* భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌లో భారీ కోత
* కుప్పకూలిన సెన్సెక్స్‌
* విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం
భారత ఆర్థిక రంగానికి మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసు భారీషాక్‌ ఇచ్చింది. ప్రపంచంలోనే ప్రముఖ రేటింగ్‌ సంస్థ అయిన ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక స్థితిపై ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు క్రెడిట్‌ రేటింగ్‌లో భారీగా కోత పెట్టింది. వృద్ధి భవిష్యత్‌లోనూ తగ్గనుందన్న అంచనా వేసిన మూడీస్‌ మొత్తం పరపతి వ్యవస్థల స్థాయిని తగ్గించింది. ఇప్పటి వరకు నిలకడగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తోందని వ్యాఖ్యానించింది. భారత ఆర్థిక వ్యస్థలో చోటుచేసుకున్న మందగమనం అంచనా వేసిన దానికన్నా తీవ్రంగా ఉందని, దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. కొంత కాలంగా వివిధ సర్వే సంస్థలు చేస్తున్న ఇదేరకమైన అంచనాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు తోసిపుచ్చు తున్న సంగతి తెలిసిందే. మూడీస్‌ తాజా నివేదికను విడుదల చేసిన తరువాత కూడా కేంద్రం అదేరకమైన ప్రయత్నాన్ని చేసింది. దేశ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. అయితే, అప్పటికే మూడీస్‌ తాజా అంచనాలు ప్రకంపనలు సృష్టించాయి. సెన్సెక్స్‌ కుప్పకూలింది. స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌కు సంబంధించిన అన్ని సూచికలు నేల చూపు చూశాయి. వృద్ది రేటు కారణంగా రేటింగ్‌ను తగ్గించడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. బ్యాంకింగ్‌ షేర్లు కొంత తోడ్పాటు ఇవ్వడంతో మార్కెట్లు భారీ నష్టాల నుండి బయటపడ్డాయి. మూడీస్‌ కోత ప్రభావం విదేశీ పెట్టుబడులపై కూడా భారీ ప్రభావం చూపనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 2020 నాటికి భారత జిడిపిలో ద్రవ్యలోటు ప్రభుత్వం అంచనా వేసిన 3.3 శాతానికి మించి 3.7 శాతానికి చేరుకుంటుందని మూడీస్‌ అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్‌ మధ్య కాలంలో జిడిపి వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయిందని, ఇది గత ఆరు సంవత్సరాల అత్యల్పమని తెలిపింది. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న భారత్‌ మరింతగా అప్పులు చేయాల్సివస్తుందని, అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ప్రజల కొనుగోలు శక్తి ఇప్పటికే పడిపోవడాన్ని, సంక్షేమరంగంపై ప్రభుత్వం పెడుతున్న కోతలను ఈ సందర్భంగా మూడీస్‌ ప్రధానంగా ప్రస్తావించింది.

ఎందుకీ స్థితి…?
నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న అనేక చర్యలను తాజా నివేదికలో మూడీస్‌ తప్పుపట్టింది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికంటూ ఇటీవల కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన అనేక పన్ను రాయితీలు వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. అదే సమయంలో సామాన్య ప్రజల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతుల, వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలేమి తీసుకోలేదని, దీని ప్రభావం రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా కనిపించి ఆర్థిక వ్యవస్థను మరింతగా కుదించివేస్తుందని పేర్కొంది. దేశంలో వ్యక్తమవుతున్న ఈ తరహా విమర్శలను కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ కార్పొరేట్లకు మరింతగా రాయితీలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాలు ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచకపోగా మరింతగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది.

ఎస్‌బిఐసహా ఆరు ఆర్థిక సంస్థల రేటింగ్‌ తగ్గింపు
మూడీస్‌ సంస్థ శుక్రవారం ప్రకటించిన రేటింగ్స్‌లో స్ట్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సితో సహా ఆరు ఫైనాన్సియల్‌ సంస్థల అవుట్‌లుక్‌ తగ్గింది. ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎక్సిమ్‌ ఇండియా, హీరో ఫిన్‌కార్ప్‌, హడ్కో, ఐఆర్‌ఎఫ్‌సిల రేటింగ్‌ను తగ్గించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రేటింగ్‌ను గతంలో ఉంచిన స్థానం లోనే ఉంచింది.
‘దీర్ఘకాలికంగా భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఉద్యోగాల కల్పన నీరసించింది. నాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి నోచుకోలేదు. అదే సమయంలో ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చింది. సంక్షేమంలో కోతలు పెట్టింది. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయి. వృద్ధిరేటుపై ప్రభావం చూపడంతో ఆర్థిక వ్యవస్థ పతనంవైపు సాగుతోంది. అంతర్జాతీయ పరపతి తగ్గుతుండటంతో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టడం కష్టంతో కూడుకున్న పని’
మూడీస్‌

Courtesy Prajasakthi…