• ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్న తల్లి
  • కుటుంబ కలహాలకు బలైన చిన్నారులు

సూర్యాపేట నేరవిభాగం : కుటుంబ కలహాలు.. అభంశుభం తెలియని చిన్నారుల్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. పిల్లల్ని కడతేర్చిన దారుణం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణితో హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌కు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ప్రశాంత్‌ స్థానికంగా డ్రైవర్‌గా పనిచేసుకుంటూ సూర్యాపేటలోని విద్యానగర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి కుమార్తె మాధవి (9), కుమారుడు హర్షవర్ధన్‌ (6) ఉన్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన నాగమణి.. సద్దుల చెరువు కట్టపైకి చేరుకుంది. మొదట పిల్లలిద్దరినీ చెరువులోకి తోసేసిన ఆమె.. ఆ తర్వాత ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంది. అక్కడే రోదిస్తూ తెల్లవారేంత వరకు కూర్చోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. అప్పటికే హర్షవర్ధన్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. పోలీసులు మాధవి మృతదేహాన్ని వెలికితీశారు. నాగమణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపారు.

Courtesy Eenadu