చెన్నై : ప్రధాని మోడీ ప్రసంగాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేయలేదని ఓ ఉద్యోగినిపై ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టింగ్‌ ఏజెన్సీ ప్రసార భారతి క్రమ శిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సెప్టెంబర్‌ 30న తమిళనాడులోని మద్రాస్‌ ఐఐటీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని డీడీ పొదిగరులో లైవ్‌లో ప్రసారం చేయలేదని చెన్నైలోని ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌ వసుమతిపై సస్పెన్షన్‌ వేటువేసింది. సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో బాహాటంగా ఈ కారణాన్ని పేర్కొనకున్నా ఉద్దేశం మాత్రం అదేనని సంబంధిత వర్గాల సమాచారం. ఆదేశాలిచ్చినప్పటికీ ఆమె ఉద్దేశపూర్వకంగానే మోడీ ప్రసంగాన్ని లైవ్‌లో ప్రసారం చేయలేదని ఓ సీనియర్‌ అధికారి ఆరోపించడం గమనార్హం. సెప్టెంబర్‌ 30న తమిళనాడులో మోడీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనగా.. రెండింటినీ డీడీ పొదిగరు లైవ్‌లో ప్రసారం చేసింది. అయితే, మద్రాస్‌ ఐఐటీలో జరిగిన ప్రోగ్రామ్‌ను పూర్తిగా లైవ్‌లో ప్రసారం చేయలేదు. మోడీ ప్రసంగాన్ని లైవ్‌లో కాకుండా.. ఒక వార్తగా ప్రసారం చేయడంపై పీఎంవో ఇప్పటికే ఆరాతీసినట్టు తెలిసింది. కాగా, డీడీ పొదిగరు సిబ్బందికి లైవ్‌ టెలికాస్ట్‌కు కావాల్సిన అనుమతులు రాలేవని మరో అధికారి వివరించారు. నిబంధనల ప్రకారం.. డీడీ నేషనల్‌ లైవ్‌ ప్రసారం చేస్తుందని ఇంకో అధికారి తెలిపారు. సస్పెన్షన్‌ సర్కారు విధించిన కఠిన శిక్షణా అని ప్రశ్నించగా.. ప్రభుత్వం సస్పెన్షన్‌ను శిక్షగా భావించదని, ఇది విచారణలో ఒక భాగమని అధికారి వివరించారు.

Courtesy Navatelangana...