ప్రముఖ చరిత్రకారిణి, ఆచార్య రొమిలా థాపర్‌, నేను జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో చాలాకాలం పాటు సహ అధ్యాపకులం. జూలై 2019లో ఆ విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు నుండి ఆమెకు ఒక లేఖ వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమున్నదంటే…తన ‘కర్రిక్కులం విటే’ (విద్యార్హతలు, చేసిన పని.. తదితర వ్యక్తిగత వివరాలు) సమర్పిస్తే, ఆ విశ్వవిద్యాలయం నియమించిన కమిటీ ఒకటి ఆమె పనితనాన్ని విశ్లేషించి ఆ విశ్వవిద్యాలయ గౌరవాచార్య (ఎమెరిటస్‌ ప్రొఫెసర్‌) పదవిలో ‘కొనసాగాలా? వద్దా?’ అనేది తేలుస్తుందట. 1991లో పదవీ విరమణ పొందిన రొమిలా థాపర్‌ కొద్ది కాలంలోనే ఆ విశ్వవిద్యాలయ ‘గౌరవాచార్య’గా నియమితులయ్యారు.
జెఎన్‌యు ప్రస్తుత కార్యనిర్వాహక మండలికి ‘గౌరవాచార్య’ పదవికి అర్థం కూడా తెలిసినట్టు లేదు. విశ్వవిద్యాలయంలో ఖాళీగా వున్న ఒక ఉద్యోగానికి అనేక మంది దరఖాస్తులు పెట్టుకుంటే అందులో ఒకరిని ఎంపిక చేసి నియమించబోతున్నట్టుగా ఈ కమిటీ భావిస్తున్నట్టుంది. ఒక గౌరవ హోదా నియామకం దీనికి పూర్తి విరుద్ధమైనది. ఇలాంటి ఉద్యోగాలూ ఉండవు. వీటికెవరూ దరఖాస్తులూ పెట్టుకోరు. గతంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా పదవీ విరమణ పొందిన, లేక చేస్తున్న ఒక ఆచార్యునికి ఒక విశ్వవిద్యాలయం ఇచ్చే జీవిత కాలపు గౌరవ హోదా అది. ప్రపంచం లోని ఏ విశ్వవిద్యాలయానికైనా ఇదే వర్తిస్తుంది. జెఎన్‌యు లో గతంలో ఏ ప్రాతిపదికన ఇలాంటి గౌరవ పదవులిచ్చారో… దానికి విశ్వవిద్యాలయ ప్రస్తుత చర్య పూర్తి విరుద్ధంగా వుంది.
ఈ గౌరవాచార్య పదవినిస్తూ విశ్వవిద్యాలయం పంపిన లేఖలో ఇది గౌరవ హోదా అనీ, జీవిత కాలం వర్తిస్తుందనీ ఉన్న విషయాన్ని మరోసారి గుర్తు చేయాల్సి ఉంటుంది. బోధన లోనూ పరిశోధన లోనూ చేసిన విశిష్టమైన కృషికి, విద్యారంగంలో విశ్వవిద్యాలయం పేరు ప్రఖ్యాతులు సాధించడంలో ఆచార్య సిబ్బందిలో ఒకరిగా అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇచ్చిన పదవనీ అందులో స్పష్టంగా పేర్కొనబడింది. ప్రస్తుత కార్యనిర్వాహక మండలికి గానీ విశ్వవిద్యాలయ అధిపతులకు గానీ దీని ప్రాముఖ్యత అర్థం కాకుండానైనా ఉండాలి. లేదా కావాలనే ఉపేక్షించి ఉండాలి. అందుకే వాళ్ళకు అర్థమయ్యేలా వివరించాల్సి ఉంటుంది.
ఒకసారి ‘గౌరవ పదవి’ ఇచ్చాక అదలాగే ఉంటుంది. వారి కోసం విశ్వవిద్యాలయం ఆర్థికంగా గాని, మరో విధంగా గాని ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. విశిష్ట ఆచార్యులెవరైనా పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఇది విశ్వవిద్యాలయం వారికిచ్చే హోదా మాత్రమే. కనుక విశ్వవిద్యాలయ పాలకవర్గం దృష్టిలో వున్న మరెవరికైనా కట్టబెట్టేందుకు ఇలాంటి పదవులను ఖాళీ చేయించవచ్చా అనే ప్రశ్నే తలెత్తదు. దీనికోసం విశ్వవిద్యాలయానికి అదనపు ఖర్చు కూడా ఏదీ ఉండదు. కాకపోతే ఇలాంటి పదవికి ఎవరిని ఎంపిక చేశారనేదాన్ని బట్టే విద్యారంగంలో ఆ విశ్వవిద్యాలయానికి వుండే విలువ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి హోదా ఎంతమందికైనా ఇవ్వవచ్చు. గౌరవాచార్య పదవి జీవితకాలపు హోదా అనేది కూడా చాలా స్పష్టం. అటువంటప్పుడు మధ్యమధ్యలో దానిని మదింపు చేయాల్సిన అవసరమేంటి?
ఈ హోదా ఇచ్చేది భవిష్యత్తులో చేయబోయే పనికి కాదు. పదవీ విరమణ చేసేవరకు ఆచార్యులుగా వారు చేసిన విశిష్ట కృషికి ఇస్తారు. ఒక రకంగా ఇది జీవిత కాలంలో వారు సాధించినదానికి అందే బహుమతి. అందుచేత బహుమతి ఇచ్చిన తర్వాత అందుకున్న వారు చేసిన పనిని అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఈ హోదాలో కొనసాగటమనేది భవిష్యత్తులో చేసే పనిపై ఆధారపడి ఉండదు.
ఒక విశ్వవిద్యాలయం ఎవరికైనా ఈ హోదా ఇచ్చేటప్పుడు ముందుగా వారు దీనికోసం దరఖాస్తు గాని, ‘కర్రిక్కులం విటే’ (సి.వి) గాని సమర్పించే అవసరమే లేదు. ఆ ఆచార్యులు విద్యారంగంలో చేసిన కృషి, సాధించిన విజయాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆ విశ్వవిద్యాలయం లోనే ఉంటుంది. అధికారులు సక్రమంగా నిర్వహించిన పక్షంలో ఈ సమాచారమంతా ఆ విశ్వవిద్యాలయ వెబ్‌సైటు లోను, రికార్డుల్లోను వుంటుంది. సి.వి లాంటివి అడగ వలసిన అవసరమే లేదు. ఇక గౌరవ హోదా ఇచ్చిన తర్వాత స్వీయ సామర్థ్యం గురించి ఎవరి నుండో సర్టిఫికెట్లూ తోటివారి అభిప్రాయాలూ తీసుకోవాల్సిన అవసరం ఏముంది?
పైన వివరించినట్టుగా తనకు గౌరవాచార్య పదవిని ఇవ్వటంలో ఆంతర్యమేమిటో వారికి తెలిసి వుండాలని రిజిస్ట్రారుకు రాసిన ప్రత్యుత్తరంలో, విశ్వవిద్యాలయ అధిపతులకు రొమిలా థాపర్‌ గుర్తుచేశారు. అంతేగాక ఆ కమిటీ అసలు దేనిని అంచనా వేస్తుంది? ఎలా అంచనా వేస్తుంది? అనే ప్రశ్నలను కూడా ఆవిడ చాలా సబబుగానే లేవనెత్తారు. గౌరవాచార్య పదవి పొందినప్పటి నుండి తను ప్రచురించిన పుస్తకాలకు, మరీ ముఖ్యంగా వాటిలో ప్రముఖమైన ‘ద పాస్ట్‌ బిఫోర్‌ అజ్‌’ (గతం మన ముందర) పుస్తకానికి గ్రేడింగ్‌ ఇస్తుందా అని అడిగారు. ప్రాచీన భారత దేశానికి చెందిన చరిత్ర రచనలపై ఇదొక మార్గదర్శక అధ్యయనం. చరిత్ర అధ్యయనాల్లో చేసిన కృషికి గాను 2008లో నోబెల్‌ బహుమతికి సమానమైన ‘క్లూజ్‌’ బహుమతి తనకు లభించిన వాస్తవాన్ని ఆ కమిటీ అంచనా వేస్తుందా అని కూడా అడిగారు. నోబెల్‌ బహుమతి కిందకు రాని అధ్యయనాంశాల్లో ఈ బహుమతి ఇస్తుంటారు. అలాగే తన మిగతా ప్రచురణలకు, ఇతర బహుమతులకు అది ఏ విధంగా గ్రేడింగ్‌ ఇస్తుందని ప్రశ్నించారు.
గమ్మత్తేమిటంటే, జెఎన్‌యు రిజిస్ట్రారు నుండి లేఖ అందటానికి కొద్ది రోజుల ముందు అమెరికన్‌ ఫిలసాఫికల్‌ సొసైటీ నుండి రొమిలా థాపర్‌ మరో లేఖ అందుకున్నారు. ఆ సొసైటీ సభ్యురాలిగా ఆమెను ఎంపిక చేశారన్నది ఆ లేఖ సారాంశం. ఆ సొసైటీ అమెరికాలోకెల్లా పురాతనమైనది. కేవలం మేధో విజయాల ప్రాతిపదికగా సొసైటీ సభ్యులను ఆచితూచి ఎంచుకుంటారు. ఒక ప్రముఖ భారతీయ మేధావి ఏ విశ్వవిద్యాలయానికైతే సంస్థాపక ఆచార్యురాలుగా అనేక దశాబ్దాల పాటు సేవ చేశారో…అదే విశ్వవిద్యాలయం ఆమె పట్ల చూపిన ఆదరణకు…ఒక విదేశీ మేధావుల సమాజం చూపిన ఆదరణకు…మధ్యనున్న వ్యత్యాసం ఉపేక్షింప వీలుగాని చేదు నిజం.
రొమిలా థాపర్‌కు వున్న ఈ గౌరవ హోదాపై పునరాలోచన చేసే ప్రయత్నాన్ని జెఎన్‌యు ‘చారిత్రక అధ్యయనాల కేంద్రం (సెంటర్‌ ఫర్‌ హిస్టారికల్‌ స్టడీస్‌)’ కూడా అభ్యంతర పెట్టింది. మన ఉన్నత విద్య నాణ్యతను పెంచే విషయమై బాగా చర్చ సాగుతున్న రోజులివి. అటువంటిది, మన దేశ విశిష్ట మేధావుల పట్ల మన విశ్వవిద్యాలయాలే ఇలా వ్యవహరిస్తే ఉన్నత విద్య నాణ్యత ఒట్టి భ్రమగానే మిగిలిపోతుంది.

Courtesy Prajasakthi..