బులంద్‌షహర్‌: మానవత్వం పరిమళించిన అరుదైన ఉదాత్త సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగులోకి వచ్చింది. హిందూ మతస్థుడి అంత్యక్రియలకు ముస్లిం సోదరులు చేయూత అందించి మానవత్వాన్ని చాటారు. ఆపత్కాలంలో మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేద హిందూ కుటుంబానికి ముస్లింలు బాసటగా నిలిచారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తామున్నమంటూ ముందుకు వచ్చారు.

మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన బులంద్‌షెహర్‌లోని మౌలానా ఆనంద్‌ విహార్‌లో వెలుగు చూసింది. రవిశంకర్‌ అనే వ్యక్తి క్యాన్సర్‌ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరోనా భయం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం అవస్థను చూసిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్‌ అంత్యక్రియల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో ‘రామ్‌ నామ్‌ సత్య హై’ అంటూ వారు నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటిచెప్పారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దగ్గరవాళ్లు రాలేకపోయారని, ముస్లిం సోదరుల అండతో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించామని రవిశంకర్‌ కుమారుడు వెల్లడించారు. కరోనా మహమ్మారి విరుచుకుపోతున్న వేళ మునుపెన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బులంద్‌షెహర్‌లోని ముస్లింలు చూపిన మానవత్వం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచింది.