రోడ్డు ప్రమాదంలో.. నయీం మేనకోడలి మృతి
 నల్లగొండ జిల్లాలో ఘటన
నయీం నేర సామ్రాజ్యానికి షాహిదాయే వారసురాలు
ఆమె పేరుతో వందల కోట్ల ఆస్తులు
ప్రమాదంపై అనుమానాలు!

నల్లగొండ క్రైం/ యాదాద్రి : గ్యాంగ్‌స్టర్‌ నయీం మేనకోడలు, అతడి నేర సామ్రాజ్యానికి వారసురాలు షాహెదా సాజిద్‌ (32) ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఆమె అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నల్లగొండ టూటౌన్‌ ఎస్సై నర్సింహులు కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన షాహెదా సాజిద్‌.. తన భర్త ఫహీం, ఇద్దరు కుమార్తెలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆమె నల్లగొండకు వచ్చింది. ఆ తర్వాత తన బాబాయి కారు తీసుకుని, ఒంటరిగా మిర్యాలగూడకు బయలుదేరింది.

నల్లగొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి సమీపంలో.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందింది. కారు ముందుభాగం నుంచి సగం వరకు నుజ్జునుజ్జయ్యింది. ఆమె కారు స్పీడోమీటర్‌ 120 కిలోమీటర్ల వద్ద ఆగిపోవడాన్ని బట్టి.. ఆమె అతివేగంగా కారు నడిపిందని తెలుస్తోంది. కాగా.. షాహెదా, ఆమె భర్త ఫహీంపై గ్యాంగ్‌స్టర్‌ నయీంకు సంబంధించిన కేసులు ఉన్నాయి. షాహెదా పేరిట రూ. వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. కాగా.. షాహెదాపై భూఆక్రమణలు, బలవంతపు వసూళ్ల కేసులున్నాయి. నయీం తరఫున బెదిరింపుల్లో ఈమె ప్రధాన భూమిక పోషించేదని పోలీసులు చెబుతున్నారు. ఆమెపై భువనగిరి పట్టణంలో రెండు భూకబ్జా కేసులు, గజ్వేల్‌లో జంటహత్యల కేసు ఉన్నాయి. షాహెదా మైనర్‌గా ఉన్నప్పటినుంచే నయీం గ్యాంగ్‌లో కీలక సభ్యురాలిగా పనిచేసేది. కాగా.. షాహెదా రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రోడ్డు ప్రమాదంలోనే మరణించిందా? లేక ఎవరైనా ప్రమాదానికి కారణమయ్యారా? ఆమె మిర్యాలగూడకు ఒంటరిగా.. తానే కారు నడుపుకొంటూ ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

(Courtesy Andhrajyothi)