– కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా గ్రామీణ బంద్‌
– రైతు సంఘాల చలో ఢిల్లీ మద్దతుగా భాగస్వామ్యం
– డిసెంబర్‌ 6న రాజ్యాంగ పరిరక్షణ దినం
– వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలో దళిత సమస్యలపై డిసెంబర్‌ 9న జాతీయ కన్వెన్షన్‌ నిర్వహించేందుకు దేశంలోని ఐదు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నెల 26న పది జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వ్యవసాయ కార్మికులు గ్రామీణ బంద్‌ నిర్వహించాలని పిలుపు నిచ్చాయి. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా భాగస్వామ్యం కావాలని నిర్ణయించాయి. డిసెంబర్‌ 6న రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ దినం పాటించాలని పిలుపు నిచ్చాయి.

బుధవారం నాడిక్కడ స్థానిక అజయ్ భవన్‌లో ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఎడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, జాతీయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, భారతీయ కేత్‌ మంజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) ప్రధాన కార్యదర్శి గుల్‌జర్‌ సింగ్‌ గౌరియా, ఆలిండియా అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ లేబర్‌ అసోసియేషన్‌ (ఎఐఏఆర్‌ఎల్‌ఎ) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు రాధిక మీనన్‌, సంయుక్త కిసాన్‌ సభ (ఎస్‌ కేఎస్‌) జాతీయ నేత అసిత్‌ గంగూలీ, ఆలిండియా అగ్రగామి క్రిషి శ్రామిక్‌ యూనియన్‌ (ఏఐఏకేఎస్‌యూ) జాతీయ నేత ధర్మేందర్‌ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి. వెంకట్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.

దళిత వర్గంలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు ఉంటారనీ, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల్లో 60 శాతం వరకు దళితులే ఉన్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు, లైంగికదాడులు పెరిగాయనీ, దళితుల ఆర్థిక వనరులను కబళిస్తున్నారని వివరించారు. బీజేపీ అండతో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ ప్రాథమిక హక్కులు ఉన్నాయనీ, అంటరానితనం పై నిషేధం ఉందనీ, అసమానతులను పారదోలాలనే అంశాలు ఉన్నాయని వివరించారు. అయితే బీజేపీ రాజ్యాంగానికీ భిన్నంగా హక్కులకు తిలోదకాలిస్తున్నదని ఆరోపించారు.

అందువల్ల దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్‌ 9న జాతీయ కన్వెన్షన్‌ నిర్వహించాలనీ, డిసెంబర్‌, జనవరి రెండు నెలలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతి అంశాలపై ప్రచారం చేయాలని నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు డీఎస్‌ఎంఎం, ఇతర సామాజిక, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ప్రధానంగా దళితులకు భూమి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని పేర్కొన్న హక్కులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులకు ఆత్మగౌరవం కావాలని, ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ పేరుతో రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని పాటించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా నిబంధలన పేరుతో దళిత ఆర్థిక వనరులపై దాడి జరుగుతోందని విమర్శించారు. డిసెంబర్‌ 26న జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా గ్రామీణ బంద్‌, గ్రామీణ హర్తాళ్‌ను చేపట్టనున్నామని తెలిపారు.

మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు రైతులకే కాదు, వ్యవసాయ కార్మికులకు కూడా నష్టం చేకూర్చుతాయని అన్నారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రతి పేదవారి భూమి, ఇండ్ల స్థలాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే అందరికి విద్యా, వైద్యం, ఉపాధి కల్పించాలనీ, ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని ప్రచారోద్యమం చేయనున్నట్టు తెలిపారు. రైతు సంఘాలు తలపెట్టిన చలో ఢిల్లీ ఆందోళనలో వ్యవసాయ కార్మిక సంఘాలు భాగస్వామ్యమవుతున్నాయనీ, తాము కూడా వ్యవసాయ కార్మికులను కదిలిస్తామని తెలిపారు. విడివిడిగా పోరాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘాలన్ని ఒక వేదిక పైకి వచ్చి ఐక్య పోరాటానికి సిద్ధమైయ్యేందుకు సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు.

Courtesy Nava Telangana