బి. లక్ష్మారెడ్డి

నేడు దేశవ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపో తోంది. అక్రమపద్ధతుల్లో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయపార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి కోట్ల రూపాయలు విరాళాలు వసూలు చేస్తూ ఎన్నికల్లో నిర్లజ్జగా గెలుపుగుర్రాల పేరిట తమ అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నాయి. నిబద్ధతతో ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న సామాన్యుడికి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం ఎండమావిగానే మిగిలిపోతోంది. రాజ్యాంగ నిర్మాతలు ఉదాత్త ఆశయాలతో కల్పించిన రాజకీయ స్వేచ్ఛ ద్వారా పేదవాడు కేవలం ఓటరుగానే మిగిలిపోతున్నాడు.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దేశం నలుమూలల నేరారోపణలు ఎదుర్కొంటున్న తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణ ప్రక్రియ వివిధ కోర్టులలో నడుస్తున్న సమయంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో నేరచరితులు, సంపన్నులు ప్రధాన రాజకీయ పార్టీల తరుపున బరిలో ఉండటం దేశ ప్రజలను నివ్వెరపరుస్తోంది. భారత అత్యున్నత న్యాయస్థానం నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పలు మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ వాటిని రాజకీయ పార్టీలు పెడచెవిన పెడుతున్నాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లైంగిక దాడి, హత్యా నేరాలు, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సైతం రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఎన్నికల్లో నేర చరితులను అడ్డుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్న అఫిడవిట్‌లలోని వివరాల ప్రకారం ఏడీఆర్‌ నివేదికలను రూపొందించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌ ఎన్నికలు మూడు విడతలలో భాగంగా ఇప్పటికే అక్టోబర్‌ 28న తొలివిడత, నవంబర్‌ 3న రెండోవిడత ఎన్నికలు జరిగాయి. నవంబర్‌ 7న మూడో విడత పోలింగ్‌తో బీహార్‌లో ఎన్నికలు ముగియనున్నాయి. మూడు విడతలలో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రను, ఆస్తుల వివరాలతో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) మూడు దఫాలుగా నివేదికలను వెలువరించింది.

అక్టోబర్‌ 28న మొదటి దశ ఎన్నికలు జరిగిన 71స్థానాలలో ఆయా రాజకీయ పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు 1066 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 328మంది అభ్యర్థులపై (31 శాతం) కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది. ఆర్జేడీ 41, బీజేపీ 21, లోక్‌ జనశక్తి పార్టీ 21, కాంగ్రెస్‌ 12, జనతాదళ్‌(యు)8 మంది నేరారోపణలు ఉన్నవారికి టికెట్లు ఇచ్చాయని, మొత్తం అభ్యర్థుల్లో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక బట్టబయలు చేసింది. నవంబర్‌ 3న ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ స్థానాలలో పోటీపడుతున్న 1463మంది అభ్యర్థులు సమర్పించిన ప్రమాణ పత్రాలు ఆధారంగా ఏడీఆర్‌ రెండో నివేదికను విడుదల చేసి మొత్తం 502(34శాతం) అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు నిగ్గుతేల్చింది. ఆర్జేడీ 36, బీజేపీ 29, జేడీయూ 20, కాంగ్రెస్‌ 14, ఎల్‌ జేపీ 28, బీఎస్పీ 16మంది అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. రెండో దశ ఎన్నికలు జరిగిన 94నియోజకవర్గాల్లో 84స్థానాల్లో ఒక్కోచోట ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నవారే పోటీ పడుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 495మంది కోటీశ్వరులకు వివిధ పార్టీలు టికెట్లు ఇచ్చాయని, బరిలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరి సగటు ఆస్తి రూ.1.72 కోట్లుగా ఉందని, ఆస్తులేమి లేనివారు కేవలం ముగ్గురు మాత్రమేనని ఏడీఆర్‌ నివేదిక తేటతెల్లం చేసింది.

ఈనెల 7న జరిగే బీహార్‌ అసెంబ్లీ మూడోదశ ఎన్నికల్లో 71స్థానాల్లో పోటీ చేస్తున్న మొత్తం 1195మంది అభ్యర్థులలో 371 (31శాతం) మందిపై నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది. వీరిలో 282(24శాతం) అభ్యర్థులపై తీవ్రమైన బెయిల్‌ ఇవ్వడానికి వీలులేని కేసులు ఉన్నాయని ప్రకటించింది. బీజేపీ 34, ఆర్జేడీ 32, జేడీయూ 21, కాంగ్రెస్‌19, ఎల్‌జేపీ18, బీఎస్పీ 5మంది అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. మూడో దశలో మొత్తం 1195 మంది అభ్యర్థులలో 361 మంది (30శాతం) కోటీశ్వరులు ఉన్నారు. అభ్యర్థులందరు సగటున 1.47కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్టు ఏడీఆర్‌ పేర్కొంది. ఇవన్నీ వారు ప్రకటించిన ఆస్తులు మాత్రమే. అప్రకటిత ఆస్తులు ఇందుకు ఎన్నిరెట్లు ఉంటాయో ఊహించవచ్చు.

దేశంలోని తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4442 కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టు ఇటీవల తెలిపిన నివేదిక ద్వారా వెల్లడైంది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాది హన్సారియాను నియమించింది. వివిధ రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌లు సమర్పించిన నిందితుల సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను సుప్రీంకోర్టుకు హన్సారియా సమర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల పెండింగ్‌ కేసులను సత్వరమే విచారణ జరపాలని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్‌ 16న వివిధ రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివిధ రాష్ట్రాల హైకోర్టులు ప్రజాప్రతినిధుల కేసులలో విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రావటం, రాజకీయ పార్టీలు జరుగుతున్న పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా పెద్దఎత్తున నేరచరితులకు టికెట్లు ఇవ్వడం నేరమయ రాజకీయాలకు అద్దం పడుతోంది.

బీహార్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు 1201 మంది నేరారోపణలు ఉన్నవారిని, 1231మంది కోటీశ్వరులను బరిలో నిలపటం, వారిలో 60శాతానికి పైగా గెలిచే అవకాశాలు ఉండటంతో విధానసభలో కండబలం, ధనబలం ఆధిపత్యం చెలాయించి సభా విశిష్టతకు మచ్చతెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 511మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణలో బీహార్‌ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపొందే నేరారోపణలు ఉన్నవారిని కలుపుకుంటే దేశంలోనే బీహార్‌ మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ వీరిని విచారించటం, ఒకవేళ దోషిగా నిరూపించబడితే శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవడం, మళ్లీ ఎన్నికల నిర్వహణతో ప్రజాధనం, సమయం వధా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేరగాళ్లతో అంటకాగుతున్న రాజకీయ పార్టీల వైఖరిని ప్రజలే ఎండగట్టాలి. నేరమయ రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడాలంటే ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Courtesy Nava Telangana