– సర్వే గణాంకాలపై సమాధానం చెప్పుకోలేకపోతున్న మోడీ సర్కార్‌
– ఎన్‌ఎస్‌ఓ నివేదికను తొక్కిపెట్టే ప్రయత్నం..విఫలం
– నివేదికలో చేదు నిజాల్ని అంగీకరించలేక కుంటిసాకులు : ఆర్థిక విశ్లేషకులు
– నిరుద్యోగం పెరిగిందన్న నివేదికపైనా గతంలో ఇలాగే…

న్యూఢిల్లీ : పేదరికం, నిరుద్యోగం మనదేశ ప్రజల్ని ఎంతగా వేధిస్తున్నాయో ఇటీవల విడులైన గణాంకాలే నిదర్శనం. ప్రభుత్వ శాఖల్లోని గణాంక నిపుణులు ఈ నివేదికల్ని రూపొందించారు. అయితే ఈ గణాంకాలు(ఎన్‌ఎస్‌ఓ, సీఎంఐఈ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తమ పాలనా వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నాయని మోడీ సర్కార్‌ తొక్కిపెట్టాలని చూస్తోంది. గణాంకాల్ని మార్చేందుకు కేంద్రం దారులు వెదుకుతోందనీ, ఇలాంటి నిర్ణయాలతో ప్రజల జీవన పరిస్థితి మెరుగుపడుతుందా? అని మేథావులు, ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం దాస్తే దాగే విషయాలు కాదని వారు గుర్తుచేస్తున్నారు.
వినియోగదారుల కొనుగోలు శక్తిపై జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) రూపొందించిన తాజా నివేదిక లీకైన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని గణాంకాలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేరుగుతున్న నిరుద్యోగం, పేదరికం అంశాల్ని పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తడానికి సిద్ధమవుతున్నాయి. 137 కోట్ల దేశ జనాభాలో అత్యధికులు పేదరికంలో కూరుకుపోయారనీ ‘ఎన్‌ఎస్‌ఓ’ తాజా నివేదిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. కేంద్ర గణాంకశాఖలోని అధికారులు, నిపుణులు ఈ నివేదికను తయారుచేశారు. ఈ నివేదిక అధికారికంగా బయటకు రాకుండా మోడీ సర్కార్‌ తొక్కిపెట్టడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.

గణాంకాల్ని దాచే ప్రయత్నం
నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టస్థాయికి చేరిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వారి ‘పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ నివేదిక తేల్చింది. ముద్రా, ఇతర పథకాల కింద ఉద్యోగాల కల్పన ఎంత జరిగిందన్నది లేబర్‌బ్యూరో సర్వే నివేదిక ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వినియోగం పడిపోయిందని తాజాగా ‘ఎన్‌ఎస్‌ఓ’ నివేదిక తేల్చింది. అత్యంత ముఖ్యమైన ఈ మూడు నివేదికల్ని మోడీ సర్కార్‌ తొక్కిపెట్టింది. విడుదల కాకుండా ‘స్క్రాప్‌’ చేసింది.
‘ఎన్‌ఎస్‌ఓ’ నివేదికలో ఇంతకీ ఏముంది?
– 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై సగటు వ్యయం రూ.643 ఉంటే, 2017-18నాటికి రూ.580కి పడిపోయింది.
– 46 ఏండ్లలో ఎన్నడూలేనంతగా పేదరికం, పౌష్టికాహారలోపం పెరిగాయని ఈ నివేదికలోని గణాంకాలు బయటపెట్టాయి.
– గ్రామాల్లో ఆహారంపై 10 శాతం, ఆహారేతర వస్తువులపై 8.8శాతం వ్యయం పడిపోయింది.
– మొత్తంగా ఇండియాలో గృహస్తుడి నెలసరి సగటు వ్యయం రూ.1501 నుంచి రూ.1446కి పడిపోయింది.
– జులై 2017-జూన్‌ 2018 మధ్య ‘నేషనల్‌ సాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌’వారితో ఎన్‌ఎస్‌ఓ ఈ అధ్యయనం జరిపింది. నివేదికను విడుదల చేయాలని 19 జూన్‌ 2019న సంబంధిత కమిటీ అనుమతిచ్చింది.
– కానీ నివేదిక విడుదలకు కేంద్రం ససేమిరా అంది. గణాంకాల్లో నాణ్యత లోపించిందని తప్పించుకుంది.

”ఈ దేశంలోని వినియోగదారుల సగటు వ్యయం పడిపోవడమన్నది గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదు. ఇదే మొదటిసారి. పేదరికం ఊహించని స్థాయికి చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌ఓ లెక్కల ప్రకారం, 1972-73లో ఇలాంటి ఫలితమే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆనాటి చమురు సంక్షోభం, దేశీయంగా ఆహార దిగుబడులు పడిపోవటం 1972-73 గణాంకాలకు కారణం ”
– జేఎన్‌యూ ప్రొఫెసర్‌ హిమాన్షు

”ఆహారంపై సగటు వ్యయం పడిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో పడిపోయిన తీరు ఆందోళనకరం. అందుకే పౌష్టికాహార లోపం కూడా పెద్దఎత్తున నెలకొంది. పేదరికం పెరిగిందని గణాంకాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. నిరుద్యోగం, పేదరిక నిర్మూలనపై ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి”
– అభిజిత్‌ సేన్‌, ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు

”నేను ముఖ్య గణాంకాదికారిగా ఉన్నప్పుడు, 2009-10 వినియోగదారుల కొనుగోలు శక్తి సర్వే నిర్వహించాం. కానీ ఆ ఏడాది 40 ఏండ్లలో ఎన్నడూలేనంత కరువు దేశంలో ఏర్పడింది. మరోవైపు ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. దీంతో ‘బేస్‌ ఇయర్‌ 2009-10 నుంచి 2011-12కు మార్చాలనుకున్నాం. కానీ అది సరైంది కాదనీ తర్వాత నిర్ణయించుకొని, 2009-10 గణాంకాల్ని విడుదల చేశాం. వాస్తవ గణాంకాల్ని దాచలేదు”– ఇండియన్‌ స్టాటికల్‌ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ప్రణబ్‌ సేన్‌

Courtesy Navatelangana..