• గొంతులేని వారికి గొంతుకనిచ్చిన పత్రిక
  • ప్రతి అక్షరం ఆలోచింపజేసేదే:కె.శ్రీనివాస్‌
  • అంబేడ్కర్‌ను మించిన తత్వవేత్త లేరు: అల్లం నారాయణ

డిచ్‌పల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రారంభించిన మూక్‌నాయక్‌ పత్రిక.. ఆయన భావాలకు ప్రతిబింబం వంటిదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. గొంతులేని బలహీనులకు ఈ పత్రిక గొంతుకనిచ్చిందని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అండ్‌ ఐడియలాజికల్‌ జర్నలిజం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.

మూక్‌నాయక్‌ పత్రిక వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. అంబేడ్కర్‌ ఒక్క రంగానికే పరిమితం కాలేదని, సమాజాన్ని సంస్కరించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. పత్రిక అవసరాన్ని గుర్తించి ప్రారంభించారని, అంబేడ్కర్‌ రాసిన ప్రతి అక్షరమూ ఆలోచింపజేసేదిగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత సమాజం అంబేడ్కర్‌ను విస్మరించడం బాధాకరమన్నారు.

ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ పత్రికలు, పత్రికేతర రచనలను చదవాలని, ఆయన శక్తిని, యుక్తిని పొంది మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు.

మీడియా అకాడమీ ఆఫ్‌ తెలంగాణ చైౖర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను మించిన తత్వవేత్త ప్రపంచంలో మరొకరు లేరన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా అంబేడ్కర్‌ ఆశయాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు.

ఈ సందర్భంగా అంబేడ్కర్‌ రచనలతో రూపొందించిన సావనీర్‌ను అతిథులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నసీం, అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైౖరెక్టర్‌ కృష్ణారావు, సమాంతర భారత్‌ చీఫ్‌ ఎడిటర్‌ వరుణ్‌కుమార్‌, సదస్సు డైరెక్టర్‌, కోకన్వీనర్‌ ప్రభంజన్‌ కుమార్‌, డాక్టర్‌ రాజారాం, చంద్రశేఖర్‌, శాంతాబాయి, త్రివేణి పాల్గొన్నారు.

Courtesy Andhrajyothi