పురుషులకంటే మహిళలకే ఎక్కువ
జాతీయ స్థాయి అధ్యయనంలో వెల్లడి
అమరావతి:
కుటుంబభారం మోస్తూ.. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సంసారం రెండింటినీ సమన్వయం చేసుకుంటున్న మహిళ.. తన సొంత ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోలేకపోతోంది. మగవారి కంటే మగువలే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మూడు పదుల వయసు దాటకముందే వీరిని సమస్యలు ముప్పిరిగొంటున్నాయి.
పురుషుల కంటే మహిళలు త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. 30 ఏళ్ల వయసులో 8.3% మంది మహిళలకు, 6.7% మంది పురుషులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యరంగంపై కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలో 2017 జులై నుంచి 2018 జూన్‌ వరకు జరిగిన జాతీయస్థాయి 75వ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జీవనశైలిలో మార్పులవల్ల పట్టణాలు, నగరాల్లో హృద్రోగాలు, ముధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా ఉండగా గ్రామీణులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు.
అధ్యయనం ఇలా..
ఇన్‌ఫెక్షన్లు (విషజ్వరాలు, కామెర్లు, రక్త విరేచనాలు, ఇతర), హృద్రోగసమస్యలు (రక్తపోటు, గుండెజబ్బులు), ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం, థైరాయిడ్‌, క్యాన్సర్‌, జీర్ణకోశ వ్యాధులు, మానసిక సమస్యలు, ఇతర అనారోగ్యాలపై దేశవ్యాప్తంగా అధ్యయనం జరిగింది. నిర్దేశిత 15 రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల ప్రజలు ఏయే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న వివరాలు సేకరించారు.

(Courtesy Eenadu)