ఎస్సీ, ఎస్టీల కంటే వెనకే..!

– ఇతర మతాలతో పోల్చుకున్నా తక్కువే
– అన్ని వర్గాల మహిళది ఇదే పరిస్థితి
– ఎన్‌ఎస్‌ఓ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటు విషయంలో ముస్లింలు వెనకబడిపోయారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా లేదా వారి కంటే తక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉన్నారు. అలాగే దేశంలోని ఇతర మతాలతో పోల్చి చూసుకున్నా.. ఈ విషయంలో వెనకబడే ఉన్నారు. ఈ విషయాన్ని ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ)’ తన నివేదికల్లో వెల్లడించింది. ఇందులో కొన్ని ఆసక్తికర, ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. ఎప్పటిలాగే ప్రతి మతంలోనూ, సామాజిక గ్రూపుల్లోనూ మహిళల అక్షరాస్యత రేటు.. పురుషులతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నది. ఈ నివేదికలో మతాలు, సామాజిక గ్రూపులవారీగా పురుషులు, మహిళల్లో అక్షరాస్యత రేటును పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఓ నివేదిక ప్రకారం.. దేశంలోని కొన్ని మతాలతో పోల్చుకుంటే ముస్లింలు అక్షరాస్యతలో వెనకబడిపోయారు. ఈ విషయంలో క్రైస్తవులు ముందుస్థానంలో ఉండగా, సిక్కులు, హిందువులు తర్వాతి వరుసలో ఉన్నారు. క్రైస్తవ పురుషుల్లో అక్షరాస్యత రేటు 88శాతంగా, మహిళల్లో 82శాతంగా ఉన్నది. ముస్లింలలో 80.6శాతం మంది పురుషులు అక్షరాస్యతను కలిగి ఉన్నారు. ఇది దళితుల అక్షరాస్యత రేటుకు దాదాపు సమానం కాగా, ఎస్టీలతో పోల్చుకుంటే కాస్త అధికంగా ఉన్నది. ఇక ముస్లిం మహిళల్లో అక్షరాస్యత రేటు (69శాతం) ఎస్సీ, ఎస్టీలతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇతర మతాలతో పోల్చుకుంటే వెనకబడిపోయారు. ప్రాథమిక స్థాయి విద్యలో స్థూల హాజరు నిష్పత్తి.. ‘ఇతరులు’, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్ల కంటే ముస్లింలది తక్కువగా ఉన్నది. ఇక అధికారిక విద్యా కార్యక్రమాల్లో ఎప్పటికీ పేరు నమోదు కాని యువత సంఖ్య(3 నుంచి 35 ఏండ్ల మధ్య) మైనార్టీ వర్గం నుంచే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీయేతర కులాలకు చెందిన వారిలో(ఏడు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పైబడినవారిలో) అక్షరాస్యత రేటు పురుషుల్లో 91శాతం, మహిళల్లో 81 శాతంగా ఉన్నది. ఇక ఓబీసీల విషయానికి వస్తే అక్షరాస్యతా రేటు తగ్గిపోవడం గమనార్హం. వీరిలో పురుషుల్లో 84శాతం, మహిళల్లో 69 శాతం అక్షరాస్యత రేటు ఉన్నది. ఇక ఎస్సీల్లో పురుషులు 80.3 శాతం, మహిళలు 64 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. ఎస్టీలలో అక్షరాస్యత రేటు పురుషులు 78శాతం, మహిళలు 61శాతం మంది గా ఉన్నారు.

సూచిక ఎస్టీ ఎస్సీ ముస్లిం
పురుషుల అక్షరాస్యత(శాతం) 77 80 81
మహిళలు అక్షరాస్యత 61 64 69
స్థూల హాజరు నిష్పత్తి
ప్రైమరీ 101 102 100
అప్పర్‌ ప్రైమరీ 90 94 89
సెకండరీ 80 86 72
హయ్యర్‌ సెకండరీ 53 60 48
విద్యా సంబంధ అంశాల్లో పేరు నమోదుకానివారు
(3 నుంచి 35 ఏండ్ల మధ్య)
పురుషులు 15 13 17
మహిళలు 22 20 22

Courtesy Nava telangana