నల్లమలలో తగ్గిన శాకాహార జంతువులు

పులులకు ఆహారం కొరత
ఎన్జీవోలతో కలిసి అటవీశాఖ అధ్యయనం

పులి... ఏం తినాలి?

ఉల్లిపాయల ధర పెరిగితే అల్లాడిపోతున్నాం… ఎన్నో కూరగాయలున్నా…  ఉల్లి లేకుంటే మనకు ముద్ద దిగదు. దేశవ్యాప్తంగా ‘ఉల్లి లొల్లి’ అంతా ఇంతా కాదు… ఒకోసారి టమాటాల ధర పెరిగినా ఇంతే బాధపడిపోతుంటాం. దొరికిన కూరగాయలతో సర్దుకుపోలేం. నోరున్న జీవులం కనుక గళమెత్తి ప్రశ్నిస్తున్నాం. మరి  జంతువులకు ఆహారం దొరక్కపోతే ఏం చేస్తాయి? శాకాహార జంతువులైతే… ఆకులో అలములో తిని బతుకుతాయి. కానీ మాంసాహార మృగాల సంగతేంటి? తమ కంటే చిన్నవైన జంతువులే వాటికి ఆహారం. ఆధారం. అలాంటి జంతువులు అందుబాటులో లేకపోతే…?నల్లమలలో ఇప్పుడదే పరిస్థితి ఎదురవుతోంది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో శాకాహార జంతువులు గణనీయంగా తగ్గిపోతున్నాయట. అవే ఆహారంగా బతికే పెద్దపులుల సంగతేంటి? శాకాహారం తినలేని వ్యాఘ్ర రాజాలు ఎలా బతకాలి?

హైదరాబాద్‌ : అందాల నల్లమలలో అమ్రాబాద్‌ అడవి ఒక భాగం… దేశంలోని పులుల అభయారణ్యాల్లో ఒకటి. వన్యప్రాణులకూ ఆవాసం. ఇతర రాష్ట్రాల్లోని తడోబా, బండిపూర్‌, రణ్‌తంబోర్‌, పెంచ్‌, మెల్ఘాట్‌ పెద్దపులుల అభయారణ్యాలు, గిర్‌ నేషనల్‌ పార్కుతో పోలిస్తే అమ్రాబాద్‌లో పెద్దపులులు, శాకాహార జంతువుల సంఖ్య కూడా తక్కువే. దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత ఇక్కడ పులి సంతానం నమోదైంది. ఇటీవల రెండు పులి కూనలు ఫరహాబాద్‌ ప్రాంతంలో సంచరించాయి. పులుల సంతానోత్పత్తికి ఈ ప్రాంతం అనువుగా లేదన్న సందేహాలున్నాయి.

ఇదీ కారణం…
పెద్దపులుల ఆకలి తీరాలంటే శాకాహార జంతువుల సంఖ్య సమృద్ధిగా ఉండాలి. అమ్రాబాద్‌ అడవిలో గత మూడేళ్లుగా వీటి సంఖ్య అటూఇటూగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కొన్ని జంతువుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మరికొన్ని తగ్గాయి. ముఖ్యంగా చుక్కలదుప్పుల సంఖ్య భారీగా క్షీణించింది. అవి నీరు, గ్రాసం కోసం నాగార్జునసాగర్‌ వైపు, నల్లమలలో ఏపీవైపు వలస వెళ్లడం, పోడు వ్యవసాయం కోసం కొల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో అడవులను నరికివేయడం, స్థానికంగా పలువురు ఆ జంతువులను వేటాడడం వంటివి వాటి సంఖ్య తగ్గడానికి కారణాలు కావచ్చని అంచనా. ఈ జంతువులు తగ్గుతుండడంతో సుమారు 20 వరకు ఉన్న పెద్దపులులు, 100కి పైగా ఉన్న చిరుతపులులకు ఆహారం కొరత ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశువులను మేపేందుకు జనసంచారం పెరిగినా… పెద్దపులులు పసిగట్టి ఆ ఛాయలకు రావని చెబుతున్నారు.


ఎవరు తేల్చారు?:  వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీలతో కలిసి అటవీశాఖ 2019 ఫిబ్రవరి-మే మధ్య అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో శాకాహార జంతువులను లెక్కపెట్టింది. ప్రత్యక్షంగా చూసి కొన్ని, కెమెరాల్లో చిత్రీకరణ ద్వారా మరికొన్నింటిని గణించారు. చ.కి.మీ. యూనిట్‌గా తీసుకుని అంచనా వేయగా, పలు రకాల జింకలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, కొండముచ్చులు తదితర తొమ్మిది రకాల శాకాహార జంతువులను గుర్తించారు. అగ్నిప్రమాదాలను నివారించి, మేతకు పశువులను రానీయకుండా నివారిస్తే పెద్దపులులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ డైరెక్టర్‌ ఇమ్రాన్‌ సిద్దిఖి పేర్కొన్నారు.


మళ్లీ లెక్కిస్తారట! : ఇతరప్రాంతాల కంటే అమ్రాబాద్‌లో వేట తక్కువగా ఉంటుందని అటవీశాఖాధికారులు అంటున్నారు. శాకాహార జంతువులను సరిగా అంచనా వేయకపోయి ఉండవచ్చని, మరోసారి అధ్యయనం చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. 90 రోజులపాటు 3 బ్లాకుల్లో గణన చేపడుతున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.

పులి... ఏం తినాలి?

Courtesy Eenadu…