చిన్న, సన్నకారు ఓనర్ల లీజులు తిరస్కరణ
లక్షలాది వాస్తవసాగుదారులకు అందని భరోసా
సిసిఆర్‌సిలలో 35 శాతానికే సొమ్ము
గిరిజన రైతుల్లో 56 శాతం మందికే జమ
సొంత భూమిదారులకూ టెక్నికల్‌ సమస్యలు
కౌలు రైతుల ‘భరోసా’కు సర్కారు మరో నిబంధన విధించి పిడుగుపాటుకు గురి చేసింది. సన్న, చిన్నకారు రైతుల భూములను కౌలు చేసే వారికి భరోసా లేదని పేర్కొంది. రైతు భరోసా అమలుకు గత నెల 19న ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ షరతు లేనప్పటికీ, రాష్ట్ర కేంద్రం నుంచి అందిన మౌఖిక సూచనల మేరకు క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతుల భూములను కౌలు చేసుకుంటున్న లక్షలాది వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం ప్రకటించిన భరోసా సొమ్ము దూరమవుతోంది. కౌలు రైతుల భరోసాకు ఇప్పటికే ప్రభుత్వం విధించిన నిబంధనలతో భరోసా దక్కక లక్షలాది మంది తంటాలు పడుతుండగా ఈ కొత్త షరతును ముందుకు తేవడంతో కౌల్దారుల్లో ఆందోళన అధికమైంది. ఇదిలా ఉండగా భరోసా పథకం ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకాగా కొత్త కౌలు చట్టం ప్రకారం శనివారం నాటికి 1.43 లక్షల మందికి మాత్రమే పంట సాగుదారు హక్కు పత్రాలు (సిసిఆర్‌సి) జారీ కాగా వారిలో 50 వేల మందికే భరోసా వర్తింపజేశారు. అంటే ఇచ్చిన సిసిఆర్‌సిలలో 35 శాతం మందికే భరోసా దక్కింది. ఏజెన్సీలోని గిరిజనుల విషయంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అటవీ హక్కుల చట్టానికి లోబడి 64,194 మంది గిరిజనులు భూములను సాగు చేసుకుంటుండగా పలు షరతులు పెట్టి ఇప్పటి వరకు 36 వేల మందికే ‘భరోసా’ను కల్పించారు. అటవీ హక్కుల చట్టం కింద గుర్తించిన గిరిజనుల్లో 56 శాతం మందికే భరోసా దక్కడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదేం షరతు?
మామూలుగా రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి స్వంతంగా కలిగిన రైతులు సన్న, చిన్నకారు కేటగిరీలోకొస్తారు. ఇలాంటి వారు తమకు తాము సొంతంగా వ్యవసాయం చేసుకుంటారు మినహా తమ భూములను వేరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌలుకు ఇవ్వరన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకే సన్న, చిన్నకారు రైతుల భూములను కౌలు చేస్తున్న సాగుదార్లను భరోసాకు గుర్తించబోమంటోంది. ఒకవేళ అటువంటి కౌలు రైతులకు సిసిఆర్‌సిలు ఇచ్చినప్పటికీ భరోసాను తిరస్కరిస్తోంది. వాస్తవానికి సన్న, చిన్నకారు రైతులు సైతం తమ భూములను అక్కడక్కడ వేరొకరికి కౌలుకు ఇస్తున్నారు. ఒంటరి మహిళలు, కుటుంబంలో వృద్ధులు మాత్రమే వున్నవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాల్లో ఉన్న యజమానులు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. కానీ సదరు భూములను సాగు చేసుకుంటున్న వారిని భరోసాకు గుర్తించకపోవడంపై ఆవేదన చెందుతున్నారు.

యజమానులకూ ఇబ్బందులే
సొంత భూమి కలిగిన రైతుల విషయంలో కూడా అందరికీ భరోసా సొమ్ము అందలేదు. సుమారు 18 లక్షలకుపైన వెబ్‌లాండ్‌ ఖాతాలను మండల స్థాయిలో తిరస్కరించగా, మరో 11 లక్షలకుపైన ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయ విస్తరణాధికారులు (ఎఇవొ), మల్టీపర్పస్‌ విస్తరణాధికారులు (ఎంపిఎఇవొ), మండల వ్యవసాయాధికారులు (ఎంఎవొ) క్లియర్‌ చేసిన ఖాతాలు 49.10 లక్షలు కాగా వాటిలో 34 లక్షలకే భరోసా సొమ్ము జమ అయింది. ఆధార్‌, మొబైల్‌, బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, పలు దశల వడపోతల్లో భరోసాకు అర్హత సాధించినప్పటికీ సొమ్ము జమ కావట్లేదు.

Courtesy Prajashakthi