పాట్నా : బీజేపీ పాలిత రాష్ట్రాలో రోజురో జూకు ముస్లింలపై, దళితులపై మూకదాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా యూపీలోని అలీగఢ్‌ రైల్వేస్టేషన్‌లో ముస్లిం కుటుంబంపై మూకదాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీగఢ్‌కు చెందిన అఫ్సానా బేగం, తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నా నుంచి ఆలీగఢ్‌కు రైలులో ప్రయాణిస్తున్నారు. అలీగఢ్‌ రైల్వేస్టేషన్‌లో దిగుతున్న క్రమంలో.. కొందరు దుండగులు రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే వారిరువురి మధ్య వివాదం తలెత్తడంతో అఫ్సానా బేగం కుటుంబసభ్యులపై దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆరుగురు గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారిని సమీపంలో జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీకి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ దాడిని నిరసిస్తూ.. అలీగఢ్‌ యూనివర్సిటీ విద్యార్థులు పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన ప్రదర్శలు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యశ్‌పాల్‌ సింగ్‌ వారికి హామీ ఇవ్వడంతో నిరసనలను విరమించారు.

(Courtesy Nava Telangana)