– అధికారిక సమాచారాన్ని తొక్కిపెడుతోన్న మోడీ సర్కారు
– గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన వినియోగ వ్యయం
న్యూఢిల్లీ : దేశంలో పేదరికంపై అధికారిక సమాచారాన్ని మోడీ సర్కారు విడుదల చేయడంలేదు. పేదరిక సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలపై కేంద్రం సమాచారాన్ని వెల్లడించకుండా ఎనిమిదేండ్ల నుంచి తొక్కిపెడుతున్నది. ముఖ్యంగా, 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదరికంపై సమాచారాన్ని విడుదల చేయకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కేంద్రం చేస్తున్నది. అయితే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. దేశంలో పేదరికం ఏస్థాయిలో ఉన్నదో ఇటీవల రెండు అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన ‘గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌(జీహెచ్‌ఐ)’తో స్పష్టమైంది. జీహెచ్‌ఐ ర్యాంకింగ్స్‌లో 95వ ర్యాంకు నుంచి 102వ స్థానానికి భారత్‌ పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా దేశం మరింత దారిద్య్రంలోకి వెళ్తున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమవుతున్న దేశంలో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ వ్యయం తగ్గిందని వారు అంటున్నారు.
కాగా, కేంద్రం తీరుతో దేశంలోని పట్టణ, ప్రాంతాలలో ప్రజల వినియోగ వ్యయం కూడా తగ్గిపోయింది. వినియోగ వ్యయంపై 2011-12లో నివేదికను విడుదల చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ.. 2017-18కి సంబంధించిన నివేదిక ఈ ఏడాది జూన్‌లో విడుదల కావాల్సిన ఉన్నా అది జరగకపోవడం గమనార్హం. 2014-15, 2017-18 లకు సంబంధించి రెండు ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌)’ లను పోల్చిన జేఎన్‌యూ ప్రొఫెసర్‌ హిమాన్షు.. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గృహ వినియోగ వ్యయం తగ్గిందనీ, ఇది ఆర్థిక విపత్తును సూచిస్తున్నదని తెలిపారు. ఆయన తెలిపిన లెక్కల ప్రకారం.. 2014లో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1587(ఒక్క వ్యక్తికి నెలకు చొప్పున అయ్యే ఖర్చు) గా ఉన్న సగటు వినియోగ వ్యయం 2017-18 నాటికి రూ.1524కు తగ్గింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 2014లో రూ. 2926గా ఉండగా, 2017-18 నాటికి అది రూ.2909కి పడిపోవడం గమనార్హం. ఈ విధమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ సంభవించలేదని హిమాన్షు వివరించారు. మోడీ పాలనలో పేదరికం పెరిగిందన్న విషయం పీఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వేల్లో వెల్లడైందనీ, ఇది తమకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో సర్వేలను కేంద్రం తొక్కి పెడుతున్నదని ఆయన తెలిపారు.
2014లో నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. పేదరికాన్ని పరిష్కరించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపే సమాచారం అంతగా అందుబాటులో లేదని ఢిల్లీలోని ఓ అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన ఆర్థిక పరిశోధకులు ఒకరు తెలిపారు. కేంద్రం నుంచి తాజా సమాచారం లభించకపోవడంతో దేశంలోని అనేక మంది యువ పరిశోధకులకు పేదరికంపై రీసెర్చ్‌ కష్టంగా మారిందని ఆయన వెల్లడించారు.

Courtesy navatelangana…