హైదరాబాద్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. వస్తుంటాయి. పోతుంటాయి. అప్పటికప్పుడు సర్దుకుపోతాయి. కానీ ఓ తల్లి.. భర్త మీద కోపంతో ఘాతుకానికి తెగబడింది. నవమాసాలు మోసి కన్న పసిగుడ్డును కర్కశంగా చంపేసింది. భవనం పైనుంచి కిందికి విసిరేసింది. దీంతో 14 రోజుల పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ అమానుషమైన ఘటన సనత్‌నగర్‌లోని ఫతేనగర్ నేతాజీనగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..
కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌కు ఫతేనగర్ నేతాజీనగర్‌కు చెందిన లావణ్యతో 2016 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత దంపతులిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో లావణ్య మళ్లీ గర్భవతి అయింది. డెలివరీ కోసం అమ్మగారి ఇల్లైన నేతాజీనగర్‌కు వచ్చింది. కుటుంబ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెల 29న లావణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే మరుసటి రోజు(అక్టోబర్ 30)న మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక…
లావణ్య ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఆస్పత్రి నుంచి తల్లిగారింటికి చేరుకుంది. ఆమెకు భర్తపై ఉన్న కోపం తగ్గకపోవడంతో శుక్రవారం(నవంబర్ 13) రోజున 14 రోజుల పసిబిడ్డను తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. లావణ్య భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సనత్ నగర్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

Courtesy Andhrajyothi