించారు. ఏడాదిపాటు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 1961నాటికి గొల్లపూడి మారుతిరావు రచనలను పబ్లిష్‌ చేసే స్థాయికి ఎదిగారు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన ‘గిరీశం లెక్చర్లు’ పుస్తక ప్రచురణ బాగుండడంతో రామ్మోహనరావు దశ తిరిగింది.

బాపు-రమణలతో అనుబంధం బాగా పెరిగింది. ఇదే సమయంలో గోపీచంద్‌, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, ఆరుద్ర, నార్ల, నండూరి, శంకరమంచి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీరమణ, చెరబండరాజు, వాసిరెడ్డి సీతాదేవి, ఆర్‌.ఎ్‌స.సుదర్శనం వంటివారితో సాన్నిహిత్యం ఏర్పడింది. దేశంలో ఎక్కడ పుస్తక ప్రదర్శన జరిగినా.. రామ్మోహనరావు తానూ వెళ్లేవారు. తన సిబ్బందినీ పంపించేవారు. విజయవాడలో తొలి పుస్తక ప్రదర్శనలో ఆయనది కీలక పాత్ర. 1989లో అక్టోబరులో ఇది జరిగింది. నాటి నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా పుస్తక ప్రదర్శన కొనసాగుతోది.. అలాగే ఆంధ్రలోని పుస్తక విక్రేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఓ సంఘాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా రామ్మోహనరావుదే. ఆయన హేతువాది. ఆయన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు రిజిస్ట్రార్‌ ఆఫీసులోనే చేయించారు. ఆయన తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరపలేదు. తన తదనంతరం కూడా ఇలాంటి క్రతువులేవీ జరపొద్దని.. రామ్మోహనరావు చెప్పేవారు.

సెంట్రల్‌ డెస్క్‌