• బీహెచ్‌యూలో విద్యార్థుల నిరసన
  • అజ్ఞాతంలోకి అధ్యాపకుడు

న్యూఢిల్లీ: ఫిరోజ్‌ ఖాన్‌. రెండో తరగతి నుంచే సంస్కృతం చదువుకున్నారు. డిగ్రీ, బీఈడీ, పీజీ కూడా సంస్కృత మాధ్యమంలోనే. ఆ భాష మీదే పీహెచ్‌డీ చేశారు. నెట్‌, జేఆర్‌ఎ్‌ఫలో ఉత్తీర్ణులయ్యారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ సంస్కృత విద్యాధర్మ పీఠంలో రెండు వారాల క్రితం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఇన్నాళ్లుగా ఆయనకు తాను ముస్లిమునని గుర్తుకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా బీహెచ్‌యూలో కొందరు విద్యార్థులు మతాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ ముస్లిం చెప్పే సంస్కృత పాఠాలు వినబోమంటూ గత సోమవారం వైస్‌ చాన్స్‌లర్‌ ఇంటి బయట హోమగుండం ఏర్పాటు చేసి, ధర్నా నిర్వహించారు. భారతీయ సంస్కృతితో మమేకం కాని వ్యక్తి తమకు సంస్కృతం ఎలా చెబుతారంటూ నిలదీశారు. ఈ చర్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఫిరోజ్‌ఖాన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఇతర విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు ఆయనకు మద్దతుగా నిలిచారు.

Courtesy AndhraJyothy..