– కొండూరి వీరయ్య

 CAAస్వాతంత్య్ర పోరాటం అందించిన భారతీయత భావనను కాపాడుకోవటానికి లక్షలాది మంది కంకణబద్ధులై పోరాడుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. ఈ దేశాన్ని లౌకికదేశంగా మిగుల్చుకుందా మని. దానికున్న మార్గం ఒక్కటే. జాతీయ పౌర జాబితా ప్రతిపాదనను వెనక్కు కొట్టడం. దీనికి పునాదిగా ఉండబోతున్న జాతీయ జనాభా రిజిష్టర్‌ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరగనీయకుండా చూడటం.

సామాజిక మాధ్యమాల్లో రకరకాల వాదనలు వస్తున్నాయి. విదేశాల్లో హింసకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గాలను (ప్రధానంగా హిందువులను) కాపాడటానికి ప్రభుత్వం చట్టం చేస్తే వచ్చిన నష్టం ఏమిటన్నదే ఈ వాదనల సారాంశం. బహుశా ప్రపంచంలో భారతదేశమంత సమ్మిళిత దేశం, హిందూమతమంత సమ్మిళిత మతం మరోటి లేదని చెప్పాలి. అందుకే వసుధైక కుటుంబం అన్న ప్రాచీన భారత సూత్రం ఆధునిక భారతానికి వచ్చేసరికి భిన్నత్వంలో ఏకత్వంగా అవతారమెత్తింది. దశావతారాలను గుర్తించి అర్థం చేసుకోగలిగిన సోకాల్డ్‌ మతాచార పాలకులు ఈ ఒక్క అవతారాన్ని గుర్తించలేకపోవటం ఆశ్చర్యం కలుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో మతోన్మాదుల చేతుల్లో ఊచకోతకు గురైన ఏ ఒక్కరికైనా లౌకిక భారతదేశ ద్వారాలు తెరిచే ఉండాలి. ఉంటాయి. ఈ దిశగా సవరించిన పౌరసత్వ చట్టాన్ని మరోసారి సవరిస్తే వచ్చే నష్టం లేదు. మరోసారి సవరించటం అంటే 2019 సవరించిన చట్టంలో ఉన్న మత ప్రాతిపదికను తొలగించటమే. ఇతర దేశాల్లో మతోన్మాదుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి మరో మతోన్మాద దేశం రక్షణ కల్పించలేదు. వర్తమాన చరిత్ర మనముందుంచిన చేదు నిజం ఇది. నిజంగా అటువంటి వారికందరికీ రక్షణ కల్పించాలన్న సంకల్పంతో ఈ చట్టాన్ని సమర్థించే వారంతా భారతదేశం ఆధిపత్య మతోన్మాద (హిందూత్వ) రాజ్యంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సవరించబడిన రూపంలో చట్టం అమలు జరిగితే తలెత్తే ప్రమాదం అర్థం కావాలంటే మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకోవాలి. మొదటిది నాజీ జర్మనీలో యూదులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిన క్రమం. రెండోది పొరుగున ఉన్న మయన్మార్‌ అనుభవం. మనతోనే ఉన్న అసోం అనుభవం. మొదటిది ప్రపంచాన్ని మార్చిన చరిత్ర. రెండోది సమీప చరిత్ర. మూడోది వర్తమానం. ఈ మూడు పరిణామాలు సగటు భారతీయుడికి ఆందోళన కలిగించేవే.

ఏటా నాగపూర్‌లో ఆరెస్సెస్‌ మంథన శిబిరాలు జరిగినట్టే జర్మనీ నగరం న్యూరెంబర్గ్‌లో నాజీలు మేధోమధన సమావేశాలు జరిగేవి. నాజీ పార్టీ అధికారానికి వచ్చాక పార్లమెంట్‌ సభ్యులు కూడా ఈ సమావేశాలకు హాజరవటం మొదలైంది. ఈ నమూనా నుంచే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆరెస్సెస్‌, సంఫ్‌ు పరివార్‌ సంస్థలతో సమన్వయం కోసం అడపాదడపా కేంద్ర మంత్రులు, ప్రధానితో సహా నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంతో మంతనాలు జరిపే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న యూదులందరినీ తొలగించటం ఈ న్యూరెంబర్గ్‌ చట్టాల్లో మొదటిది. యూదుల ఓటు హక్కు రద్దు చట్టం, యూదేతర జర్మన్లతో ప్రేమ పెండ్లిండ్లు చేసుకోరాదన్న చట్టం వంటి చట్టాలు ఆమోదించింది. కొంతకాలంగా భారతదేశంలో ఆరెస్సెస్‌ కనుసన్నల్లో సాగుతున్న లవ్‌ జీహాద్‌ ఉద్యమానికి స్ఫూర్తి ఈ న్యూరెంబర్గ్‌ చట్టమే. అంచెలంచెలుగా భారతీయ లౌకిక సమాజం నాజీయీకరణ చెందుతున్న పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి ఈ పోలికలు ఉపయోగపడ్తాయి. న్యూరెంబర్గ్‌ చట్టాల పర్యవసానంగా జర్మనీలోని యూదులు కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో, గ్యాస్‌ ఛాంబర్లలో శవాల గుట్టలుగా మారిన పరిణామం ఆధునిక జర్మనీ చరిత్రపై మాయనిమచ్చగా మిగిలిపోయింది. జర్మనీలో నాజీలు కాన్సంట్రేషన్‌ క్యాంపులు నిర్మిస్తే భారతదేశంలో బీజేపీ డిటెన్షన్‌ క్యాంపులు నిర్మిస్తోంది. తదనరంత పరిణామాల గురించి ఊహించుకోవటం పాఠకుల వంతు.

ఇప్పుడు సమీప చరిత్ర గురించి పరిశీలిద్దాం. మయన్మార్‌ 1937 వరకు బ్రిటిష్‌ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. మయన్మార్‌లో 1962 నుంచీ 1981 వరకు రెండు దశాబ్దాలు అధికారంలో ఉన్న సైనిక నియంత జనరల్‌ నీవిన్‌ సవరించిన పౌరసత్వ చట్టాలే 2016-2017లో ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన రోహింగ్యాల సంక్షోభానికి పునాదులు వేశాయి. ఈ అనుభవం ఓ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నీవిన్‌ పాలనలోనే మయన్మార్‌ రోహింగ్యాలను వెలివేసి దేశంలోని మిగిలిన 135జాతులూ తెగలను గుర్తించింది. నీవిన్‌ తర్వాత గద్దెనెక్కిన సాన్‌యు ఈ కార్యనిర్వాహక చర్యలన్నింటికీ చట్టం రూపం ఇచ్చారు. మయన్మార్‌లో 1823 పూర్వం నివసిస్తున్న వారికి మాత్రమే నిఖార్సయిన మయన్మార్‌ పౌరసత్వం ఖాయమవుతుంది. 1948 నాటి చట్టం ద్వారా పౌరసత్వం పొందిన వారు దేశంలో అనుబంధ పౌరులుగా మాత్రమే మిగులుతారు. పూర్తిస్థాయి పౌరులు కాబోరు. 1948కి పూర్వం నుంచీ మయన్మార్‌లో నిసిస్తూ 1982 తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పౌరులు మూడో రకం పౌరులుగా ఉంటారు. ఇక్కడ మూడు విషయాలు వ్యక్తమవుతున్నాయి. నిఖార్సయిన పౌరసత్వం కావాలంటే కనీసం ఐదారు తరాల నుంచీ ఈ దేశ వాసులమేనని, లేదా నేటితరం మునితాతలు జేజెమ్మలు 1824నాటికే మయన్మార్‌ పౌరులుగా ఉన్నారని నిరూపించుకోవాలి. రెండోశ్రేణి పౌరులుగా ఉండాలంటే కనీసం 1948నాటికి ఈ తరం పూర్వీకులు మయన్మార్‌లో పౌరులుగా ఉన్నట్టు ధృవీకరించుకోవాలి. కనీసం మూడోరకం పౌరులుగా ఉండాలన్నా యాభయ్యేండ్ల పాటు దేశంలో నివసిస్తూ పౌరులుగా గుర్తింపు పొందకుండా ఉండి ఉండాలి.

2008లో సవరించబడిన మయన్మార్‌ రాజ్యాంగం కూడా 1824నాటి 135 జాతులు, తెగలను అధికారిక మయన్మార్‌ పౌరులుగా గుర్తిస్తోంది. రోహింగ్యాలను వెలివేస్తోంది. మయన్మార్‌ దృష్టిలో వీరు బెంగాలీలు. 2015లో మయన్మార్‌ పాలకులు రోహింగ్యాలకు ఓటు హక్కు రద్దు చేశారు. మయన్మార్‌లో 2015 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు మోడీ-షా ద్వయం అమలుకు పూనుకుంటున్న ఎన్నార్సీ తరహాలో కూడా అక్కడ జాతీయ పౌరసత్వ తనిఖీ పథకాన్ని తెచ్చారు. ఈ పథకం ప్రకారం రోహింగ్యాలు తమను తాము ప్రత్యేక తెగగానో మతంగానో గుర్తించుకోరాదు. బెంగాలీలుగా మాత్రమే నమోదు చేసుకోవాలి. కొత్తగా మనదేశంలో సవరించిన పౌరసత్వ చట్టంలో విదేశాల నుంచి మన దేశంలోకి చొరబడేవారు తత్కాల్‌ స్కీమ్‌లో పౌరసత్వం పొందాలంటే తమ దేశాల్లో మతపరమైన ఊచకోతకు గురయ్యామని అప్లికేషన్‌లో రాస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తున్నట్టుగా అన్నమాట. ఎలాగైతేనేం పౌరసత్వం ఉందిగా అంటూ మొండిగా వాదించే భక్తులుకూడా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని ప్రభుత్వం వాదిస్తున్నట్టుగానే. కానీ మయన్మార్‌లో గత నాలుగేండ్లల్లో జరిగిన దారుణాలు మానవజాతి చరిత్రలో మరో జర్మనీని తలపించేవిగా ఉన్నాయన్న వాస్తవాన్ని ఇటువంటి వాదనవీరులు విస్మరిస్తున్నారు. శాంతికి మారుపేరుగా ఉన్న బౌద్ధం మయన్మార్‌లో రోహింగ్యాలపై మారణకాండకు పురికొల్పే మతంగా మారింది. బౌద్ధులందరిలోనూ ఇస్లాం పట్ల ద్వేషం క్రమంగా తాచుపాము విషంలా వ్యాపించింది. ఇక్కడే మరో విషయాన్ని చెప్పుకోవాలి. సెల్‌ ఫోన్ల ఖరీదు, ఇంటర్నెట్‌ సేవల ఖరీదు గణనీయంగా పడిపోవటం, ప్రతి చేతికి సెల్‌ ఫోన్‌ రావటంతో సామాజిక మాధ్యమాలు మయన్మార్‌లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా బౌద్ధుల్లో ద్వేషాన్ని పెంపొందించటంలో కీలకపాత్ర పోషించాయని ఐక్యరాజ్యసమితి నియమించిన మానవ హక్కుల కమిషన్‌ గుర్తించింది. మన దేశంలో జరుగుతున్న పరిణామాలతో చాలా పోలికలు కనిపిస్తున్నాయి కదూ…
ఇదే పరిణామాలు మన దేశంలో ఎలాంటి రూపం తీసుకోనున్నాయి? భారతదేశంలో 40శాతం ఆర్థిక సామాజిక రాజకీయ వెలికి గురైన జనాభా ఉన్నారు. 8కోట్లమంది ఆదివాసీలు. 28శాతం జనాభా దళితులు, సన్నకారు రైతులు, వలసకూలీలు, అసంఘటితరంగ కార్మికులు. అసంఘటితరంగంలో పనిచేసే వారిలో మూడున్నర కోట్లమంది ముస్లింలు ఉన్నారు. అసోంలో జాతీయ పౌర రిజిష్టర్‌ తయారీకి వంశవృక్షం ప్రాతిపదికగా తీసుకున్నారు. కొంతమందికైతే వలసపాలన నాటి నుంచీ పత్రాలు ఉన్నప్పటికీ ఈ రిజిష్టర్‌లో స్థానం దక్కలేదు. మరి ఇటువంటి బడుగు బలహీన బహుజనులు మూడుతరాల వెనకటి పత్రాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి? దేశంలో మెజారిటీ దళిత ఆదివాసీ కుటుంబాలకు విద్య అందుబాటులోకి వచ్చిందే ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో. సామాజికంగా వెనకబడిన వర్గాలు, తరగతులు 21రకాల ధృవీకరణ పత్రాలు సేకరించటం, భద్రపర్చుకోవటం, జాతీయ జనాభా నమోదు అధికారికి సమర్పించుకోవటం సాధ్యమయ్యేదేనా? అలా లేని వారంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సిందేనా? ఆరెస్సెస్‌ మౌలిక లక్ష్యం హిందూయేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చటం. వారికున్న పౌర హక్కులను రద్దు చేయటం. జర్మనీ, మయన్మార్‌ అనుభవాలకు ఆరెస్సెస్‌ లక్ష్యాలకు తేడా ఏముంది? ఇప్పటి వరకు ఎన్నార్సీ అమలు చేస్తామని చెప్తోంది తప్ప విధి విధానాలు రూపొందించలేదు. కట్టుదిట్టమైన చట్టాలనే గంగలో కలిపిన చరిత్ర సంఫ్‌ుపరివారానిది. మరి పూర్తి విచక్షణకు అవకాశం ఉంటే పరిస్థితి ఇంకెంత ఘోరంగా మారబోతోంది? ఈ ప్రశ్నలే లక్షలాదిమంది యువతను వీధుల్లోకి తెచ్చాయి. ఓ ప్రజలారా.. పారాహుషార్‌ !

(Courtesy Nava Telangana)