అనుపమ తేజ్‌.. పని చేస్తున్న చోట కొన్ని సమస్యలను కళ్ళారా చూసింది. తల్లి తమ కోసం ఎలా పోరాడిందో గుర్తు చేసుకుంది. తన కోసం, సోదరి కోసం తల్లి పడిన కష్టం ఆమెను కలచి వేసింది. ఈ సమాజంలో చాలా మంది తల్లులు ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినా కూడా తమ పిల్లల కోసం, కుటుంబం కోసం పోరాడుతూనే వున్నారు. ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె చూసిన ఘటనలను, అనుభవాలను ది యాషెస్‌ షీ రోజ్‌పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలే నేటి మానవిలో…

పిల్లలపెంపకం, సంరక్షణ గురించి అధ్యయనం చేసే ఓ సంస్థ టినీ స్టెప్‌. దీనికి సీఓఓగా పని చేస్తుంది ఇరవై ఆరేండ్ల అనుపమా తేజ్‌. గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డ పుట్టిన తర్వాత తల్లుల మానసిక పరిస్థితి ఎలా వుంది అనే అంశంపై ఈ సంస్థ ఓ అధ్యయనం చేసింది. తమ విసృతమైన సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వారం రోజుల్లోనే రెండు కోట్ల యాభై లక్షల మంది తల్లుల దగ్గర నుండి సమాచారాన్ని సేకరించారు.

ఉత్తేజమైన అనుభవాలు

ఐదుగురు తల్లుల జీవితాలను ఈ పుస్తకంలో ప్రచురించారు అనుపమ. ”వీరిని కలిసిన సందర్భంలో మహిళల జీవితాల మధ్య ఎన్నో సమాంతరాలను చూశాను. వారి ఉత్తేజమైన అనుభవాలనే పుస్తకంలో పొందుపరిచాను. ఈ తల్లులు సరైన మార్గంలో ఉన్నారు. వారు ఇలాగే ముందుకు సాగితే తమ లక్ష్యాలను సాధిస్తారు” అంటున్నది అనుపమ. ఈ సందర్భంగా ఆమె మరెన్నో విషయాలను ఇలా పంచుకున్నారు.

లక్ష్యాలను చేరుకోలేక

ఈ పుస్తకం రాయడానికి నన్ను ప్రేరేపించింది నా తల్లి జీవితం. టినీ స్టెప్‌లో పనిచేస్తున్న క్రమంలో వేలాది మంది తల్లులు ఇలాంటి పోరాటాన్నే చేయడం గమనించాను. ముఖ్యంగా పెండ్లి తర్వాత ఆశలను చంపుకొని జీవిస్తున్నారు. వీరిలో కొందరికి స్వతంత్య్రం లేదు. మరికొందరు సంప్రదాయాల మధ్య నలిగిపోతున్నారు. ఇంకొందరు సమాజిక ఒత్తిడితో కుంగిపోతున్నారు. ఫలితంగా వారు తమ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఇటువంటి సవాళ్లను ఎవరైతే ఎదుర్కొన్ని విజయాలను సాధించారో వారి గురించి ప్రపంచానికి తెలియజేయాలి. ఇలాంటి మహిళలు మరెందరో సమాజంలో వున్నారు. మీరంతా ఒంటరిగా లేరు. మీలాగే మరెందరో తల్లులు ఇలాంటి పోరాటాలు చేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టాలను ఛేదించాలి, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని ప్రచురించాను. ప్రతి మహిళా తన ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యంగా అడుగులు వేయాలని చెప్పదలచాను.

ఇతర మహిళలకు భరోసా…

అధ్యయనానికి పురుషాధిక్యత వేళ్ళూనుకున్న సంస్థలనే ఎంచుకున్నాను. ఉదాహరణకు నందిని సర్కార్‌ వైమానిక పరిశ్రమైన బోయింగ్‌ కంపెనీలో నాయకత్వం వహిస్తున్నారు. రియా ప్రాష్‌ ఆల్కహాల్‌ బ్రాండ్‌ అయినా సులా వైన్యార్డ్స్‌లో పీపుల్‌ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇలా అందరూ పురుషాధిక్యత రాజ్యమేలుతున్న సంస్థల్లో ప్రధాన బాధ్యతల్లో వున్నారు. ముఖ్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆఫీసుకు వెళ్ళడం, పరుషాధిక్యత రంగాలలో పనిచేయడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. వీటిని వాళ్ళు ఎలా ఛేదించగలిగారు అనేది ఈ ప్రపంచానికి తెలియజేడమే ఈ నా పుస్తక లక్ష్యం. దీని ద్వారా ఇతర మహిళలకు భరోసా ఇవ్వదల్చుకున్నాను.

సమస్యల్లో తేడా లేదు

ఈ పుస్తకం కోసం పని మొదలుపెట్టినప్పుడు వివిధ రంగాలలో, విభిన్న బాధ్యతల్లో వున్న మహిళల జీవితాలను అధ్యయనం చేశాను. ఆయా కంపెనీల్లో ఉన్న పురుషులతో కూడా మాట్లాడాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అధ్యయనం ద్వారా గొప్ప నాయకురాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. ఎంతో నేర్చుకున్నాను. వారి జీవితాలు విని స్ఫూర్తి పొందాను. టినిస్టెప్‌లో నేను గమనించిన తల్లుల సమస్యలకు వీరి జీవితాలకు ఎలాంటి తేడా లేదు. వాళ్ళ గురించి వింటున్నప్పుడు మా అమ్మ జీవితమే గుర్తుకొచ్చింది.

ఊహకు అందని సవాళ్లు

ఈ ఐదుగురిలో నయనా ఉడుపి జీవితం రాయడం చాలా కష్టంగా అనిపించింది. బాధాకరమైన జీవితం ఆమెది. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్‌. కుటుంబం నుండి, సమాజం నుండి వెలివేయబడింది. చిన్నతనం నుండి రోడ్డుమీద అడుక్కుంటూ జీవితాన్ని కొనసాగించింది. అయినా ఏదో సాధించాలని కలలుకనేది. ఓ కార్పొరేట్‌ కంపెనీలో పని చేయాలనేది ఆమె లక్ష్యం. ఎలాంటి ఇబ్బందులు ఆమెను ఆపలేదు. కంపెనీలో చేరడానికి అవసరమైన సామర్థ్యాన్ని సంపాదించుకుంది. చివరకు థాట్‌ వర్క్సో కంపెనీకి మార్కెటింగ్‌ మేనేజర్‌ అయ్యింది. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మన ఊహకు కూడా అందవు.

ఉత్తేజకరమైన జీవితం

మాలికా సదాని ప్రయాణం చాలా ఉత్తేజకరమైంది. అప్పుడే తల్లి అయిన ఆమె తన కూతురికి ఓ ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. సాధారంగా ప్రతి తల్లీ ఇలాగే ఆలోచిస్తుంది. అయితే ఆమె తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇటు కుటుంబాన్ని అటు వృత్తిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఒక మహిళ నాయకురాలిగా ఎదగడం చాలా కష్టం. ఎదిగినా అందులో కొనసాగడం మరీ కష్టం. అలా కొనసాగడానికి ఆమె ఎంతో పోరాటం చేశారు. అలాగే ఎలాంటి సహకారం లేని మాధవీ ఇరానీ మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటిని, ఆఫీసును నిర్వహించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాలే ఆమెను మరింత శక్తివంతంగా మార్చాయి. ”జీవితం చాలా కఠినమైనది. అయితే నేను అంతకంటే కఠినం. సవాళ్లు, ఆటుపోట్లు, మంచీచెడు జీవితంలో కచ్చితంగా ఎదురవుతాయి. మీరు మీ జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడు మీరు సాధించిన విజయాలతో వెలిగిపోవాలి. అప్పుడు ఈ కష్టాలన్నీ లెక్కలోకి రావు. ఏదీ మిమ్మల్ని వెనక్కి లాగలేదు. ఎదురైనా సమస్యలను దులుపుకుని ముందుకు వెళ్ళాలి” అంటారు ఆమె.

అమ్మ స్ఫూర్తితోనే…
19 ఏండ్లకే మా అమ్మకు పెండ్లి జరిగింది. అప్పుడు ఆమెకు చదువు, ఆర్థిక స్థిరత్వం లేవు. దీనివల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. నన్నూ, నా సోదరిని పెంచేందుకు ఒంటరిగా ఎంతో కష్ట పడింది. అందుకే అమ్మ మా పెండ్లికన్నా చదువుకే ఎక్కువ ప్రాధా న్యంఇచ్చింది. ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాతే పెండ్లి చేయాల నుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ మాకు మా అమ్మనే. మా ఇద్దరి కోసం ఎప్పుడూ తపిస్తూనే వుంటుంది. ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ పట్టుదల, నమ్మకమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. తన నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా సంతోషంగా వుంది. కష్ట సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అమ్మ నుండే నేర్చుకున్నాను. మమ్మల్ని స్కూల్‌కు పంపించాడానికి సమాజంతో కూడా పోరాడింది.

ఆ ఐదుగురు…
‘ది యాషెస్‌ షీ రోజ్‌’ ను 2019, డిసెంబర్‌లో నోషన్‌ ప్రెస్‌ వారు ప్రచురించారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఐదుగురు తల్లుల జీవితాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. మాధవీ ఇరానీ (చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌, నైకా), మాలికా సధాని (ది మామ్స్‌ కో వ్యవస్థాపకురాలు), నందిని సర్కార్‌ (గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ డైవర్సిటీ అండ్‌ ఇంక్లూజన్‌, ది బోయింగ్‌ కంపెనీ), రియా ష్రాప్‌ దేశారు (పీపుల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌, సులా వైన్యార్డ్‌), నాయనా ఉడుపి (థాట్‌ వర్క్స్‌ సంస్థకు మార్కెటింగ్‌ మేనేజర్‌) ఈ ఐదుగురు తమ జీవితంలో ఎలా ఎదిగారు వాళ్ళ ఆశయాన్ని ఎలా చేరుకోగలిగారు అనేది ఈ పుస్తకంలో ఉన్న అంశాలు.

చదువు చాలా ముఖ్యం
షిమోగా అనే చిన్న పట్టణంలో ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. అమ్మాయిలకు ఎలాంటి హక్కులూ వుండవు. వివక్ష ఎక్కువ, చదువులేదు, బాల్య వివాహలు, ఇష్టం లేకుండా పిల్లలు కనడం, సొంత అభిప్రా యాలకు విలువ వుండదు. ఆర్థిక స్వతంత్య్రం లేకపోవడం వల్ల కోరికలను చంపుకున్న అమ్మను చూస్తూ పెరిగాను. మా కోసం ప్రపంచంతో యుద్ధం చేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం, చదువు ఎంత ముఖ్యమైనదో అర్థం చేసు కున్నాను. బిడ్డకు జన్మనివ్వడమే మహిళకు పెద్ద ఆటంకంగా ఈ సమాజం చూపిస్తుంది. కానీ చదువువుంటే అదేం పెద్ద ఆటంకం కాదు. నేను చెప్పదల్చుకుంది ఒక్కటే.. ఆడపిల్ల స్వతంత్య్రంగా బతకాలంటే చదువు చాలా ముఖ్యం.

Courtesy Nava telangana