యస్‌ బ్యాంక్‌ సంక్షోభం ఖాతాదారులనేగాక ప్రజలందర్నీ దిగ్భ్రాంతపర్చింది. మొత్తం బ్యాంకింగ్‌ రంగంపైనే ప్రజలకు అనుమానాలు ఏర్పడేలా చేసింది. యస్‌ బ్యాంక్‌ దివాలా అంచున నిలబడటం…కేవలం సంస్థ ఆర్థిక, పాలనాపరమైనలోపం వల్ల తలెత్తినది కాదని నిపుణులు చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలు, బడా కార్పొరేట్లకు, పాలకులకు మధ్య నీకిది-నాకది‘ (క్రోనీ క్యాపటలిజం) సంబంధాలు ఇలాంటి సంక్షోభానికి దారితీస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

– రుణాలు ఎగ్గొట్టిన వారిలో ప్రధాని మోడీ సన్నిహితులు

బ్యాంక్‌ మూతపడటం వెనుక క్రోనీ క్యాపటలిజం‘ : ఆర్థిక నిపుణులు
ఆర్థిక అక్రమాలు ఆరేండ్ల కిందటివైతే…ఇన్నేండ్లు ఏం చేశారు

న్యూఢిల్లీ : యస్‌ బ్యాంక్‌ చాలా కాలంగా మొండి బకాయిలతో సతమతం అవుతున్నది. మోడీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు అనిల్‌ అంబానీ, సుభాష్‌ చంద్ర(జీ నెట్‌వర్క్‌) సహా అనేకమంది బడా కార్పొరేట్లకు యస్‌ బ్యాంక్‌ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందాయి. యస్‌ బ్యాంకు మొండి బకాయిలన్నీ ‘యూపీఏ’ హయాంలో ఇచ్చినవేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొండి బకాయిలు రూ.2.64లక్షల కోట్లలో అత్యధికం 2014 తర్వాత ఇచ్చినవే ఉన్నాయన్న సంగతి ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. 2017 నుంచి యస్‌ బ్యాంకుపై సునిశిత పర్యవేక్షణ జరుపుతూ వస్తున్నామని చెబుతున్న నిర్మలా సీతారామన్‌ బ్యాంకు దివాలా తీయకుండా ఎందుకు ఆపలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు.

దాచినా..దాగదులే..

తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన కేఫ్‌ కాఫీ డే, సీజీ పవర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌…మొదలైన సంస్థలకు కూడా యస్‌ బ్యాంకు రుణాలు ఇవ్వటం పలు అనుమానాలు కలిగిస్తున్నది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులు అనిల్‌ అంబానీ, జీ నెట్‌వర్క్‌ టెలివిజన్‌ సంస్థల అధిపతి సుభాష్‌ చంద్ర…ఇలాంటి వారెందరో యస్‌ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టారని సమాచారం. ఈ రుణాలన్నీ మొండి బకాయిలుగా మారకముందే ఆర్బీఐ చర్యలు తీసుకోవాల్సింది.
అలా తీసుకోకపోవడానికి కారణం రుణ ఎగవేతదార్లతో మోడీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలేనని తెలుస్తున్నది. బ్యాంకు పూర్తిగా దివాలా తీసేంత వరకూ ఆగి…ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కొద్ది నెలల క్రితం పీఎంసీ బ్యాంకు( పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంక్‌) కూడా ఇలాగే ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయింది. ఖాతాదార్ల విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ మారిటోరియం విధించింది.

ఇదంతా దేనికి సంకేతం
?
నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణం, జెట్‌ ఎయిర్‌వేస్‌, యస్‌ బ్యాంక్‌, వొడాఫోన్‌ (బ్యాంకుల నుంచి అప్పులు), యస్‌ బ్యాంకు దివాలా…మొదలైనవి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్‌ వర్గాలకు, పాలకులకు మధ్య క్రోనీ క్యాపటలిజం కొనసాగినంత కాలం ఇలాంటి సంక్షోభాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యస్‌ బ్యాంకును రక్షించడానికి ఎస్బీఐ స్వంత డబ్బు, బాండ్ల రూపంలో సేకరించింది…అంతా కలిపి రూ.11,760కోట్లు యస్‌ బ్యాంకుకు సమకూర్చాలని మోడీ సర్కార్‌ నిర్ణయించటం సరైంది కాదని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ చర్య ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐని తీవ్రంగా నష్టపరుస్తుందని, రిస్క్‌ను మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్బీఐ పసిగట్టలేక పోయిందా
?
గతకొన్నేండ్లుగా బ్యాంకింగ్‌ రంగంలో మోసాలెన్నో బయటపడుతున్నాయి. వ్యాపార నిర్వహణలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి విఫలమవుతున్నాయి. ఇందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆర్థిక నేరాల్ని ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకోవటంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ‘యస్‌ బ్యాంకే’. యస్‌ బ్యాంకు మొండి బకాయిలు, ఆర్థిక అక్రమాలు, పాలనాపరమైన మోసాలు…అన్నీ ఆర్బీఐకి ముందే తెలుసునని, ఆర్బీఐలోని నియంత్రణా వ్యవస్థ కావాలనే తాత్సారం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నాలుగో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ‘యస్‌ బ్యాంక్‌’. 2004లో ప్రారంభమై చాలా వేగంగా ఆర్థిక కార్యకలాపాలు పెంచుకున్న సంస్థ ఇది. డిపాజిట్లపై అధిక వడ్డీని ఇవ్వజూపడం, ఆధునిక సాంకేతిక ఆధారిత సేవలు (ఫోన్‌ పే), ఉత్పత్తులను అందించటం…ఖాతాదారులను విశేషంగా ఆకర్షించింది. అయితే అనూహ్యంగా, ఆకస్మికంగ బ్యాంకు పరిస్థితి దిగజారింది. వాస్తవ స్థితిని దాచడం కోసం యస్‌ బ్యాంకు యాజమాన్యం ఆడిట్‌ ప్రక్రియను గాడితప్పించింది. ఇది అంత త్వరగా బయటకు రాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్ద తలకాయలను, ఆర్బీఐని ‘మేనేజ్‌’ చేసిందనే ఆరోపణలున్నాయి.

Courtesy Nava telangana