తమిళంలో లేఖ.. తమిళనాడుకు పోస్టు
అక్క ణ్నుంచి తీహార్‌కు ఆలస్యంగా చేరిన లేఖ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. చిదంబరం! ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించి సెప్టెంబరు 5 నుంచి తీహార్‌ జైల్లో ఉంటున్నారు!! సెప్టెంబరు 16న ఆయన పుట్టినరోజున కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు ఆయనపై కక్షగట్టి అన్యాయంగా జైలుకు పంపిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది!! కానీ.. ప్రధాని మోదీ చిదంబరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘తమిళం’లో లేఖ రాశారు. ఆ లేఖను తమిళనాడులోని చిదంబరం చిరునామాకు పంపారు. ఆ లేఖ రీడైరెక్ట్‌ అయ్యి తీహార్‌ జైల్లోని చిదంబరం వద్దకు చేరుకునేసరికి కొంచెం ఆలస్యమైంది. ఈ విషయాన్ని చిదంబరం ట్విటర్‌ ద్వారా తెలిపారు (తాను జైల్లో ఉన్నా తన ట్విటర్‌ ఖాతాను చిదంబరం తన కుటుంబసభ్యుల ద్వారా కొనసాగిస్తున్నారు).

‘‘నా పుట్టినరోజు సందర్భంగా మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం నాకు ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. లేఖలో మీరు కోరుకున్నట్టు నేను కూడా ప్రజలకు సేవ చేయడం కొనసాగించాలనుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తూ.. ఆ పని చేయకుండా మీ దర్యాప్తు సంస్థలు నన్ను అడ్డుకుంటున్నాయి. నాపై ఈ వేధింపులు ముగిసిపోతే, నేను ప్రజల మధ్యకు వస్తాను’’ అని చిదంబరం పేర్కొన్నారు. కాగా.. చిదంబరం బెయిల్‌ కేసు విచారణ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ అనుమతుల మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలు ఎలా లభ్యమయ్యాయో తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా చిదంబరం న్యాయవాదులను జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ ఆదేశించారు.

Courtesy Andhrajyothi…