చండీగఢ్‌ : జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలీద్‌పై దాడికి పాల్పడిన నవీన్‌ దలాల్‌.. హర్యానా ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ మేరకు శివసేన పార్టీ అతడికి టికెట్‌ ఇచ్చింది. జజ్జర్‌ జిల్లా బహదూర్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి అతడు పోటీకి దిగుతున్నాడు. తనను తాను గోరక్షకుడిగా ప్రకటించుకున్న నవీన్‌.. గతేడాది ఆగస్టు 13న ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఎదుట జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉమర్‌ ఖాలీద్‌ను పిస్తోల్‌తో కాల్చాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఇది దేశానికి తానిచ్చిన బహుమతి అని వ్యాఖ్యానించాడు. దీంతో పోలీసులు ఈ వీడియో ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నవీన్‌.. ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. ఆరు నెలల క్రితమే తాను శివసేనలో చేరాననీ.. జాతీయవాదం, గోరక్షణ విషయంలో ఆ పార్టీ సిద్ధాంతాలు తనను ఆకర్షించాయని నవీన్‌ తెలిపాడు. ఉమర్‌పై దాడి గురించి మాట్లాడకుండా.. జాతీయవాదాన్ని ప్రదర్శించడంలో ఇది ఆయన శైలి అని శివసేన స్థానిక నాయకుడు విక్రం యాదవ్‌ అన్నాడు. ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన పత్రాలలో తనపై మూడు క్రిమినల్‌ కేసులున్నాయని నవీన్‌ ప్రకటించాడు.

Courtesy Navatelangana