కేంద్ర విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే గిరిజన విశ్వ విద్యాలయానికి రోహిత్‌ వేముల పేరు పెట్టాలని రాజ్యసభలో సిపిఐ(ఎం) ఎంపీ కోరారు. కేేంద్ర విశ్వ విద్యాలయ (సవరణ) బిల్లుపై మంగళవారం జరిగిన చర్చలో కేరళకు చెందిన మార్క్సిస్టు పార్టీ ఎంపి కె.కె.రాగేష్‌ పాల్గొంటూ ఈ ప్రతిపాదన చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో దళిత రిసెర్చి స్కాలర్‌ రోహిత్‌ వేముల దళితులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటంలో 2016 జనవరి17న ప్రాణ త్యాగం చేశారు. కావున గిరిజన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఎంతైనా సముచితమని రాగేష్‌ చెప్పారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దేశంలోని ఒక్క యూనివర్సిటీ కూడా చోటు సంపాదించలేకపోయిందని, నాణ్యమైన విద్యను పెంపొందించడంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. 8వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధ్యాపక సిబ్బందిలో 40 శాతం దాకా తాత్కాలికంగా నియమితులైనవారేనని ఆయన తెలిపారు. ఉన్నత విద్యకు ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించేసిందని రాగేష్‌ చెప్పారు. కేరళ సిపిఐ రాజ్యసభ సభ్యులు వినరు విశ్వం కూడా గిరిజన యూనివర్సిటీకి రోహిత్‌ వేముల పేరు పెట్టాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. తెలుగుదేశం ఎంపి కె.రవీంద్ర కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కానీ, శాశ్విత సిబ్బంది కానీ, విద్యార్థులు కానీ లేకుండానే నడుస్తోందని వ్యంగ్యంగా అన్నారు. డిఎంకె సభ్యులు తిరుచ్చి శివ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. తగినంతమంది టీచర్లను పెట్టకపోవడం వల్ల మనం ఉత్పత్తి చేసే గ్రాడ్యుయేట్లు పేపర్‌ గ్రాడ్యుయేట్లగా మిగిలిపోతున్నారని అన్నారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, యూనివర్సిటీ ఏమి ఆలోచించాలో ప్రభుత్వం శాసిస్తున్నదని, తద్వారా విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని హరించి వేస్తోందని విమర్శించారు. దీనివల్ల గొప్పగొప్ప మేధావులంతా బోధనకు ఇతర దేశాలకు తరలిపోతున్నారని ఆయన అన్నారు. విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవాలంటే దేశంలో విద్వేషం, అసహనపూరిత వాతావరణానికి స్వస్తి పలకాలన్నారు. దీనిపై అభ్యంతరాలను ప్రభుత్వం తిరస్కరించి ఆమోదానికి పెట్టింది. దీనికి సభ ఆమోదం తెలిపింది.

(ప్రజాశక్తి సౌజన్యంతో…)