– మల్లారెడ్డి ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘటన

-కుత్బుల్లాపూర్‌ : ల్యాబ్‌లోకి వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. గదిలోకి వెళ్లగానే తలుపులు వేసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మేడ్చల్‌ జిల్లా పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో (ఎంఆర్‌ఐఈటీ) ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా నెడుమనూరు మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (31) ఐదేండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ మానికేశ్వరీనగర్‌లో ఉంటున్నాడు. మైసమ్మగూడలోని ఎంఆర్‌ఐఈటీ ఉమెన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో గ్రౌండ్‌ వాటర్‌ లెవెల్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జి (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బీటెక్‌ సెకండియర్‌ విద్యార్థినిని ల్యాబ్‌లోకి రమ్మన్నాడు. అక్కడ తోటి విద్యార్థులు కూడా ఉంటారని భావించి ఆమె వెళ్లింది. కానీ వెంకటయ్య ఒక్కడే ఉన్నాడు.

ఆమె ల్యాబ్‌లోకి వెళ్లగానే వెనుక నుంచి చేరుకున్న వెంకటయ్య వెంటనే తలుపులు పెట్టేశాడు. ఆ మెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రాత్రి హాస్టల్‌ చేరుకున్న బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని బోరుమని విలపించింది. మంగళవారం ఉదయం బాధితురాలు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే నిందితుడు వెంకటయ్యను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.

Courtesy Nava telangana