మాంద్యం కారణంగా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో భారీ కోత విధించింది. అందుకనుగుణంగా అన్ని శాఖలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌లో ఓ కీలక అధికారి మాత్రం దుబారా ఖర్చులకు తెరతీయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో రాయితీ రుణాలు, మూడెకరాల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.214 కోట్లే కేటాయించింది. ఈ నిధులు పూర్తిగా ఖర్చుచేసినా బకాయిలకు మరో రూ.200 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఎస్సీ కార్పొరేషన్‌లో ఓ కీలక అధికారి దుబారా ఖర్చుకు తెరలేపారు. రూ.50 లక్షలు వెచ్చించి సమావేశ మందిరంలో మార్పులు, చేర్పులు చేయడంతోపాటు ఫర్నిచర్‌ కొనుగోలు చేశారు. పథకాల ప్రచారం కోసమంటూ రూ.5 లక్షలకుపైగా ఖర్చుచేసి కార్పొరేషన్‌ కార్యాలయంలో డిజిటల్‌ తెర, కియోస్క్‌ను ఏర్పాటు చేయించారు. తాజాగా ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.లక్షకు పైగా విలువైన టీవీలు, పరికరాలు కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా..అక్కడా ఇదే తరహాలో ప్రచారం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రచారానికి అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన సహా, ఈ మొత్తం వ్యవహారానికి దాదాపు రూ.50 లక్షలు ఖర్చుచేసేందుకు ఆ అధికారి దస్త్రం సిద్ధం చేయించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ శాఖలోనైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే సర్కారు అనుమతితో టెండరు పిలవాలి. ఇవేమీ లేకుండా  కొటేషన్స్‌ తీసుకుని టీవీలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు ఆయన సిద్ధమైనట్టు సమాచారం.

Courtesy Eenadu..