యమరాజమార్గం!

ప్రాణాంతకంగా జాతీయ రహదారి 65
పది నెలల్లో 144 మంది దుర్మరణం
చీకటి కుహరాలు… ముఖ్య కూడళ్లు

పనికి వెళ్లిన అమ్మ తిరిగి రాలేదని బిడ్డలు… పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను కోల్పోయే పడతులు… ఎదిగొచ్చిన బిడ్డలు దూరమైన వృద్ధ తల్లిదండ్రులు… …ఆ దారి పొడవునా కనిపిస్తారు.

అదో మృత్యుమార్గం. గమ్యం చేర్చాల్సిన రోడ్డు ప్రాణాలు తీసేస్తోంది. బంధాలను తెంచేస్తోంది. ఎన్నో కుటుంబాలకు తీరని వేదననే మిగుల్చుతోంది. జాతీయ రహదారి 65 పరిస్థితి ఇది. నాలుగు వరుసలుగా రహదారి విశాలంగా ఉన్నా ప్రమాదాల నివారణకు చర్యలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ రోడ్డు స్థితిగతులపై ఈనాడు- ఈటీవీ తెలంగాణపరిశీలనాత్మక కథనమిది.

జాతీయ రహదారి 65 సంగారెడ్డి జిల్లాలోని లింగంపల్లి నుంచి జహీరాబాద్‌ శివారులోని మాడ్డి వరకు 98 కి.మీ. మేర ఉంటుంది. సంగారెడ్డి నుంచి రెండు వరుసలుగా ఉన్న రహదారిని మూడేళ్ల క్రితమే నాలుగు వరుసలుగానూ విస్తరించారు. కానీ ఈ మార్గంలో చాలా మలుపుల (క్రాసింగ్‌) వద్ద కనీసం విద్యుద్దీపాలు ఏర్పాటు చేయలేదు. ప్రమాదాల నివారణకు కనీస చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది పది నెలల్లో 144 మంది మృత్యువాతపడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ రోడ్డుపై ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్‌ సంస్థ తీసుకోవాల్సిన చర్యలను గుర్తిస్తూ జిల్లా పోలీసులు కొన్ని సూచనలతో నివేదిక అందించారు. లింగంపల్లి నుంచి జహీరాబాద్‌ వరకు తరచూ ప్రమాదాలు జరుగుతున్న 15 ప్రదేశాలను పోలీసులు గుర్తించగా.. ఇందులో దాదాపు అన్నీ కూడళ్లే కావడం గమనార్హం.
* చాలా కూడళ్ల వద్ద రాత్రివేళ చిమ్మచీకటిగా ఉంటోంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 25 చోట్ల విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి.
దిగ్వాల్‌ వద్ద నిత్యం విద్యార్థులు, రైతులు రోడ్డు దాటుతుంటారు. ఇక్కడ అత్యవసరంగా అండర్‌ పాస్‌ నిర్మించాలి. అల్గోల్‌ వద్ద కూడా సర్వీసు దారి ఏర్పాటు చేసి అండర్‌పాస్‌ను అందుబాటులోకి తేవాలి.
కూడళ్ల వద్ద వేగనియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలి. మలుపుల వద్ద రేడియం స్టిక్కర్స్‌ను అతికించాలి.
గ్రామాల నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.
అసంపూర్తిగా సర్వీసు రహదారులు
సదాశివపేటలోని పెద్దాపూర్‌ వద్ద పై వంతెన నిర్మించారు. భూసేకరణ సమస్యతో సర్వీసు రోడ్డు మధ్యలోనే ఆపేశారు. కొండాపూర్‌ మండలంలోని గ్రామాల నుంచి సంగారెడ్డి వైపు వచ్చేవారు అపసవ్య మార్గంలో వచ్చి జాతీయ రహదారిని దాటుతున్నారు. సంగారెడ్డి కూడలికి కొద్ది దూరంలోనే విభాగిని వద్ద మలుపు తీసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ రాత్రయితే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. ఇక్కడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వారికి దిక్కెవరు?
యమరాజమార్గం! సదాశివపేట మండలం ఎన్కపల్లికి చెందిన రాజ్‌కుమార్‌ పెళ్లయి ఏడాది కాకముందే మృత్యువాత పడ్డాడు. సదాశివపేటకు వెళ్లి తమ గ్రామానికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న జాతీయ రహదారిని ద్విచక్ర వాహనంపై దాటుతుండగా కారు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. అతడి భార్య, తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు.
యమరాజమార్గం! ఈ చిత్రంలో కుమారుడి సాయంతో వంట చేస్తున్న వ్యక్తి పేరు నివర్తి. ఆయన భార్య మధుమాల గ్రామానికి సమీపంలో ఉన్న పరిశ్రమలో పనిచేసేది. తెల్లవారుజామున బస్సు ఎక్కడానికి జాతీయ రహదారి దాటుతోంది. అక్కడ చీకటిగా ఉండటంతో వేగంగా వచ్చిన బస్సు మధుమాలను ఢీకొట్టడంతో మృతిచెందింది. రెండు నెలల క్రితం దిగ్వాల్‌ వద్ద జరిగిన ఈ ఘటన ఈ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
కోహిర్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్‌ గత ఏడాది మార్చిలో వాహనంపై జాతీయ రహదారిని దాటుతున్నాడు. అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొని మరణించాడు. దీంతో అతడి భార్య లావణ్య స్థానికంగా అంగన్వాడీలో ఆయాగా పనికి కుదిరారు. వచ్చే కాస్త ఆదాయంతో పిల్లలిద్దరినీ సాకాల్సిన దుస్థితి.
ప్రతి కూడలీ ప్రమాదకరమే
యమరాజమార్గం! జహీరాబాద్‌ మండలం అల్గోల్‌ కూడలి చాలా ప్రధానమైనది. పట్టణం నుంచి బీదర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు ఇక్కడ జాతీయ రహదారిని దాటుతుంటారు. కానీ రాత్రివేళ విద్యుద్దీపాలు లేక చిమ్మ చీకటిగా ఉంటోంది. ఈ కూడలి వద్ద ఏడాదిన్నర వ్యవధిలో 20 మంది చనిపోయారు. సమీపంలోని సర్వీసు రోడ్డును కూడలి వరకు విస్తరించి, అండర్‌పాస్‌ నిర్మించాలని స్థానికులు చాలా రోజులుగా కోరుతున్నారు.

(Courtesy Eenadu)