మోటారు వాహన చట్టానికి మోదీ సర్కారు మార్పులు చేసింది. ఆర్టీసీలకు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు కట్టబెట్టింది. ఆర్టీసీకి పోటీదార్లను సృష్టించడం ద్వారా రూట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో రాష్ట్రాలకు అధికారాన్ని కేంద్రం అప్పగించింది. ప్రైవేటుపరం చేయాలని కూడా కేంద్రమే చెప్పింది  -ముఖ్యమంత్రి కేసీఆర్‌

కేంద్రం చేసిన చట్టాలన్నీ ఇక్కడ అమలు చేస్తున్నారా? మోటారు వాహన చట్టం ఎందుకు అమలు చేయలేదు? అందులోని ఆర్టీసీ పార్ట్‌ మాత్రమే ఎందుకు ఎన్నుకుంటున్నారు. మోటార్‌ వాహన చట్టంలో ఎక్కడా కార్మికులను తొలగించాలని కేంద్రం చెప్పినట్లు లేదే. కార్మికులను సస్పెండ్‌ చేయాలని ఏ చట్టంలో ఉంది? – ఆర్టీసీ నిపుణులు

  • ఎంవీ చట్టంలో సవరణలపై రాష్ట్రాల గగ్గోలు
  • నిబంధనల అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టిన కేంద్రం

హైదరాబాద్‌: కేంద్రం చట్టం మేరకే ఆర్టీసీని ప్రయివేటీకరిస్తున్నామని సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనలపై విమర్శలు వస్తున్నాయి. చట్టాన్ని మార్చుకొనే వెసులుబాటు కేంద్రమే ఇచ్చినప్పటికీ దాని జోలికిపోకుండా నిర్ణయాలు తీసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రవాణా సేవలందిస్తున్న ఆర్టీసీని క్రమేణా ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ చట్టం సాకుగా ప్రజా రవాణా వ్యవస్థలోకి ప్రైవేటు ఆపరేటర్లను జొప్పించే ప్రయత్నాలు పెరగనున్నాయి.

ఒక్కో రాష్ట్రంలో రవాణా ఒక్కో విధంగా ఉంది! అందుకే, మోటారు వాహన చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేయగానే వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి! దాంతో, నిబంధనలను రూపొందించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకే కేంద్రం కట్టబెట్టింది! ప్రమాదాల నివారణ; ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మోటారు వాహన చట్టంలో కేంద్రం చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. అందుకే, కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి. మరికొన్ని అమలు చేయట్లేదు. తెలంగాణలో కూడా ఈ కఠిన నిబంధనలను అమలు చేయడం లేదు. కానీ, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, ఆల్‌ ఇండియా పర్మిట్లకు సంబంధించి కేంద్ర చట్టాన్నే అమలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ప్రైవేటుపరం ఇలా..!
నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1950లో మోటార్‌ వెహికిల్‌ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ర్టాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని ఆ చట్టంలో స్పష్టం చేశారు. కేంద్ర చట్టం ప్రకారం దేశంలోని రూట్లను జాతీయం చేశారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం టీఎ్‌సఆర్టీసీ ఆధ్వర్యంలో 3,726 రూట్లు ఉన్నాయి. ఈ రూట్లపై ఆర్టీసీదే గుత్తాధిపత్యం. వీటిలో ప్రజా రవాణా సంస్థలే బస్సులు నడపాలి. ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడపడానికి నిబంధనలు ఒప్పుకోవు. వాటికి రాష్ట్రాల రవాణా శాఖలు పర్మిట్లు ఇవ్వవు. ప్రైవేటు వాహనాలకు ‘కాంట్రాక్టు క్యారేజీ’లుగా పర్మిట్లు ఇస్తారు. తప్పితే, ‘స్టేజీ క్యారేజీ’లుగా ఇవ్వరు. కానీ, కేంద్ర చట్టంలోని సెక్షన్‌3లో మోదీ సర్కారు ఇటీవల సవరణలు చేసింది. కొత్తగా సెక్షన్‌ 67ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం,

ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకూ పర్మిట్లు ఇవ్వవచ్చని సవరించింది. దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టాయి. దాంతో, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించారు.

దీనిని ఆసరా చేసుకునే 20 శాతం ప్రైవేటు బస్సులు ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. అంటే.. ఈ 20 శాతం రూట్లలో ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిట్లు ఇస్తారు. అప్పుడు ప్రైవేటు ఆపరేటర్లు తమ ఇష్టానుసారం రేట్లను నిర్ణయించుకోవచ్చు. 3,726 రూట్లలో 745 రూట్లు ప్రైవేటు ఆపరేటర్ల చేతుల్లోకి వెళతాయి. ఇలాగే సాగితే భవిష్యత్తులో ఆర్టీసీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్రం చట్టం చేసినా నిబంధనలు రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టిందని, కానీ, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆల్‌ ఇండియా పర్మిట్లతో భారం
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ప్రైవేటు ఆపరేటర్ల్లు తమ బస్సులకు ‘ఆల్‌ ఇండియా పర్మిట్లు’ పొంది ఇతర రాష్ట్రాలకు బస్సులను నడుపుకొంటారు. ప్రస్తుతం ఆర్టీసీ పొరుగు రాష్ట్రాలకు నడిపే బస్సుల విషయంలో ఆయా రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. వీటివల్లే ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఒప్పందాలకు తావుండదు. అవి కూడా కేంద్రం నుంచి ‘ఆల్‌ ఇండియా పర్మిట్లు’ పొందాల్సి ఉంటుంది. ఇందుకు సూపర్‌ లగ్జరీ బస్సుకు రూ.50 వేలు, డీలక్స్‌కు రూ.75 వేలు, ఏసీ బస్సుకు రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లించాలి. ఇది ఆర్టీసీకి భారమే. కానీ, ప్రైవేటు ఆపరేటర్లు ఈ ఫీజులు చెల్లించినా.. బస్సు చార్జీలు పెంచేస్తారు. దీంతో, ప్రయాణికులకు మరింత భారం పడుతుంది. ఇక, ఆర్టీసీకి మరో ప్రమాదం పొంచి ఉంది. కొత్త చట్టం 16 సీట్ల వరకు స్టేజీ క్యారేజీ అవకాశాలు కల్పించబోతోంది. నేరుగా బస్‌ షెల్టర్లు, బస్డాండుల్లోనే నిలిపి ఇవి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. ఇది ఆర్టీసీని మరింత దెబ్బ తీయనుంది.

Courtesy Andhra Jyothy